ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొత్త జిల్లాల (AP New Districts)పై తీవ్ర చర్చ జరుగుతోంది. ఏపీ ప్రభుత్వం (AP Government) 26 జిల్లాలను ఏర్పాటు చూస్తే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన అంశాల ప్రకారం ఉమ్మడి జిల్లాల స్వరూపం పూర్తిగా మారిపోయింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ప్రభుత్వం ప్రకటించడంతో కొన్ని జిల్లాల భౌగోళిక స్వరూపం మారిపోయింది. కొన్ని జిల్లాలు పూర్తిగా మారిపోయాయి. కొన్ని జిల్లాలని విభజించినా ఎలాంటి మార్పులు రాలేదు. కానీ కొన్ని జిల్లాల్లో ఎవరూ ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత రాయలసీమకు సంబంధించి అనూహ్య మార్పు వచ్చింది. రాయలసీమ ప్రజలు ఎన్నడూ చూడని మార్పు కనిపించింది. అదే రాయలసీమ పరిధిలోకి సముద్రతీరం రావడం.
ప్రతి లోక్ సభ నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించడంతో తిరుపతి ప్రత్యేక జిల్లా అయింది. దీనికి ప్రభుత్వం శ్రీ బాలాజీ జిల్లాగా నామకరణం చేసింది. తిరుపతి కేంద్రంగా ఏర్పాటైన ఈ జిల్లాలో నెల్లూరు జిల్లాకు చెందిన నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో ప్రధానంగా సూళ్లూరుపేట నియోజకవర్గం కూడా ఉంది. సూళ్లూరుపేటలో సముద్రతీరం ఉండటంతో రాయలసీమలో కలిసింది. దీంతో రాయలసీమకు సముద్రం తీరం వచ్చినట్లైంది.
అంతేకాదు ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో కోస్తా జిల్లాల సంఖ్య 9 నుంచి 12కు పెరిగింది. వీటిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి జిల్లాలు తీరప్రాంత జిల్లాలయ్యాయి. తాజా విభజనతో రాయలసీమ జిల్లాల సంఖ్య నాలుగు నుంచి ఎనిమిదికి పెరిగింది.
అలాగే ఏజెన్సీ జిల్లాలు కూడా మారిపోయాయి. గతంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొంత భాగం ఏజెన్సీ ప్రాంతాలుండేవి. తాజాగా మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాలు మాత్రమే ఏజెన్సీ పరిధిలోకి రానున్నాయి. ఇక మైదాన ప్రాంతాల జిల్లాల సంఖ్య 13గా ఉంది. వీటిలో తూర్పుగోదావరి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, పల్నాడు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లా, కడప, రాజంపేట, చిత్తూరు జిల్లాలున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిన్ నోటిఫికేషన్ ప్రకారం.. ఈ జిల్లాలు భౌగోళిక స్వరూపాన్ని సందరించుకున్నాయి. ఐతే ప్రభుత్వం అభ్యంతరాలు, సూచనలకు అవకాశమివ్వడంతో వాటిని పరిగణలోకి తీసుకుంటే స్వల్ప మార్పులుండే అవకాశాలున్నాయి. ఇప్పటికే జిల్లా కేంద్రాలకు దూరం, నియోజకవర్గాలను ఇతర జిల్లాల్లో కలపడం వంటి వాటిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. జిల్లాల తర్వాత రాష్ట్రంలో ఎన్ని మార్పులు జరిగినా రాయలసీమలోకి సముద్రం రావడం మాత్రం హైలెట్ గా నిలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap government, AP new districts, Tirupati