Sankranthi Cock Fight: పోలీసులకు పందెం కోళ్ల సవాల్..! సంక్రాంతి బరులు సిద్ధం..!

సంక్రాంతి కోడి పందేలకు సిద్ధమవుతున్న పందెం రాాయుళ్లు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో సంక్రాంతి పండుగ (Sankranthi Festival) సందర్భంగా కోడి పందేల కోసం పందేల రాయుళ్లు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది బరులు రెడీ అవుతున్నాయి.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సందడి నెలకొంది. పల్లెల్లో గంగిరెద్దులు, హరిదాసుల పాటలు, రంగవల్లులు, పిండి వంటల సందడి నెలకొంది. మరోవైపు కోడి పందేల కోసం పందేల రాయుళ్లు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది బరులు రెడీ అవుతున్నాయి. ఐతే హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. పందెం బరులను పోలీసులు, రెవెన్యూ అదికారులు ధ్వంసం చేస్తున్నారు. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో 500 బరులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు పోలీసులు 250 బరులను గుర్తించి ధ్వంసం చేశారు. 190 కేసులను నమోదు చేసి 574 మందిని బైండోవర్ చేశారు. వేల సంఖ్యలో కోడి కత్తులను సీజ్ చేశారు. ఇప్పటికే ఉభయగోదావరి జిల్లాల్లో 144, సెక్షన్ 30 అమలులో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. ఎక్కడైనా కోడి పందాలు, గుండాట, జూదం, పేకాట, అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తన్నారు.

  వందలాది బరులు
  తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందేలతోపాటు పేకాట, గుండాటలకు చాలా ప్రాంతాలు వేదికవుతున్నాయి. పోలీసు యంత్రాంగం ఇప్పటికే గ్రామాల్లో హెచ్చరికలు జారీ చేసినా.. పందేలు, జూదం నిర్వహణకు ఏర్పాట్లు మాత్రం చాపకింద నీరులా సాగిపోతున్నాయి. సంక్రాంతి వచ్చిందంటే జిల్లాలో రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు జూదం రూపంలో చేతులు మారుతుంటుంది. సంక్రాంతి సందర్భంగా కోడి పందేల బరులు భారీగా ఏర్పాటు చేస్తారు. వైరి వర్గాలు సైతం సంప్రదాయం పేరుతో ఒక్కటైపోతాయి. కాకినాడ, రాజమండ్రి, రావులపాలెం, అమలాపురం ప్రాంతాల్లో కోడిపందేల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ముమ్మిడివరం మండలంలో రాజుపాలెం, మార్కెట్‌ ప్రాంతం, అయినాపురం, కొత్తలంక, పల్లిపాలెం, క్రాపచింతలపూడి గ్రామాల్లో కోడిపందేల నిర్వహణకు బరులు సిద్ధమయ్యాయి. ఐ.పోలవరం మండలంలో కేశనకుర్రు, ఎదుర్లంకల్లోనూ కోడిపందేలు నిర్వహణకు నిర్వాహకులు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు. కాట్రేనికోన మండలంలో చెయ్యేరు, గెద్దనపల్లిలో పెద్దఎత్తున కోడిపందేలు నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. తాళ్లరేవు మండలంలో పిల్లంక, గోవలంక ప్రాంతాల్లో పందెం కోళ్లు సిద్ధమవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో బరులను వేలం ద్వారా రూ.లక్షల్లో విక్రయిస్తున్నారు.

  పశ్చిమలో కాయ్ రాజా కాయ్
  ఇటు పశ్చిమగోదావరి జిల్లాలో వందలాది బరులు సిద్ధమయ్యాయి. పందేల నిర్వాహకులు గతంలో మాదిరి కాకుండా కొత్త ప్రాంతాల్లో పందేలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మెయిన్ రోడ్డుకు రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో తోటల మధ్య బరులు సిద్ధమవుతున్నాయి. దీంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వెయ్యి మందికి పైగా బైండోవర్ కేసులు నమోదు చేసారు. దాదాపు 10వేల కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. కోళ్ల పెంపకం దారులపైనా ముందస్తు కేసులు నమోదు చేసిన పోలీసులు.., పొలాలు, తోటలను బరులకు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని భూముల యజమానులను హెచ్చరించారు. అలాగే జిల్లాలో కోడిపందేలను అరికట్టేందుకు 35 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పందేల సందర్భంగా భారీగా నగదు చేతులు మారే అవకాశముండటంతో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు కూడా దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

  ఐతే ఏడాదికి ఒకసారి వచ్చే సంక్రాంతికి కోడి పందాలు నిర్వహించడంపై నిషేధం విధించడాన్ని పందెం రాయుళ్లు తప్పుబడుతున్నారు. సంప్రదాయంగా నిర్వహించే పోటీలను కూడా అడ్డుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. సంప్రదాయంలో భాగంగా కేవలం పందేలు మాత్రమే వేస్తున్నామని.. బెట్టింగులు చేయడం లేదని చెప్తున్నారు. ఏది ఏమైనా పందేలు నిర్వహించి తీరుతామని స్పష్టం చేస్తున్నారు. కొన్ని చోట్ల రాజకీయ నాయకులే దగ్గరుండి పందేలకు ఏర్పాట్లు చేయిస్తున్నారు.
  Published by:Purna Chandra
  First published: