హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizianagaram: బొబ్బిలి ఆలయ నగల లెక్కింపులో సంచలనం.. లెక్కకు మించి వజ్ర, వైఢూర్యాలు

Vizianagaram: బొబ్బిలి ఆలయ నగల లెక్కింపులో సంచలనం.. లెక్కకు మించి వజ్ర, వైఢూర్యాలు

ఆలయంలో నగలు తనిఖీలు చేస్తున్న అధికారులు

ఆలయంలో నగలు తనిఖీలు చేస్తున్న అధికారులు

ప్రభుత్వ ఆదేశాలతో బొబ్బిలి రాజుల ఆధ్వర్యంలో ఉన్న రెండు ప్రధాన ఆలయాల్లో దేవదాయ శాఖ ఉన్నతాధికారులు మూడు రోజుల పాటు విస్తృతంగా తనిఖీలు చేశారు. పటిష్ట పోలీస్‌ బందోబస్త్‌ మధ్య ఆభరణాల లెక్కింపు చేపట్టారు. కట్టర్‌తో ఇనుప పెట్టెలను తెరిచి లెక్కగట్టారు. చివరకు బొబ్బిలి వేణుగోపాల స్వామి ఆలయంలో జాబితాలో కంటే ఎక్కువ నగలు ఉన్నట్లు గుర్తించారు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం గుళ్లసీతారాంపురంలోని సీతారాముల ఆలయ ఆభరణాలు, ఆస్తుల లెక్కింపు తంతును పూర్తి చేశారు.

ఇంకా చదవండి ...

బొబ్బిలి రాజుల ఆధ్వర్యంలోని రెండు చారిత్రక ఆలయాల ఆస్తుల లెక్కింపులో సంచలన విషయం బయటపడింది. ఆలయంలో ఆస్తులు పక్కదారి పడుతున్నాయని మంత్రులు ఆరోపించడంతో మూడు రోజులుగా ఆలయాల్లో తనిఖీలు జరిగాయి. దశాబ్దాలుగా బ్యాంకు లాకర్లలో ఉన్న ఆభరణాలను అధికారులు బయటకు తీసి లెక్కించారు. వజ్ర వైఢూర్యాలు, పచ్చలు, గోమేధికాలు, కెంపులు, ముత్యాల హారాలు ఇలా ప్రతి వస్తువునూ దేవదాయ శాఖ వద్ద ఉన్న జాబితా ప్రకారం సరి చూశారు. ఆలయాల్లో ఎలాంటి నగలు, ఆభరణాలు మాయం కాలేదని దేవాదాయ శాఖ చెప్పింది. అంతా పారదర్శకంగానే ఉందని స్పష్టంచేసింది. కానీ, లెక్కల్లో ఉన్నదానికంటే ఎక్కువగా ఆభరణాలు ఉన్నాయనే సంచలన విషయం బయటపెట్టింది. బొబ్బిలి రాజుల ఆధ్వర్యంలో నడుస్తున్న ఆలయాల ఆస్తుల విషయంలో ఏదో జరిగిపోతోందన్న మంత్రుల ప్రకటనలు, అనుమానాలు ఈ లెక్కింపుతో నిర్వీర్వమైపోయాయి. మంత్రులు అనుమానం వ్యక్తం చేసి నెలరోజులు కాకముందే కమిటీ వేయడం, ఆ కమిటీ ఎలాంటి అవకతవకలు జరగలేదని తేల్చడంతో.. కొండను తవ్వి ఎలుకను పట్టారన్న విమర్శ మాత్రం మిగిలిపోయింది. బొబ్బిలి రాజులు.. దేవాలయ ఆస్తులను పక్కదోవ పట్టించి ఉంటారన్న అనుమానాలతో .. వారిని ఇరుకున పెట్టాలని భావించిన ప్రభుత్వ పెద్దలు.. తిరిగి వారిని సేఫ్ జోన్ లో పెట్టినట్లయింది.

ధర్మకర్త సమక్షంలో తనిఖీలు..

