ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, కడప జిల్లాల్లో విస్తరించి ఉన్న శేషాచలం అడవుల్లో మళ్లీ ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఇటీవల కాలంలో వందలాది మంది తమిళకూలీలు అడవుల్లోకి చొరబడి అరుదైన సంపదను దోచేస్తున్నారు. పోలీసులు, అటవీశాఖ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దుంగల దొంగలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ నిత్యం శేషాచలం అడవులను జల్లెడ పడుతున్నా రోజూ పదుల సంఖ్యలో స్మగ్లర్లు పట్టుబడుతూనే ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఎర్రచందనం శేషాచలం అడవుల్లో దొరుకుతుండటంతో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. చిత్తూరు, కడప జిల్లాలతో పాటు తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు కూలీలతో చెట్లను నరికించి గుట్టుగా రవాణా చేస్తున్నారు. ఇటీవల అడవిలోకి ప్రవేశించే ప్రాంతాల్లో కూంబింగ్ ఎక్కువవడంతో తిరుమల ఆలయానికి వచ్చినట్లు వచ్చి అడవిలోకి వెళ్తున్నారు. స్మగ్లర్ల తెలివితేటలకు పోలీసులే నివ్వెరబోతున్నారు.
రూటు మార్చిన ఎర్రదొంగలు
తమపై టాస్క్ ఫోర్స్ నిఘా పెరగడం, ఇతర ప్రదేశాల్లో పోలీసులు సులభంగా గుర్తిస్తుండటంతో స్మగ్లర్లు రూటు మార్చుతున్నారు. శ్రీవారి భక్తుల ముసుగులో తిరుమల వరకు వచ్చి... అక్కడ కాలిబాట మార్గంనుంచి గుట్టుచప్పుడు కాకుండా అడవిలోకి ప్రవేశిస్తున్నారు. ఇందుకోసం స్పెషల్ డ్రెస్ కోడ్ ను కూడా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. తిరుమల వరకు తెల్లదుస్తుల్లో రావడం.. కాలినడక మార్గానికి చేరుకొని అక్కడ కాషాదుస్తులు ధరించడం.. అడవిలో ప్రవేశించే ముందుకు నిక్కర్, బనియన్లోకి షిఫ్ట్ అవడం. ఇదీ వారి నయా డ్రెస్ కోడ్. ఇలా డ్రెస్సులు మార్చుతూ ఓ స్మగ్లర్ పోలీసులకు పట్టుబడ్డాడు.
కొత్త దారుల్లో దందా
చిత్తూరు జిల్లా-తమిళనాడు బోర్డర్ పై పోలీసుల నిఘా పెగుతుతుండటంతో స్మగ్లర్లు కడప జిల్లాను తమ కేంద్రంగా ఎంచుకుంటటున్నారు. కడప జిల్లాలలోని పుల్లంపేట మండలం, ఎస్.ఆర్ పాలెం అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులు నిర్వహించిన కూంబింగ్ లో కోటి రూపాయలు విలువచేసే 66 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడడుకు చెందిన ఐదుగురు కూలీలను అదుపులోకి తీసుకోగా 38 మంది పరారయ్యారు. అంతకుముందు సుమారు వంద ఎర్రచందనం దుంగల్ని పట్టుకున్నారు. మైదుకూరు, రాజంపేట ప్రాంతాల్లో 30మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. రెడ్ స్మగ్లర్ల నుంచి 5 వాహనాలు ,4 టన్నుల బరువైన 98 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు పట్టుకున్న ఎర్రచందనం దుంగల విలువ అక్షరాల మూడు కోట్లు. ఎర్రచందనం దందాలో తమిళకూలీలతో పాటు కడప జిల్లా వాసులు, కర్ణాటకకు చెందిన వారు కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు.
పోలీసులకు పట్టుబడినా వారమో, నెలరోజులో జైల్లో ఉండటం మళ్లీ రంగంలోకి దిగడం వారికి అలవాటుగా మారింది. బలమైన సాక్ష్యాలు లేకపోవడం, దర్యాప్తులోలోపాలతో పటు అసలైన సూత్రధారులెవరన్నది కొంతమంది కూలీలకే తెలియకపోవడం మైనస్ గా మారుతోంది.