REASON BEHIND WHY JC DIWAKAR REDDY WENT TO CM KCR PRAGATI BHAVAN IN HYDERABAD AK
JC Diwakar Reddy: జేసీ దివాకర్ రెడ్డి ప్రగతి భవన్‌కు ఎందుకు వెళ్లారు ?.. తెరవెనుక స్టోరీ ఏంటి ?
ప్రగతి భవన్ ముందు జేసీ దివాకర్ రెడ్డి (ఫైల్ ఫోటో)
JC Diwakar Reddy: జేసీ దివాకర్ రెడ్డి ఉన్నట్టుండి ప్రగతి భవన్‌కు వచ్చారు. కానీ ఆయనకు కేసీఆర్, కేటీఆర్‌ను ఎలాంటి ముందస్తు సమాచారం కానీ పిలుపు కానీ లేదు.
పేరుకు ఆయన ఏపీకి చెందిన నాయకుడే అయినా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేకసార్లు మంత్రిగా కొనసాగిన రికార్డ్ ఆయన సొంతం. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నప్పటికీ.. అన్ని పార్టీలకు చెందిన నేతలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. రాష్ట్ర విడిపోయిన తరువాత టీడీపీలో చేరినా.. మిగతా పార్టీ నేతలతో సన్నిహితంగా ఉండే తన పాత అలవాటును ఆయన కొనసాగించారు. ఆయనే అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేత జేసీ దివాకర్ రెడ్డి. అలాంటి జేసీ దివాకర్ రెడ్డికి నిన్న చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణ రాజకీయ నేతలతో మంచి సంబంధాలు కొనసాగించే జేసీ దివాకర్ రెడ్డి ఉన్నట్టుండి తెలంగాణ సీఎం అధికార నివాసమైన ప్రగతి భవనం ముందు ప్రత్యక్షమయ్యారు. ఆయన ప్రగతి భవన్ లోపలికి వెళ్లి తిరిగి వెళ్లిపోయి ఉంటే.. ఆయన గురించి ఇంత చర్చ జరిగి ఉండేది కాదు.
కానీ ప్రగతి భవన్ లోపలికి ఆయనను పోలీసులు అనుమతించకపోవడం.. ఆ తరువాత పోలీసులు వచ్చిన ఆయనను పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లడం.. ఆ తరువాత ఆయనను పోలీసులు అక్కడి నుంచి ఆయన ఇంటికి తీసుకెళ్లడం జరిగిపోయాయి. అయితే ఉన్నట్టుంది జేసీ దివాకర్ రెడ్డి ప్రగతి భవన్‌కు ఎందుకు వెళ్లాలని అనుకున్నారు ? కేసీఆర్‌ను కాకపోయినా కేటీఆర్‌ను కలవాలని ఎందుకు అక్కడున్న వారితో చెప్పినట్టు ? ఈ అంశం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది.
కొద్దిరోజుల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగానూ జేసీ దివాకర్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ లాబీల్లోకి వెళ్లారు. అక్కడే ఆయన కేసీఆర్, కేటీఆర్‌ను కలిసినట్టు వార్తలు వచ్చాయి. ఆ తరువాత కాంగ్రెస్ శాసనసభాపక్షం కార్యాలయానికి వెళ్లిన జేసీ దివాకర్ రెడ్డి.. అక్కడి వారిపై మరోసారి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. అయితే కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి.. ఈ విషయంలో జేసీ దివాకర్ రెడ్డికి కౌంటర్ ఇవ్వడంతో.. ఆయన సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి జేసీ దివాకర్ రెడ్డి మళ్లీ వార్తల్లో పెద్దగా కనిపించింది లేదు. ఏపీలోని అధికార వైసీపీపై గతంలో చేసినట్టుగా విమర్శలు కూడా చేయడం లేదు.
అలాంటి జేసీ దివాకర్ రెడ్డి ఉన్నట్టుండి ప్రగతి భవన్‌కు వచ్చారు. కానీ ఆయనకు కేసీఆర్, కేటీఆర్‌ను ఎలాంటి ముందస్తు సమాచారం కానీ పిలుపు కానీ లేదు. ఒకవేళ అలాంటిది ఉంటే కచ్చితంగా ఆయన ప్రగతి భవన్‌లోకి వెళ్లి వారిని కలిసేవారు. అయితే కొంతకాలంగా జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు, రాజకీయాలను ఎవరూ పెద్దగా సీరియస్‌గా తీసుకోవడం లేదనే టాక్ ఉంది. గత ఎన్నికల నాటికే ఆయన క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు.
అనంతపురం ఎంపీగా జేసీ దివాకర్ రెడ్డి తనయుడు పవన్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం తరపున పవన్ కుమార్ రెడ్డి పోటీ చేయడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. అయితే 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగిన జేసీ దివాకర్ రెడ్డి.. ఖాళీగా ఉండలేకే ఇలాంటివి చేస్తున్నారేమో అనే చర్చ సాగుతోంది. మొత్తానికి జేసీ దివాకర్ రెడ్డి అసలు ప్రగతి భవన్‌కు వెళ్లాలని ఎందుకు అనుకున్నారనే విషయం తెలియాలంటే.. ఏదో ఒక సందర్భంలో ఆయన నోరు విప్పితే కానీ తెలియదేమో.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.