బొబ్బిల రాజుల ఆధ్వర్యంలోని రెండు ఆలయాల్లో అవకతవకలు జరుగుతున్నాయని ప్రభుత్వ పెద్దలు అనుమానం వ్యక్తంచేసి,  దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటుచేశారు. దీంతో రెండు ప్రధాన ఆలయాల్లో దేవదాయ శాఖ ఉన్నతాధికారులు మూడు రోజుల పాటు విస్తృతంగా తనిఖీలు చేశారు. ఉన్నతాధికారులు, ఆలయాల వంశపారంపర్య ధర్మకర్త, మాజీ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు సమక్షంలో రెండు రోజుల పాటు బొబ్బిలిలో తనిఖీలు జరిగాయి. పటిష్ట పోలీస్‌ బందోబస్త్‌ మధ్య ఆభరణాల లెక్కింపు చేపట్టారు.  చివరకు బొబ్బిలి వేణుగోపాల స్వామి ఆలయంలో జాబితాలో కంటే ఎక్కువ నగలు ఉన్నట్లు గుర్తించారు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం గుళ్లసీతారాంపురంలోని సీతారాముల ఆలయ ఆభరణాలు, ఆస్తుల లెక్కింపు తంతును బుధవారం పూర్తి చేశారు. అక్కడ కూడా సేమ్ రిజల్ట్.. అంతా పారదర్శకమే.. అన్నీ ఆభరణాల లెక్కలు రికార్డులతో సరిపోయాయి. బొబ్బిలి రాజుల కోటలోని భాండాగారంలో భద్రపర్చిన వేణుగోపాల స్వామి నగలను కూడా లెక్కగట్టారు. ఇనుప పెట్టె తాళాలు తెరిచేందుకు వీలు కాని పరిస్థితి ఎదురైంది. దశాబ్దాలుగా తెరవని కారణంగానే తాళాలు మొరాయించాయి. చివరికి గ్యాస్‌ కట్టర్‌ ఆధారంగా పైకప్పును తెరిచారు. కళ్లు చెదిరే ఆభరణాలు, వజ్ర కిరీటాలను గుర్తించారు. నగిషీలు చెక్కిన ఆభరణాలు, వీటికి పొందికగా అద్దిన కెంపులు, రత్నాలు బయటకు తీసి లెక్కగట్టారు. చివరికి అన్ని సక్రమంగానే ఉన్నాయని తేల్చారు. బంగారు ఆభరణాలు, వివిధ ఆకృతుల్లో ఉన్న వెండి నగలు, బొబ్బిలి రాజుల కాలంనాటి విలువైన వస్తువులను గుర్తించారు. ఐదు శతాబ్దాల చరిత్ర కలిగిన సీతారాముల సంపద చూసి వారే ఆశ్చర్యపోయారు. రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌ సురేష్‌బాబు, జాయింట్‌ కమిషనర్‌ భ్రమరాంబ ఆధ్వర్యంలో ఈ ఆభరణాల లెక్కింపు నిర్వహించారు. ఈ ఆలయానికి సంబంధించిన బంగారు ఆభరణాలు బొబ్బిలి బ్యాంక్‌ లాకర్‌లో (బంగారం 10 కిలోలు) ఉన్నట్లు నిర్ధారించారు. కాగా, 10 కిలోల బంగారు ఆభరణాల్లో భుజికీర్తులు, కిరీటాలు, వజ్రాలతో పొదిగిన కర్హపత్రాలు, రత్నాలు, కెంపులతో పొదిగిన కుందనాలు, గొలుసులు, మిర్యాల పీటలు, పెద్ద ముత్యాల చేరులు, తాళితో వున్న జడపాళీలు, సర్పరత్నాలు, ముత్యాల గొలుసులు, కెంపుల తాడు, అందెల ముక్కలు, కడియాలు వంటి 67 ఆభరణాలు ఉన్నట్లు ఇప్పటికే బొబ్బిలిలో అధికారుల గణనలో తేలింది. ఇక్కడ మాత్రం 35 కిలోల వెండితో తయారు చేసిన 95 రకాల వస్తువులను లెక్కించారు. ఇక మూడో రోజున శ్రీకాకుళం జిల్లాలోని సంతకవిటి మండలం, గుళ్ల సీతారాంపురం సీతారాముల ఆలయంలో ఆభరణాలను లెక్కించారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా గుళ్లసీతారాంపురం సీతారాముల ఆలయంలో ఆభరణాలను పరిశీలించారు. 35 కిలోల వెండి, పావుకిలో బంగారు ఆభరణాలు ఉన్నట్టు లెక్కతేల్చారు. ఈ తంతు పూర్తయ్యాక రాజాం స్టేట్‌బ్యాంక్‌ లాకర్‌లో నగలను తిరిగి భద్రపర్చారు. ఈ సందర్భంగా దేవదాయ శాఖ రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌ సురేష్‌బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆభరణాల పరిశీలన పూర్తి చేశామని, రికార్డుల్లో పొందుపర్చిన మేరకు అన్ని ఆభరణాలు ఉన్నాయని వెల్లడించారు. ఇదే విషయంపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు.

