P Anand Mohan, Visakhapatnam, News18
న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్, పుట్టినరోజు, పెళ్లిరోజు.. ఇలా వేడుక ఏదైనా ముందుగా గుర్తొచ్చేది కేక్. ఇలాంటి సమయాల్లో కేక్ కట్ చేసి తింటూ సెలబ్రేషన్స్ చేసుకోవడం ప్రస్తుతం అలవాటే. భిన్నమైన ఫ్లేవర్స్‌లో దొరికే ఈ కేక్‌ను ఏదో ఒక బేకరీ నుంచి కొనుగోలు చేస్తుంటాం. కానీ ఒకే దగ్గర వందల రకాల వెరైటీ కేక్ లు ఉండటం మీరు చూస్తే అవురా అనాల్సిందే. అదీ మహిళా మణులే తయారు చేసే కేక్ అంటే క్రేజీ కదా. ప్రస్తుతం సందర్భం ఏదైనా కేక్ కట్ చేయడం సాధారణంగా మారిపోయింది. అందులోనూ విభిన్న రకాలైన కేకులుపై అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ట్రెండ్ ను కొన్నేళ్ల క్రితమే అందిపుచ్చుకున్నారు ఓ మహిళ. ఆమె అడుగుజాడల్లో నడుస్తూ.. కుమార్తెలు కూడా కేక్ తయారీలో వైవిధ్యం ప్రదర్శిస్తున్నారు. చదువుకుంది సాంకేతిక విద్య అయినప్పటికీ.. కేకుల తయారీలో తమదైన ముద్ర వేస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విశాఖపట్నం (Visakhapatnam) కు చెందిన కేక్ సిస్టర్స్.
వైజాగ్ కు చెందిన రమ్య, జనార్ధన్ రావు దంపతులకు.. ప్రీతి, ప్రియ ఇద్దరమ్మాయిలు. పెద్దమ్మాయి ప్రీతి మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ పూర్తి చేసింది. ప్రియ బీటెక్ పూర్తి చేసింది. తల్లి రమ్యకు కేకులు తయారు చేయడం అలవాటు. దీనిని సరదాగా గమనించిన కుమార్తెలు.. క్రమంగా కేకుల తయారీపై తమ అభిరుచి పెంచుకున్నారు. కేక్‌లు తయారు చేయడమే కాదు.. విభిన్నమైన ఈ రుచుల్ని అందరికీ అందించాలనే తపనతో "పి అండ్ పి పేస్ట్రీస్" పేరిట ఓ వేదిక సిద్ధం చేశారు. అందుకోసం.. ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు తీసుకున్నారు. ఇన్స్టాగ్రామ్ (Instagram), ఫేస్ బుక్ (Facebook), వాట్సాప్ (Whatsapp), టెలిగ్రామ్ (Telegram) వంటి సోషల్ మీడియా (Social Media) ఫ్లాట్ ఫామ్స్ లో తమ ఉత్పత్తులు పోస్ట్ చేస్తున్నారు.
పూర్తిగా శాకాహారులు, వివిధ దీక్షలలో ఉన్నవారి వారి ఆకాంక్షలకు అనుగుణంగా కేకులు సిద్ధం చేస్తూ మన్ననలు పొందుతున్నారు.వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించడంతో.. క్రమంగా కొత్త ప్రయోగాలు చేయడం మెుదలుపెట్టారు. లాక్డౌన్ సమయంలో ఇంటి వద్దే ఉండటం కలిసి వచ్చింది. ఆ సమయంలోనూ ఆర్దర్లు తీసుకుని ఇంటి వద్దకే కేక్‌లు డెలివరీ చేశారు. అలా..ఎక్కడా ఒక దుకాణం గాని, ఒక ప్రకటన లేకుండానే.. భిన్నమైన కేక్ కావాలంటే "పి N పి పేస్ట్రీ" ని సంప్రదించాలన్న మౌత్ పబ్లిసిటీ సాధించగలిగారు.
కేక్ సాధారణంగా ఒక బేస్ పైనే ఉంటుంది. అలాకాకుండా వీరి ఇంజినీరింగ్ ప్రతిభతో.. వేలాడే కేకులు తయారు చేస్తున్నారు. వీటికి వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇదే ప్రోత్సాహంతో మున్ముందు ఈ పనిని.. ఓ పరిశ్రమగా వృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యమంటున్నారు.. ఈ కేక్ సిస్టర్స్.తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి తమకు ఇచ్చిన ప్రోత్సాహమే ఈ దిశగా నడిపిస్తోందని అక్కాచెల్లెళ్లు చెబుతున్నారు. అలాగే, తమ కుమార్తెలు కొత్త ప్రయోగాలు చేయడం, అభిరుచి మేరకు విభిన్నరీతిలో కేకులు రూపొందించి.. అందరి మన్ననలు పొందడం సంతోషాన్ని ఇస్తుందని తల్లిదండ్రులు అంటున్నారు. రుచితో, రూపంతో వినియోగదారులకు మరిన్ని కొత్త అనుభూతులు పంచేందుకు కేక్ తయారీలో పరిశోధనలు చేస్తామంటున్నారు.. ఈ విశాఖ సిస్టర్స్.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Visakhapatnam, Vizag