విశాఖలో వరుస ప్రమాదాలు... అసలేం జరుగుతోంది ?

ఏదైనా సంఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు హ‌డావిడి చేయ‌డం... త‌రువాత క్రమేపి వాటిని ప‌ట్టించుకోక‌పోవ‌డం వ‌ల‌న ఇలాంటి ప్రమాదాలకు కార‌ణ‌మ‌వుతుంది.

news18-telugu
Updated: July 14, 2020, 11:32 AM IST
విశాఖలో వరుస ప్రమాదాలు... అసలేం జరుగుతోంది ?
విశాఖలో వరుసగా చోటు చేసుకుంటున్న ప్రమాదాలు
  • Share this:
ఒక వైపు క‌రోనా మ‌రో వైపు త‌రుచుగా జ‌రుగుతున్న ప్రమాదాలు ఇప్పుడు విశాఖ న‌గ‌ర‌వాసుల‌తోపాటు ప‌రిస‌ర‌ప్రాంతాల్లో ఉన్న వారికి కంటిపై కునుకు లేకుండా చేస్తోన్నాయి. అయితే గ‌త కొద్ది కాలంగా విశాఖ‌ప‌ట్నంలో ఇలాంటి భ‌యాన‌క ప్రమాదాలు ఎందుకు సంభ‌విస్తున్నాయనే చర్చ మొదలైంది. ఎల్జీ పాలిమర్స్‌ ప్రమాదంతో మొదలైన ఈ ప్రమాదాల పరంపర తాజాగా పరవాడలోని రాంకీ సీఈటీపీ సాల్వెంట్స్‌లో జరిగిన భారీ పేలుడు వరకు కొనసాగుతూనే ఉన్నాయి. అసలు ఈ ప్రమాదాలకు కారణమేంటి ? మాన‌వ త‌ప్పిదాలే కార‌ణ‌మా? విశాఖ జిల్లా వ్యాప్తంగా దాదాపు 9 అత్యంత ప్రమాదరకమైన ర‌సాయ‌న పరిశ్రమలు ఉన్నాయి. కొండపల్లి, జి.కొండూరు,ఇబ్రహీంపట్నం మండలాలలోని గ్రామాల్లో దాదాపు 1500 ఎకరాల్లో బీపీసీఎల్‌ ఆయిల్‌, ఐవోసీఎల్‌ ఆయిల్‌, హెచ్‌పీసీఎల్‌ ఆయిల్‌, హెచ్‌పీసీఎల్‌ బాట్లింగు ప్లాంటు, బీపీసీఎల్‌ బాట్లింగు ప్లాంటు, ల్యాంకో పవర్‌, ఎన్‌టీటీపీఎస్‌, గెయిల్‌ ఇండియా ఇలా పదుల సంఖ్యలో అత్యంత ప్రమాదకరమైన కంపెనీలు ఉన్నాయి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న ఘోరమైన ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి.

ఇంత‌టి ప్రమాదకరమైన పరిశ్రమలు ఉన్నా.. వాటి భద్రత పర్యవేక్షణపై ప్రభుత్వం ఇప్పటివరకు ఒక క‌మిటిని కూడా వేయ‌లేదు. గ‌తంలో ఉన్న ప్రభుత్వం కూడా వీటిలో భద్రత ప్రమాణాలు ఎంత వ‌ర‌కు ఉన్నాయ‌నే విష‌యాల‌పై పెద్దగా దృష్టి పెట్టలేదు. వైఎస్ జగన్ అధికారంలోకి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం త‌రువాత ఒక్కసారిగా ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఏ కంపెనీల వ‌ల‌న అయితే ఎక్కువ ప్రమాదాలు జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయో ఆ కంపెనీలను ఆన్ సైట్ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించాయి. ఆ ఆన్ సైట్ యాక్షన్ ప్లాన్ అమ‌లు చేసే బాధ్యతను కూడా ఆ కంపెనీల‌కే అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పటివరకు అది అమల్లోకి రాలేదు.