భూముల లెక్కలూ తేల్చండి..

ఇక బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆలయానికి బొబ్బిలి చుట్టుపక్కల గ్రామాల్లో 4 వేల ఎకరాల భూములున్నాయి. ఇందులో వేలాది ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. వాటి సంరక్షణ కోసం ఆలయ భూములన్నీ గుర్తించాలని కొందరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. ఆ కేసు నడుస్తోంది. రాజులే వెనుక ఉండి కేసు వేయించారన్నది ప్రభుత్వ అనుమానం. ఆభరణాల లెక్క సరిపోయిందని తేలడంతో .. ఇక రెండు ఆలయాల భూముల లెక్కలను దేవదాయ శాఖ మంత్రి, ఆశాఖ ఉన్నతాధికారులే తేల్చాల్సి ఉంది. వేల ఎకరాలను మళ్లీ దేవదాయ శాఖ ఆధీనంలోకి(ట్రస్టు బోర్డు) తీసుకురావాల్సిన అవసరం ఉంది.  బొబ్బిలి వేణుగోపాస్వామి దేవస్థానం అనువంశ ధర్మకర్త అయిన సుజయ్ కృష్ణ రంగారావు మాట్లాడుతూ .. గత మూడు రోజులుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆభరణాలను, గుళ్ల సీతారాంపురం రాములవారి ఆభరణాల లెక్కింపును చేపట్టిందన్నారు. ఆభరణాలు లెక్క పూర్తిగా సరిపోవడంతో పాటు కొంత అధికంగా ఆభరణాలు ఉన్నాయని అధికారులు గుర్తించారన్నారు. ప్రభుత్వం ఎందుకు, ఏ ఉద్దేశంతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిందో ప్రజలకు తెలుసునని, ఏదేమైనా ప్రభుత్వం, మంత్రులు సృష్టించిన అపోహలు తొలిగిపోయాయని భావిస్తున్నానని చెప్పారు. ఈ తరహాలోనే మా బొబ్బిలి వంశ పూర్వికులు ఆలయాలకు ఇచ్చిన దాదాపు 4 వేల ఎకరాలను లెక్కతేల్చే ప్రక్రియ కూడా చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ కూడా రాస్తానని సుజయ్ తెలిపారు.


ఇకపై ఆభరణాలు మీరే భద్రపరచండి..

ఆభరణాలను పెద్డ మనసుతో బొబ్బిలి కోట బాండాగారంలో భద్రపరిస్తే ప్రజల్లో అనేక అనుమానాలు వచ్చే విధంగా మంత్రులు, వైసీపీ నాయకులు ప్రచారం చేశారని, ప్రత్యేక కమిటీ దర్యాప్తు మాకు మంచే చేసిందన్న ఆనందాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇకపై ఆభరణాలను మేము భద్రపరచబోమని.. వాటిని అధికారులకే అప్పజెప్పేస్తామన్నారు. అపోహలు తొలగిపోయాయి కాబట్టి.. ఇప్పటికైనా ఆలయాల నిర్వహణ సరిగా చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ముందుకు వచ్చినా.. రాకున్నా ధూపదీప నైవేద్యాలకు ఇబ్బంది లేకుండా ధర్మకర్తలుగా మేం ఎప్పుడూ ముందుంటామని రంగారావు స్పష్టంచేశారు.

First published:

Tags: Andhra Pradesh, Temple, Vizianagaram

ఉత్తమ కథలు