news18-telugu
Updated: March 14, 2019, 5:24 PM IST
జగన్మోహన్ రెడ్డి, ఏపీ డీజీపీ ఠాకూర్ (File)
ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను తప్పించాలని వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి జీకే ద్వివేదీకి ఫిర్యాదు చేశారు. డీజీపీ ఠాకూర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీ డీజీపీగా ఠాకూర్ కొనసాగితే ఓటర్లు సజావుగా తమ ఓటు హక్కును వినియోగించుకోలేదని ఆర్కే ఆరోపించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడి జరిగిన సమయంలో ఏపీ డీజీపీ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలను తన ఫిర్యాదులో పొందుపరిచారు. ప్రతిపక్ష నేత మీద కత్తితో దాడి జరిగితే, విచారణ జరపకముందే ఏదో ఆకతాయి పని అంటూ డీజీపీ ఠాకూర్ వ్యాఖ్యానించారంటూ ఆర్కే ఫిర్యాదు చేశారు. పోలీసు శాఖ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని వైసీపీ గత కొంతకాలంగా ఆరోపిస్తోంది. కొన్నాళ్ల క్రితం ఎన్నికల కమిషన్‌ను కలిసినప్పుడు కూడా జగన్, ఇతర నేతలు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. మరోవైపు మంత్రి లోకేష్ ఆదేశాల ప్రకారం పోలీసులు వ్యవహరిస్తున్నారని, మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెడుతున్నారని ఆర్కే ఆరోపించారు. మంత్రి లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీచేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మంగళగిరి నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తల మీద కేసుల అంశం వివాదాదస్పదం అవుతోంది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
March 14, 2019, 5:14 PM IST