Lg polymers case, vizag gas leakage, national green tribunal, ngt orders to lg polymers, ఎల్జీ పాలిమర్స్, విశాఖ గ్యాస్ లీకేజీ, నేషనల్ గ్రీన్ ట్రైబ్యూనల్
ప్రమాదం జరిగిన ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ(ఫైల్ ఫోటో)


దీంతోపాటు కంపెనీల యాజ‌మాన్యాల నిర్లక్ష్యం కూడా త‌రుచుగా ప్రమాదాలు సంభవించడానికి కార‌ణంగా తెలుస్తోంది. దాదాపు రెండు నెల‌ల లాక్ డౌన్ స‌మ‌యంలో అన్ని కంపెనీలు కూడా మూత‌ప‌డ్డాయి. ఆ సమ‌యంలో కంపెనీల్లో పర్యవేక్షణ కరువవడం కూడా ఈ వ‌ర‌స ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం విష‌యంలో ఇదే మ‌న‌కు స్పష్టమైంది. ప్రభుత్వం లాక్ డౌన్ స‌మ‌యంలో కంపెనీ పర్యవేక్షణ కోసం ఉద్యోగుల‌కు ప్రత్యేక అనుమతులు ఇచ్చినా కంపెనీ యాజ‌మాన్యం నిర్లక్ష్య దోర‌ణితో దాదాపు 12 మందిని పొట్టనబెట్టుకుంది. లాక్ డౌన్ విధించిన‌ప్పుడు ఎటువంటి ప్లానింగ్ లేదో లాక్ డౌన్‌ను స‌డ‌లించిన‌ప్పుడు కూడా ప్రభుత్వాలు అటువంటి జాగ్రత్తలు తీసుకోవక‌పోవ‌డమే కార‌ణంగా కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే ఫ్రభుత్వాలు కూడా ఏదైనా సంఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు హ‌డావిడి చేయ‌డం... త‌రువాత క్రమేపి వాటిని ప‌ట్టించుకోక‌పోవ‌డం వ‌ల‌న ఇలాంటి ప్రమాదాలకు కార‌ణ‌మ‌వుతుంది. వాస్తవానికి భోపాల్ ఘ‌ట‌న త‌రువాత ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చినా... వాటిని క్షేత్రస్థాయిలో అమ‌లు మాత్రం అంతంత మాత్రంగా ఉంటుంది.

“విశాఖపట్నం ప‌రిస‌ర ప్రాంతాల్లో దాదాపు 9కి పైనే విష‌వాయువులు, అత్యంత ప్రమాదకరమైన ర‌సాయనాలతో కూడుకున్న కంపెనీలు ఉన్నాయి. అయితే వీటి భద్రత పర్యవేక్షణ ఎవ‌రు చూసుకుంటారు? ప్రభుత్వాల వ‌ద్ద ఏమైనా విధి విధానాలు ఉన్నాయా ? ప్రమాదాలు జ‌రిగిన‌ప్పుడు త‌ప్పించి సాధార‌ణ రోజుల్లో వీటి గురించి ఆలోచిస్తున్నారా ? ఇవ‌న్నీ ఈ రోజు వైజాగ్‌లో ప్రమాదాలు జ‌ర‌గ‌డానికి కార‌ణాలు. అత్యంత ప్రమాదకరమైన కంపెనీలను జ‌నావాసాల్లో ఎందుకు ఏర్పాటు చేశారు ? వీటికి అనుమ‌తులు ఎవ‌రిచ్చారు ? అంటే లోపం మ‌న ప్రభుత్వ వ్యవస్థలోనే ఉంది. విదేశీ పెట్టుబ‌డుల మోజులో ప‌డి ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. కంపెనీల‌కు అనుమ‌తులు ఇచ్చేశాం. ఇక మా ప‌నైపోయింద‌నే దోర‌ణిలో ఉన్నాయి త‌ప్ప వాటిలో ఉన్న భద్రత పర్యవేక్షణ చేయడానికి ప్రత్యేకమైన వ్యవస్థ ఇప్పటి వ‌ర‌కు లేదు. అందుకే యాజ‌మాన్యాల్లో కూడా ఒక విధ‌మైన నిర్లక్ష్యం ఉంది. ఇవే ప్రమాదాలకు దారి తీస్తున్నాయి.” అని ప్రముఖ పర్యావరణవేత్త హరిశంకర్ న్యూస్ 18కు తెలిపారు.

ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రమాదాలు జరిగినప్పుడు కాకుండా పూర్తి స్థాయిలో వీటిల్లో భద్రత ప్రమాణాల అమలుపై చర్యలు తీసుకుంటే త‌ప్ప ఈ ప్రమాదాలను అరికట్టలేమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎం. బాలకృష్ణ, సీనియర్ కరస్పాండెంట్, న్యూస్ 18
Published by: Kishore Akkaladevi
First published: July 14, 2020, 11:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading