దేనికైనా ఎక్కువ కాలం ఓపిక పట్టే రోజులు కావివి. ఏదైనా అనుకుంటే వెంటనే అయిపోవాలన్న ఆలోచనలో ఉంటున్నాం. అందువల్ల ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగితే... 42 రోజుల తర్వాత ఫలితాలు వస్తాయంటే... అన్ని రోజులు ఆగాలా అని అందరూ చిరాకుపడుతున్నారు. ఇక బెట్టింగుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఎన్నికల టైంలో అసలు బెట్టింగ్ అంటే తెలియని వాళ్లు సైతం... తమ పక్కవాళ్లు ఫలానా అభ్యర్థిపై బెట్టింగ్ కాస్తే... తాము కూడా కాసారు. తమ బెట్ గెలిస్తే... దాదాపు రెట్టింపు డబ్బులు వస్తాయని అనుకున్నారు. ఎన్నికల తర్వాత వారం పాటూ ఇలాంటి బెట్టింగ్స్ జోరుగా సాగాయి. ఐతే... మే 23 దాకా ఆగడం పందెం రాయుళ్ల వల్ల కావట్లేదు. ఐపీఎల్ మ్యాచ్‌లపై బెట్టింగ్స్ కాస్తే... ఒక్క రోజులోనే ఫలితం వచ్చేస్తోంది. అలాంటిది రాజకీయ నేతలపై కాస్తే, ఫలితం సంగతేమో గానీ తమ బెట్ గెలుస్తామా లేదా అనే టెన్షన్ రోజురోజుకూ పెరిగిపోతోంది. అందుకే ఆ పొలిటికల్ బెట్టింగ్స్ని తలనొప్పిలా ఫీలవుతున్నారట చాలా మంది.
బెట్టింగ్స్ కేన్సిల్ : మొదట్లో హడావుడిగా పందేలు కాసిన వాళ్లు... ఇప్పుడు మళ్లీ లెక్కలేసుకుంటున్నా్రు. ఫలానా అభ్యర్థి గెలుస్తాడని భావించాం, కానీ ఆయన ఓడిపోయేలా ఉన్నాడు... మాకొద్దు... బెట్ కేన్సిల్ చేసుకుంటాం అంటూ డబ్బులు వెనక్కి తీసేసుకుంటున్నారు చాలా మంది. కంగారు పడకండి... మీరు గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి... ఎవరు ఏది చెప్పినా నమ్మేయడం కరెక్టు కాదని బుకీలు చెబుతున్నా వినట్లేదట. ఇలాగైతే... తమ బెట్టింగ్ బిజినెస్ దెబ్బతింటుందని టెన్షన్ పడుతున్నారట బుకీలు, పంటర్లు.
పోలింగ్ రోజున సోషల్ మీడియాలో ఏ పార్టీ గెలుస్తుందో చెప్పడమే కాదు... ఏ స్థానాల్లో ఏ అభ్యర్థి గెలుస్తాడో కూడా... లెక్కలేసి మరీ చెప్పారు చాలా మంది. కొందరైతే మెజార్టీలు కూడా చూపించారు. అవన్నీ చూసి... చాలా మంది బెట్టింగ్‌లపై ఆశలు పెంచుకున్నారు. తీరా... రోజులు గడుస్తున్న కొద్దీ... రకరకాల సర్వేలు, రకరకాల ఫలితాల వార్తలు వస్తుంటే... తాము తప్పుగా బెట్ కాసామేమోనని పునరాలోచనలో పడుతున్నారు జనం. అప్పులు చేసి మరీ బెట్టింగ్ కాసినవాళ్లైతే... తాము లాస్ అవుతామేమోనని తలలు పట్టుకుంటున్నారు. పంటర్ల వెంట పడి... ఎలాగొలా బెట్టింగ్ రద్దు చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ డబ్బును ఐపీఎల్ పైనో, మరో ఆటపైనో పెట్టాలనుకుంటున్నారు. ఇలా బెట్టింగ్స్ రచ్చ కొనసాగుతోంది.
రోజురోజుకూ పందేలు రద్దు చేసుకుంటున్నవాళ్లు పెరుగుతుండటంతో బుకీలు కొత్త కండీషన్లు పెడుతున్నారు. బెట్టింగ్ కేన్సిల్ చేసుకుంటూ... పూర్తి అమౌంట్ ఇవ్వలేమనీ, 20 శాతం ఛార్జీల కింద కట్ అవుతాయని అంటున్నారు. అయినప్పటికీ పందెం రాయుళ్లు రద్దువైపే మొగ్గు చూపుతున్నారు. రిజల్ట్స్ వచ్చాక ఓడిపోయి మొత్తం డబ్బు పోగొట్టుకునే కంటే... ఇప్పుడే 80 శాతం డబ్బును వెనక్కి తీసేసుకోవడం బెటరనుకుంటున్నారు. అసలు బెట్టింగ్ అనేదే చట్టపరంగా నేరం. అయినప్పటికీ ఆ ఉచ్చులో చిక్కుకుంటున్న వాళ్లు... ఫలితాలకు ఎక్కువ టైం ఉండటంతో... లేనిపోని టెన్షన్లు పడుతూ... తలనొప్పులు తెచ్చిపెట్టుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.