SIT Probe : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హీట్ గానే ఉన్నాయి. తాజాగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో (2014 నుంచి 2019 మధ్య) అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి పాలనలో తీసుకున్న నిర్ణయాలపై విచారణకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (Special Investigation Team - SIT) విచారణకు ఆదేశించడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలైనా తమను ఏమీ చెయ్యలేకపోయిందనీ... తాజాగా ఇప్పుడు సిట్ వేయడం వెనక రాజకీయ కుట్ర ఉందని కొందరు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సిట్ వంకతో టీడీపీ నేతల్ని జైలుకు పంపాలని వైసీపీ నేతలు కలలు కంటున్నారనీ... కానీ... ఎన్ని సిట్లు వేసినా, ఎన్ని దర్యాప్తు సంస్థలతో దర్యాప్తులు జరిపించినా... వైసీపీ నేతల ఆశలు తీరవని అంటున్నారు. అసలు సిట్ వేయడానికి గత టీడీపీ ప్రభుత్వం ఏ తప్పు చేసిందని ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వం జారీ చేసిన జీవో
రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు, ఏర్పాటు చేసిన సంస్థలు, కార్పొరేషన్లు అన్నింటిపైనా సమగ్రంగా విచారించేందుకు సిట్‌ను ఏర్పాటు చేసింది జగన్ ప్రభుత్వం. జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణకు సబ్ కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇప్పుడు సిట్ దర్యాప్తు జరపనుంది. ఇంటెలిజెన్స్ ఐటీ కొల్లి రఘురామరెడ్డి అధ్వర్యంలో 10 మంది సభ్యుల సిట్ బృందం ఈ దర్యాప్తు చేయనుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం జీవో జారీచేసింది. దాని ప్రకారం జీవోలో చెప్పిన ఎవరినైనా విచారణకు పిలిచి, ప్రశ్నించే అధికారం సిట్‌కు ఉంది. అవినీతికి ఆధారాలు ఉంటే కేసులు రాసి, చార్జ్షీట్లు ఫైల్ చేయగలదు కూడా. అన్ని శాఖల అధికారులూ సిట్‌కి సంపూర్ణ సహకారం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం
ఏవైనా భూ రికార్డులు అవసరమైతే, సిట్ అధికారులకు అందించాలని ప్రభుత్వం ఆయా శాఖలకు సూచించింది. తద్వారా భూములకు సంబంధించి సిట్ ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అమరావతిని రాజధానిగా ప్రకటించకముందే... అక్కడ టీడీపీ నేతలు భారీ సంఖ్యలో భూములు కొనేసి ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారనీ, CRDA పరిధిలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు నిజమేననీ, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందంటూ కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ అంశంపై ఇప్పటికే... సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు ఇదే అంశంపై సిట్ కూడా ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే... అనంతపురంలో కియా కార్ల కంపెనీ స్థాపించకముందే... అక్కడ టీడీపీ నేతలు పెద్ద ఎత్తున భూములు కొనేశారని కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపైనా సిట్ ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.
అలాగే ఇటీవల ఏపీలో ఇన్‌కంటాక్స్ (ఐటీ దాడులు) అధికారుల దాడుల తర్వాత... బినామీ ఆస్తుల ఆరోపణల కలకలం రేగింది. సిట్ ద్వారా ఈ బినామీలు ఎవరు, ఏయే నేతలకు ఎవరెవరు బినామీలుగా ఉన్నారు? బినామీ పేర్లతో ఏయే నేతలకు ఎన్నెన్ని అక్రమ ఆస్తులున్నాయి? వంటి ఆరోపణలపై కూడా సిట్ దర్యాప్తు చేయనుందని తెలిసింది.
చంద్రబాబు సీఎంగా ఉన్న సమంయలో అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్న కార్మిక శాఖలో అవినీతి జరిగింది. తెలంగాణ తరహాలో ఈఎస్ఐ (ESI)లో మందుల కొను'గోల్మాల్' జరిగిందని కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. అంతకు ముందు విశాఖలో భారీ ఎత్తున భూ కుంభకోణం జరిగిందనే ఆరోపణలతో ఇప్పటికే ఓ సిట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ అన్ని అంశాల్నీ ఇప్పుడు సిట్ పరిశీలించి, విచారించి, రిపోర్ట్ రెడీ చెయ్యనుంది. ఇది టీడీపీకి పెద్ద దెబ్బే అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. టీడీపీ హయాంలో అవినీతి జరిగింది కాబట్టే... ప్రజలు పెద్ద సంఖ్యలో వైసీపీకి ఓటేసి గెలిపించారనీ, అదే అవినీతి జరగకపోయి ఉంటే... అంతలా వైసీపీకి భారీ విజయం దక్కేది కాదని అంటున్నారు. సిట్ దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అందువల్లే ఇప్పుడు టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారని విశ్లేషిస్తున్నారు. మొత్తంగా సిట్ ఏర్పాటు ఏపీ రాజకీయాల్ని మరింత వేడెక్కిస్తోంది.