రిపోర్టర్: హేమంత్
లొకేషన్: శ్రీకాళహస్తి
భారతదేశంలోని పంచభూత లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన వాయులింగం శ్రీకాళహస్తీశ్వర లింగం. ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు స్వయంగా కొలువుదీరి ఉంటాడు. శ్రీకాళహస్తిలో గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ శివ లింగాన్ని ప్రాణం గల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు. దీనికి ఓ ప్రత్యేక కారణం కూడా ఉంది. ఆలయం గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్నా శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది. వాయు లింగంగా కొలువైన స్వామి వారి ఉఛ్వాశ నిశ్వాసల గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని నమ్ముతారు.అంతేకాకుండా ఈ శివలింగానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. దేశంలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాల్లో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తుంటారు. కొన్ని చోట్ల భక్తులకు కూడా ఆ అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ శివలింగాన్ని మాత్రం అర్చకులతో సహా ఎవరూ కూడా తాకరు.
Mahashivratri: మహాశివరాత్రి నుంచి మొదలు .. ఈ 5 రాశుల వారికి అపారమైన సంపద
ప్రాణ వాయులింగంగా పూజాలందుకునే ఈ లింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ కనిపిస్తుంది. అందుచేత శ్రీకాళహస్తీశ్వరున్ని కర్పూర లింగం కూడా పిలుస్తారు. నవగ్రహ కవచంతో ఉండే ఈ శివలింగాన్ని ప్రతిరోజూ పచ్చ కర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకిస్తారు.స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి ఉంది. భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన, పంచభూత లింగాలలో నాలుగవది అయిన వాయు లింగం ఇక్కడ పూజలందుకుంటుంది. అద్భుతమైన భారతీయ వాస్తు కళకు ఈ ఆలయ నిర్మాణ శైలి అద్దం పడుతుంది.
Maha Shivaratri 2023 : శివలింగాన్ని ఇలా ఉంచితే.. ధన యోగం, శివానుగ్రహం
పదకొండవ శతాబ్దంలో పల్లవులు నిర్మించిన పాత దేవాలయాన్ని చోళులు మెరుగు పరచడం జరిగింది. ఒకటవ కులోత్తుంగ చోళుడు ప్రవేశ ద్వారం వద్దగల దక్షిణ గాలి గోపురాన్ని నిర్మించాడు. మూడవ కులోత్తుంగ చోళుడు ఇతర ఆలయాల్ని నిర్మించాడు. క్రీస్తుశకం 12వ శతాబ్దానికి చెందిన వీరనరసింహ యాదవరాయ అనే రాజు ప్రస్తుతం ఉన్న ప్రాకారాలను, నాలుగు ద్వారాలను కలిపే గోపురాలను నిర్మించాడు. క్రీస్తుశకం 1516 విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయల రాతిపై చెక్కించిన రచనల ఆధారంగా ఆయన వంద స్తంభాలు కలిగిన మంటపం, అన్నింటికన్నా తూర్పు పడమర దిక్కుల వైపుకు ఉన్న ఎత్తైన గాలిగోపురం నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ గోపురాన్ని 1516 వ సంవత్సరంలో గజపతులపై విజయానికి సూచనగా నిర్మించినట్లు తెలియజేస్తుంది. ఈ గోపురం 2010 మే 26 న కూలిపోయింది.
ఈ క్షేత్రానికి దక్షిణ కైలాసం, సద్యోముక్తిక్షేత్రం, శివానందైక నిలయం, సత్య మహా భాస్కర క్షేత్రం అనే వివిధ పేర్లు ఉన్నాయి. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగా, స్వామి వారు శ్రీకాళహస్తీశ్వరుడు పశ్చిమాభిముఖంగా దర్శనం ఇస్తారు. గణపతి ఉత్తర దిక్కుగా, దక్షిణామూర్తి దక్షిణ దిక్కుగా ఉంటారు.పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్పకు కొండపైన దేవాలయం ఉంటే, శ్రీకాళహస్తీశ్వరుడికి పాదాల కింద ఆలయం ఉంటుంది. అందుకే పరమేశ్వరున్ని భక్త వల్లభుడు అని కూడా పిలుస్తారు. మహాశివరాత్రి రోజున ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో తొలి పూజను కొండపై ఉన్న కన్నప్ప ఆలయంలో చేయడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Local News, Srikalahasti