SVBC Chairman: 30 ఇయర్స్ పృధ్వీ ఎపిసోడ్ తర్వాత ఎస్వీబీసీకి కొత్త చైర్మన్ నియామకం

తిరుమల ఆలయం(ఫైల్ ఫొటో)

నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన సాయికృష్ణ యచేంద్రను ఎస్వీబీసీ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  • Share this:
    శ్రీవేంకటేశ్వర భక్తి చానల్‌కు కొత్త చైర్మన్‌ను నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన సాయికృష్ణ యచేంద్రను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ఎమ్మెల్యే అయిన సాయికృష్ణ పదవిలో రెండేళ్లపాటు కొనసాగనున్నారు. ఈ మేరకు టీటీడీ ఈవో తగిన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

    ఈ ఏడాది జనవరిలో ఎస్వీబీసీ చైర్మన్ పదవికి 30 ఇయర్స్ పృథ్వీ రాజీనామా చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పృథ్వీని ఎస్వీబీసీ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. అయితే, ఓ మహిళతో పృథ్వీ ఫోన్‌లో సరస సంభాషణలు చేసిన ఆడియో బయటకు వచ్చింది. ఆడియో టేపుల వ్యవహారంపై దుమారం రేగడంతో ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి పృథ్వీరాజ్ జనవరి 12న రాజీనామా చేశారు. మహిళా ఉద్యోగితో రొమాంటిక్‌గా మాట్లాడిన ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఆ వ్యవహారంపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. దీంతో ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకోవాల్సిందిగా అల్టిమేటం జారీ చేశారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని పృథ్వీరాజ్‌ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు. దాంతో ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. పార్టీ అధ్యక్షుడి ఆదేశాలను గౌరవిస్తూ రాజీనామా చేస్తున్నానని అప్పట్లో చెప్పారు.

    తన వాయిస్‌ను మార్ఫింగ్ చేశారని పృథ్వీరాజ్ ఆరోపించారు. ‘నాపై వచ్చిన ఆరోపణలకు బాధపడుతున్నా. నా వాయిస్ మార్ఫింగ్ చేశారు. ఫేక్ వాయిస్ పెట్టి నన్ను అప్రతిష్టపాలు చేశారు. పార్టీ అధ్యక్షుడి మాటను గౌరవించాలి. అందుకే ఎస్వీబీసీ ఛైర్మన్ రాజీనామా చేస్తున్నా. నన్ను కొందరు దెబ్బకొట్టాలని చూశారు. నన్ను వ్యక్తిగతంగా దెబ్బతీసిన ప్రతిపక్షాలకు నా సెల్యూట్. పద్మావతి గెస్ట్ హౌస్‌లో మందు కొట్టాననడం అవాస్తవం. ఎంక్వైరీ కమిటీ నివేదిక వచ్చాక తిరిగి పదవి చేపడతా. ’ అని ఆసమయంలో పృధ్వీరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.

    అయితే, తన వెనుక కొందరు కుట్ర పన్ని ఇరికించారని పృధ్వీరాజ్ ఆరోపించారు. ‘నన్ను ఏ రకంగా దెబ్బకొట్టాలని ఒకటే ఆలోచించారు. నా గొంతు నొక్కేయాలని చూశారు. నేను శబరిమలలో ఉన్నప్పుడు మీడియా మిత్రుడు ఒకరు ఫోన్ చేశారు. అతని పేరు మాత్రం నేను చెప్పను. నా మీద పెద్ద కుట్రకు ప్లాన్ చేస్తున్నారని చెప్పారు. నా మీద కుట్ర చేయడం ఏంటి? నేనేమన్నా స్కాముల్లో ఉన్న మంత్రినా?, హత్యలు చేశానా?, రౌడీ షీటర్‌నాఅనుకున్నా. నా వాయిస్ కొంతమందికి అడ్డంగా ఉందని చెప్పాడు. ఆ గొంతు లేకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలిపాడు. చైర్మన్ పదవిలో ఉంచకూడదని, అదఃపాతాళానికి తొక్కేయాలని కుట్ర చేసినట్టు చెప్పారు. కానీ, నేను స్వామిని నమ్ముకున్నా. అవేమీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, అది ఇంతవరకు దారితీస్తుందనుకోలేదు.’ అని కూడా పృథ్వీరాజ్ చెప్పారు.

    ఎస్వీబీసీలో పనిచేసే ఓ ఉద్యోగినితో పృథ్వీ జరిపిన సంభాషణల ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి నుంచి ఆయన్ను తప్పించాలని శ్రీవారి భక్తులు, నెటిజన్లు, మహిళా సంఘాలు డిమాండ్ చేయడంతో ప్రభుత్వం ఆయనతో రాజీనామా చేయించింది. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న పోస్టును ఇప్పుడు భర్తీ చేసింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: