ప్రతిపక్షాల విమర్శలే తమ నినాదాలు... బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ... అధికార పార్టీల కొత్త ఎత్తుగడ

Lok Sabha Elections 2019 : ప్రతిపక్షాలకు దీటుగా సమాధానం ఇస్తున్న అధికారపక్షాలు... ఏమాత్రం వెనకడుగు వెయ్యకపోవడం కొత్త విధానం.

Krishna Kumar N | news18-telugu
Updated: April 2, 2019, 5:54 AM IST
ప్రతిపక్షాల విమర్శలే తమ నినాదాలు... బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ... అధికార పార్టీల కొత్త ఎత్తుగడ
చంద్రబాబు, మోదీ, కేసీఆర్
  • Share this:
సాధారణంగా ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న పార్టీల కంటే ప్రతిపక్షాలే ఎక్కువ జోరుతో ఉంటాయి. ఇంకా చెప్పాలంటే అధికార పక్షానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తాయి. వరుస విమర్శలు, ఆరోపణలతో ముచ్చెమటలు పట్టిస్తాయి. ఈసారి ఎన్నికల్లో మాత్రం అలాంటి సీన్ కనిపించట్లేదు. ముఖ్యంగా ప్రతిపక్షాలు చేసే ఆరోపణలనే తమ అస్త్రాలుగా మలచుకుంటున్నాయి అధికార పార్టీలు. ఏ ఆరోపణలను ప్రత్యర్థి పార్టీలు ఎక్కువగా తమపై రుద్దుతారో... వాటినే నినాదాలుగా మలచుకుంటూ... ప్రతిపక్షాలకు సవాల్ విసురుతుండటం ప్రజాస్వామ్యంలో కొత్త విధానం. ఊహించని ఈ పరిణామంతో వైరిపక్షాలు సంకట స్థితిని ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది ప్రస్తుత రాజకీయం.

బీజేపీ చౌకీదార్ నినాదం : దేశ ప్రధాని నరేంద్ర మోదీ... 2014 నుంచీ తనను తాను ఈ దేశానికి చౌకీదార్ (కాపలాదారు) అని చెప్పుకుంటున్నారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో ప్రధాని మోదీ అవినీతిరి పాల్పడ్డారనీ, నీరవ్ మోదీ, విజయ్ మాల్యా లాంటి కార్పొరేట్ మోసగాళ్లను దేశం దాటిస్తూ... వాళ్లకు కాపలాదారుగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తూనే ఉంది. సరిగ్గా ఎన్నికలు వచ్చే సరికి... కాంగ్రెస్ చేస్తున్న ఆ ఆరోపణలనే తమ పార్టీ నినాదంగా మార్చుకున్నారు నరేంద్ర మోదీ. అవును నేను చౌకీదారునే అంటూ తన ట్విట్టర్ అకౌంట్‌లో తన పేరు ముందు చౌకీదార్‌ని చేర్చారు. తద్వారా బీజేపీ అగ్ర నేతలంతా అదే ఫాలో అయ్యారు.

చౌకీదార్ నినాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్తే మోదీ... ఢిల్లీలో నేను కూడా చౌకీదారునే పేరుతో ఓ సదస్సు నిర్వహించి మరీ కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు దీటుగా సమాధానం ఇచ్చారు. మోదీ తీసుకున్న టర్న్ కాంగ్రెస్‌ను ఇబ్బందుల్లోకి నెట్టిందనే చెప్పాలి. మోదీ చౌకీదారు కాదు... చోర్ అంటూ రాహుల్ చేస్తున్న విమర్శల కంటే... మోదీ చౌకీదారే అనే నినాదం ప్రజల్లోకి ఎక్కువగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది దేశ రాజకీయం.


తెలంగాణలో సారు, కారు నినాదం : తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతోనే దొరల పాలన మొదలైందనీ, కేసీఆర్ నియంతలా పాలిస్తున్నారనీ, కుటుంబపాలన సాగుతోందనీ కాంగ్రెస్ ఎన్నో విమర్శలు చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రజాకూటమి ఇవే ఆరోపణలతో ప్రజల్లోకి వెళ్లింది. కానీ... కాంగ్రెస్ ఆరోపణలన్నీ ప్రజా ఓటు ముందు తేలిపోయాయి. ఇదివరకటి కంటే ఎక్కువ మెజార్టీ రావడంతో కేసీఆర్ సౌత్ ఇండియాలో తిరుగులేని నేతగా ఆవిర్భవించారు. ఇక తమకు అడ్డే లేదని భావిస్తున్న టీఆర్ఎస్... లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ ఆరోపణల్లో నుంచే నినాదాన్ని వెతుక్కుంది. అవును కేసీఆర్ సారే... అంటూ... సారు, కారు, పదహారు... ఢిల్లీలో సర్కారు అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లింది.ఇప్పటికైతే టీఆర్ఎస్ తమ నినాదంపై పూర్తి నమ్మకంతో ఉంది. కేసీఆర్ ఎవరికి సారు అంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తున్నా... ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఐతే... ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి... ఆ పార్టీకి కలవరం కలిగించే అంశమే. అయినప్పటికీ... ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటైన కేటీఆర్... పదే పదే అదే నినాదాన్ని గుర్తుచేస్తూ... కాంగ్రెస్ పెద్దలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు.


జాబు కావాలంటే బాబే రావాలి : 2014లో నవ్యాంధ్ర అసెంబ్లీ ఎన్నికలప్పుడు జాబు కావాలంటే చంద్రబాబు రావాలనే ప్రచారం బాగా జరిగింది. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో ఉద్యోగాల కల్పన మాత్రం జరగలేదు. దానికి కారణం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమేననీ, రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రధాని మోదీ రాష్ట్రానికి అన్యాయం చేశారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. తద్వారా ఉద్యోగాలు ఎక్కువగా కల్పించలేకపోవడానికి తన తప్పేమీ లేదన్న సంకేతాలిస్తున్నారు. ఐతే... బాబు వచ్చినా జాబు రాలేదని వైసీపీ విమర్శలు చేస్తుంటే... వాటినే నినాదంగా మలచుకున్న చంద్రబాబు... ఎన్నికల ప్రచారంలో... జాబు కావాలంటే బాబే రావాలి... మళ్లీ మళ్లీ బాబే రావాలి అంటూ... మైకులు పగిలిపోయేలా ప్రసంగాలు చేస్తున్నారు. తద్వారా వైసీపీ విమర్శల దాటిని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇలా అధికారంలో ఉన్న పార్టీలు... ప్రతిపక్షాలకు ఏమాత్రం భయపడకపోగా... ప్రతిపక్షాల విమర్శలనే తమ నినాదాలుగా చేసుకుంటూ ప్రచారం సాగిస్తుండటం ఈసారి ఎన్నికల్లో కనిపిస్తున్న దృశ్యం. మరి ఈ ఫార్ములా ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో తెలియాలంటే మే రావాలి.
First published: April 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>