Andhra Pradesh: బాబోయ్ సంక్రాంతి జర్నీ..! బస్సెక్కితే బాదుడే బాదుడు..!

ప్రతీకాత్మక చిత్రం

సంక్రాంతి సీజన్ లో హైదరాబాద్ (Hyderabad) నుంచి ఏపీకి (Andhra Pradesh) వచ్చేవారి సంఖ్య భారీగా ఉంటుంది. రద్దీని క్యాష్ చేసుకునేందుకు ఆర్టీసీతో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి.

  • Share this:
    సంక్రాంతి వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉండే సందడి అంతా ఇంతా కాదు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉండేవారు కూడా పెద్ద పండుగకు స్వగ్రామాలకు వస్తుంటారు. ఏటా సంక్రాంతి సీజన్ లో లక్షలాది మంది ఏపీకి ప్రయాణం సాగిస్తారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు దోపిడీ మొదలుపెట్టాయి. ప్రయాణికులకు షాకిస్తూ ఒక్కసారిగా ఛార్జీలు పెంచేశాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చే వారి జేబులు గుల్లవుతున్నాయి. ఏపీకి వెళ్లేందుకు బస్సెక్కుతున్నవారు ఛార్జీలను చూసి కళ్లు తేలేస్తున్నారు. ఏందో పండక్కి సొంతూరు వెళ్లి నాలుగు రోజులు ఎంజాయ్ చేద్దామనుకుంటే ప్రయాణంలోనే వారికి నిలువుదోపిడీ అయిపోతోంది. దూరాన్ని బట్టి, రద్దీని బట్టి, డిమాండ్ ను బట్టి అప్పటికప్పుడే ఛార్జీలు పెంచేస్తున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.

    ఛార్జీల మోత
    సాధారణంగా విజయవాడ వెళ్లాలంటే ఆర్టీసీ బస్సుకు రూ.400 ఉంది. ఇంద్ర, గరుడ, అమరావతి బస్సులకైతే ఇది దాదాపు రూ.650 వరకు ఉంది. అదే ప్రైవేట్ ట్రావెల్స్ లో అయితై రూ.800 నుంచి రూ.1200 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే రాజమండ్రికి ఆర్టీసీ బస్సులో ఛార్జీలు రూ.900 ఉంటే.. ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సుల్లో రూ.1,400-1,600 వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చే ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ సర్వీసులో ఛార్జీ రూ.600 ఉండగా, ప్రత్యేక సర్వీసుల్లో రూ.900 వరకు ఉంది. ఇక హైదరాబాద్‌ టు ఏలూరుకు ఆర్టీసీ సూపర్‌లగ్జరీ ఛార్జీ రూ.485 ఉంటే కాగా., సంక్రాంత్రి స్పెషల్ ప్రత్యేక బస్సుల్లో రూ.720 ఉంది. అదే ప్రైవేట్ ట్రావెల్స్ లో వెళ్లాలంటే రూ.1300-1500 చెల్లించాల్సిందే. ఇక హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే ఆ ఛార్జీలు ఫ్లైట్ టికెట్లతో పోటీ పడుతున్నాయి. హైదరాబాద్ నుంచి వైజాగ్ కు ఆర్టీసీ సూపర్ లగ్జరీలో రూ.950 ఛార్జీ కాగా.. స్పెషల్ బస్సుల్లో రూ.1400 వరకు వసూలు చేస్తున్నారు. అదే ప్రైవేట్ ట్రావెల్స్ లో సూపర్ లగ్జరీకి దాదాపు రూ.2వేలు, ఎసీ, స్లీపర్ బస్సులకైతే అది డిమాండ్ ను బట్టి రూ.2,500 నుంచి రూ.3,000 వరకు ఉంది.

    మొదటికే మోసం..?
    ఇక సంక్రాంతి దృష్ట్యా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఈ సీజన్ లో హైదరాబాద్‌ నుంచి వైజాగ్, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వచ్చే సర్వీసులకు భారీ డిమాండ్ ఉంటుంది. ఈ సీజన్ కు రాష్ట్ర వ్యాప్తంగా 3,607 ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ఏపీఎస్ ఆర్టటీసీ ఏర్పాట్లు చేయగా.. హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాలకు 1,254 ప్రత్యేక సర్వీసులు నడుస్తున్నాయి. ఐతే కొవిడ్ భయం, ఛార్జీల మోత నేపథ్యంలో ఎక్కువ మంది బస్సుల కంటే సొంత వాహనాలకై మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆర్టీసీ రెగ్యులర్‌ రిజర్వేషన్లు కూడా 60 శాతం దాటడం లేదు. ప్రత్యేక సర్వీసుల్లో అయితే సగం ఆక్యుపెన్సీ కూడా సాధించలేదు. ఆర్టీసీ రిజర్వేషన్లను ఈనెల 8 నుంచి 13వ తేదీ వరకు ఆరురోజులు పరిశీలిస్తే రెగ్యులర్‌ సర్వీసుల్లో 60 శాతం సీట్లు కూడా నిండలేదు. స్పెషల్ సర్వీసుల్లో అయితే 48.03 శాతం రిజర్వేషన్లే ఉన్నాయి.
    Published by:Purna Chandra
    First published: