TTD: అలిపిరి కాలి నడక మార్గం పునరుద్ధరణ... రూ.25 కోట్లు ఇస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్

అలిపిరి కాలి నడక మార్గం పునరుద్ధరణ... రూ.25 కోట్లు ఇస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్

Tirumala: తిరుమలకు ఉన్న నడక దారుల్లో అలిపిరి కాలి నడక మార్గాన్ని ఎక్కువ మంది అనుసరిస్తారు. ఈ మార్గాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు అయ్యే ఖర్చును భరించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది.

 • Share this:
  Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)... తిరుమలేశుణ్ని దర్శించుకునేందుకు ఎక్కువ మంది భక్తులు వచ్చే కాలి నడక మార్గం (అలిపిరి నుంచి GNC వరకు ఉన్న మార్గం)ను పునరుద్ధరిస్తోంది. మరింత సౌకర్యవంతంగా, ఆధునికంగా దాన్ని మార్చబోతోంది. ఇందుకు సంబంధించి అలిపిరి జరిగిన భూమి పూజలో టీటీడీ పాలక మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, తుడా చైర్మన్ అండ్ టీటీడీ ఎక్స్ అఫీషియో సభ్యుడు డాక్టర్ సి భాస్కర రెడ్డి పాల్గొన్నారు. "అలిపిరి కాలి మార్గం ఎప్పుడో రెండున్నర దశాబ్దాల కిందట నిర్మించినది. ఇప్పుడు అది చాలా వరకూ బాలేదు. అందువల్ల దాన్ని పునరుద్ధరించాలని టీటీడీ నిర్ణయించింది. మొత్తం 7.6 కిలోమీటర్ల మార్గాన్ని ఆధునీకరిస్తూ... షెల్డర్లను మెరుగుపరుస్తాం. తద్వారా... భక్తులకు రక్షణ, భద్రత కల్పించినట్లు అవుతుంది" అని టీటీడీ పాలక మండలి ఛైర్మన్ తెలిపారు.

  అలిపిరి కాలినడక మార్గం పునరుద్ధరణకు జరిగిన భూమి పూజ


  సాధారణ రోజుల్లో అలిపిరి కాలి నడక మార్గం ద్వారా... రోజూ 20 వేల మంది భక్తులు తిరుపతి నుంచి తిరుమలకు వస్తారు. వేసవి సెలవులు, ఇతర పండగ రోజుల్లో రోజూ ఏకంగా 40 వేల మందికి పైగా ఈ మార్గంలో ముందుకు వెళ్తారు.

  అలిపిరి కాలినడక మార్గం పునరుద్ధరణకు జరిగిన భూమి పూజ


  ఈ మార్గాన్ని పునరుద్ధరించేందుకు అంటే... పైన స్లాబులు, తాగు నీటి పైపులు, టాయిలెట్స్, హెల్త్ సెంటరలు, సెక్యూరిటీ ఔట్ పోస్టులు, ఎలక్ట్రిసిటీ, ప్రజలకు సమాచారం ఇచ్చే ప్రసార వ్యవస్థ కేబుల్స్ ఏర్పాటుకి మొత్తం రూ.25 కోట్ల వ్యయ అంచనా వేశారు అధికారులు. ఈ మొత్తం ఖర్చును భరించేందుకు, డొనేషన్ రూపంలో డబ్బు ఇచ్చేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ముందుకు వచ్చింది.

  అలిపిరి కాలినడక మార్గం పునరుద్ధరణకు జరిగిన భూమి పూజ


  నిజానికి ఈ ప్రాజెక్టును ఇంతకుముందే ప్రారంభించాల్సి ఉంది. కరోనా వల్ల కొంత ఆలస్యమైంది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి... ఈ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనీ, తద్వారా భక్తులకు వీలైనంత త్వరగా ప్రయోజనం కలుగుతుందని ఈమధ్య తిరుమల బ్రహ్మోత్సవాలకు వచ్చినప్పుడు ఆదేశించారు. దాంతో... వెంటనే ఇవాళ భూమిపూజ చేసి... పనులు ప్రారంభించారు.

  అలిపిరి కాలినడక మార్గం పునరుద్ధరణకు జరిగిన భూమి పూజ


  "ఇదివరకు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు... శ్రీవారి మెట్టు కాలినడక మార్గం పునరుద్ధరణ ప్రాజెక్టు పూర్తైంది. ఇప్పుడు ఆయన కొడుకు సీఎంగా ఉన్నప్పుడు అలిపిరి కాలినడక మార్గం పునరుద్ధరణ మొదలైంది. అంతా ఆ తిరుమలేశుని ఆజ్ఞ" అన్నారు వైవీ సుబ్బారెడ్డి.

  ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో తాము భాగస్వామ్యం అవుతుండటం తమకెంతో హర్షదాయకం అన్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టేట్ కన్‌స్ట్రక్షన్స్ హెడ్ ఏవీవీఎస్ రావు. అంచనా సమయానికే ఈ ప్రాజెక్టును పూర్తి చేసి... భక్తులకు ప్రయోజనం కలిగిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
  Published by:Krishna Kumar N
  First published: