Andhra Pradesh: వాటిని కూడా పునర్ నిర్మించాలి.. జగన్‌కు టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడి సూచన

వైఎష్ జగన్, రమణ దీక్షితులు (ఫైల్ ఫోటో)

Andhra Pradesh: విజయవాడలో కూల్చేసిన ఆలయాల తరహాలోనే తిరుమలలో కూల్చేసిన శ్రీవారి తేరు మండపం, వెయ్యికాళ్ల మండపం కూడా పునర్ నిర్మిస్తే శ్రీవారి భక్తులు సంతోషిస్తారని రమణ దీక్షితులు అభిప్రాయపడ్డారు.

  • Share this:
    ఆలయాల పునర్ నిర్మాణంపై శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు స్పందించారు. ఆలయాల పునర్ నిర్మాణం చేయడం శుభపరిణామమని అన్నారు. విజయవాడలో కూల్చేసిన ఆలయాల తరహాలోనే తిరుమలలో కూల్చేసిన శ్రీవారి తేరు మండపం, వెయ్యికాళ్ల మండపం కూడా పునర్ నిర్మిస్తే శ్రీవారి భక్తులు సంతోషిస్తారని రమణ దీక్షితులు అభిప్రాయపడ్డారు. ఆలయాల పునర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సీఎం జగన్‌కు శ్రీవారి దివ్యానుగ్రహం ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు రమణ దీక్షితులు ట్వీట్ చేశారు.

    ఏపీలో ఇటీవల ఆలయాలపై జరుగుతున్న దాడి కారణంగా పెరుగుతున్న ఒత్తిడిని అధిగమించేందుకు జగన్ ప్రభుత్వం చంద్రబాబు హయాంలో కూల్చేసిన ఆలయాల పునర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో కొన్నేళ్ల క్రితం తిరుమలలో కూల్చేసిన శ్రీవారి తేరు మండపం, వెయ్యికాళ్ల మండపాన్ని కూడా పునర్ నిర్మించాలని రమణ దీక్షితులు ఏపీ ప్రభుత్వం సూచన చేయడం చర్చనీయాంశంగా మారింది. జగన్ సర్కార్‌ను ఇరుకున పెట్టేందుకే రమణ దీక్షితులు ఈ రకమైన సూచనలు చేశారనే వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.

    వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొన్న రమణ దీక్షితులు.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత మళ్లీ టీటీడీ ప్రధాన అర్చకుడు అవుతారని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. కరోనా సంక్షోభ సమయంలో రమణ దీక్షితులు చేసిన పలు వ్యాఖ్యలు కూడా ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాయి. దీంతో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి రమణ దీక్షితులుపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి టీటీడీ రమణ దీక్షితులును పక్కనపెట్టినట్టు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే రమణ దీక్షితులు తాజాగా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.

    కాగా, విజయవాడ నగరంలోని ప్రకాశం బ్యారేజీకి సమీపంలో 9 ఆలయాల పునఃనిర్మాణానికి సీఎం జగన్ భూమిపూజ నిర్వహించారు. రూ.77 కోట్లతో దుర్గగుడి అభివృద్ధి, విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భూమి పూజ అనంతరం కనకదుర్గమ్మను సీఎం జగన్ దర్శించుకున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: