GT Hemanth Kumar, Tirupati
స్మగ్లింగ్. కంటికి కనిపించకుండా.. పోలీసులకు చిక్కకుండా నిషేధిత వస్తువులను అనకున్న గమ్యానికి చేర్చడమే స్మగ్లింగ్. ఇందులో డబ్బులు ఎంత ఎక్కువగా వస్తాయో.. రిస్క్ కూడా అంతే ఎక్కవగా ఉంటుంది. కానీ ఓ స్మగ్లింగ్ గ్యాంగ్ వేసిన ఎత్తు పోలీసులకు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది. అంతేకాదు వారిని పరుగులు పెట్టించింది. సినీఫక్కీలో చోటు చేసుకున్న ఈ సీన్ అందర్నీ హడలిపోయేలా చేసింది. ఇటీవల ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన పుష్ప సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఐతే అందులోని స్మగ్లింగ్ ఐడియాలను మాత్రం రియల్ స్మగ్లర్లు ఇట్టేపట్టేశారు. సేమ్ టు సేమ్ పుష్పరాజ్ ను దించేస్తున్నారుగానీ.. పోలీసులకు దొరికిపోతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని శేషాచలం అటవీ ప్రాంతంలో చోటు చేసుసుంది.
వివరాల్లోకి వెళ్ళితే... తమిళనాడు (Tamil Nadu) కు చెందిన TN 23 N 2327 నెంబర్ గల ఆర్టీసీ బస్సులో 36 మంది ప్రయాణికులు తిరుపతి (Tirupati) నుండి తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూర్ కి బయలుదేరారు. తిరుపతిలో పెళ్లి తంతు ముగించుకొని తిరుగుప్రయాణం పేరుతో బస్సును బుక్ చేసుకున్నారు. ఐతే అదే సమయంలో పోలీసులకు ఎర్ర చందనం స్మగ్లర్ల గురించి సమాచారం అందింది. స్మగ్లర్లు తిరుపతి నుంచి వెళ్తున్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు ప్రైవేట్ బస్సులపై పడ్డారు. ప్రతబస్సును జల్లెడపడుతుండగా ఎక్కడా ఎలాంటి డౌన్ రాలేదు.
కానీ తమిళనాడు ఆర్టీసీ బస్సులో స్మగ్లర్లు వెళ్తున్నట్లు వారికి సమాచారం అందింది. ఆ బస్సు అంతకుముందే పోలీసుల చెక్ పోస్టును దాటుకుంటూ వేగంగా వెళ్లిపోయింది. దీంతో వెంటనే రియాక్ట్ అయిన పోలీసులు.. దానిని వెంబడించడం మొదలుపెట్టారు. మరోవైపు పెళ్లిబస్సులోని వ్యక్తి.. డ్రైవర్ కు కత్తిచూపించి వేగంగా నడపాలని బెదిరించాడు. కొంతదూరం వెళ్లిన తర్వాత పెళ్లి బస్సులోని వాళ్లు దిగేసి అందులోని గిఫ్టులను కూడా పట్టుకుపోయారు.
కొంతసేపటి తర్వాత పోలీసులు అదే బస్సును ఆపి తనిఖీ చేయగా.. వారు పెళ్లివారు కాదని.. ఎర్రచందనం స్మగ్లర్లను తేలింది. శేషాచలం అడవిలో ఎర్రచందనం దుంగలను నరికి తిరుగు ప్రయాణంలో ఉన్నట్లు డ్రైవర్, కండక్టర్ పోలీసులకు వివరించారు. దీంతో వారిద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తప్పించుకుపోయిన స్మగ్లర్ల కోసం గాలిస్తున్నారు.
మొత్తానికి ఇటీవల వచ్చిన పుష్ప సినిమా స్మగ్లర్లకు చిత్రవిచిత్రమైన ఐడియాలు ఇస్తోంది. ఇటీవల పుష్ప సినిమా చూసి ఇన్ స్పైర్ అయిన ఓ స్మగ్లర్.. తన ట్రక్ లో సీక్రెట్ బాక్స్ ఏర్పాటు చేసి అందులో ఎర్రచందనం దుంగలు పెట్టి.. పైన టమాటా ట్రైలు పెట్టి స్మగ్లింగ్ కు యత్నించాడు. పోలీసులు వెంబడించి స్మగ్లర్లు లోపలేశారు. ఇప్పుడు కూడా అలాంటి ఘటనే రిపీట్ అయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.