మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Vivekananda Reddy Murder Case) లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అప్రూవర్ గా మారిన వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదు వివరాలు బయటకు వచ్చాయి. కడప జిల్లా (Kadapa District) పులివెందుల కోర్టులో నిందితులకు సంబంధించిన ఛార్జి షీట్లు, ఫిర్యాదుల వివారాలను సీబీఐ అధికారులు న్యాయవాదులకు సమర్పించారు. దీంతో వాంగ్మూలం ఇచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది ఆగస్టు 31న ప్రొద్దుటూరు కోర్టులో వాగ్మూలం ఇచ్చిన తర్వాత.. తనను లొంగదీసుకునేందుకు పలువురు యత్నించారని దస్తగిరి పేర్కొన్నారు. గత ఏడాది సెప్టెంబర్ 30న తనను కలిసిన వారి వివరాలను సీబీఐకి ఇచ్చిన దస్తగిరి.. వారి నుంచి ఎదుర్కొన్న పరిస్థితులను వివరించారు.
వాంగ్మూలం ఇచ్చిన తర్వాత తరచూ భరత్ యాదవ్ తనను కలిసేందుకు వచ్చాడని.. సీబీఐకి చెప్పిన విషయాలతో పాటు స్టేట్ మెంట్ లో ఏముందనే అంశాలని దెవిరెడ్డి శివశంకర్ రెడ్డికి, అవినాష్ రెడ్డికి చెప్పాలని ఒత్తిడి చేసినట్లు దస్తగిరి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అవినాష్ రెడ్డికి చెందిన తోట వద్దకు రావాలని భరత్ యాదవ్ అడిగినట్లు తెలిపారు. ఐతే తాను సీబీఐ నిఘాలో ఉన్నందున రాలేనని చెప్పినట్లు అందులో ఉన్నట్లు తెలుస్తోంది.
ఎంతకావాలంటే అంత ఇస్తాం..!
ఓ రోజు తన ఇంటికి దగ్గర్లో ఉన్న హెలిపాడ్ వద్దకు భరత్ యాదవ్ తో పాటు లాయర్ కూడా వచ్చారని.. తాను అక్కడికి వెళ్లగా.. తమను భాస్కర్ రెడ్డి, శంకర్ రెడ్డి పంపారని.. 10-20 ఎకరాల భూమి ఇస్తామని ఆఫర్ ఇచ్చారని దస్తగిరి వెల్లడించినట్ల సీబీఐ ఇచ్చిన వివరాల్లో ఉన్నట్లు సమాచారం. అలాగే ఎంత డబ్బుకావాలో చెప్పమన్నారని స్టెట్ మెంట్ ఇచ్చారట. మరోవైపు ఇకపై సీబీఐకి ఎలాంటి విషయాలు చెప్పొద్దని.. అలాగే సీబీఐకి ఇచ్చిన స్టేట్ మెంట్ లోని వివరాలన్నీ తమకు చెప్పాలని దస్తగిరిపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. అలాగే దస్తగిరి ఎక్కడెక్కడికి వెళ్తున్నది.. ఎవరెవర్ని కలుస్తున్నదీ తెలుసుకునేందుకు భరత్ యాదవ్ నిఘాపెట్టినట్లు సీబీఐ పేర్కొన్నట్లు సమాచారం.
విచారణ జిల్లా కోర్టుకు బదిలీ
ఇదిలా ఉంటే వివేకా హత్య కేసు విచారణ పులివెందుల కోర్టు నుంచి కడప జిల్లా కోర్టుకు బదిలీ అయింది. ఈ మేరకు పులివెందుల మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై ఈ కేసుకు సంబంధించిన విచారణ, బెయిల్, వాయిదా అంశాలన్నీ అక్కడే జరుగుతాయని న్యాయమూర్తి తెలిపారు. మంగళవారం పలివెందుల కోర్టుకు నిందితులు హాజరుకాగా.. సీబీఐ ఛార్జ్ షీట్ లోని వివరాలను వారికి అందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.