Home /News /andhra-pradesh /

RAYALASEEMA FARMERS MARCH IN NANDYAL TOWN OF KURNOOL THEY DEMAND SIDDESHWARA SLUICE SK

మండుటెండను లెక్కచేయని రైతులు..సిద్దేశ్వరం అలుగు కోసం పాదయాత్ర

రైతుల పాదయాత్ర

రైతుల పాదయాత్ర

రాయలసీమ నాలుగు జిల్లాలకు కీలకమైన సిద్దేశ్వరం అలుగు సాధన కోసం సీమ రైతాంగం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోరాటాన్ని ప్రభుత్వం గుర్తించి తక్షణమే సిద్దేశ్వర అలుగు నిర్మాణానికి పూనుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.

    రాయలసీమ రైతులు కదం తొక్కారు. సిద్దేశ్వరం అలుగు సాధన కోసం సమర శంఖం పూరించారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా పాదయాత్ర చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని వివేకానంద ఆడిటోరియం నుంచి సిద్దేశ్వర అలుగు సాధన కోసం నాలగు రోజుల పాటు జరిగే ప్రజా పాదయాత్రను తెలంగాణ రాష్ట్ర రైతు నాయకులు, RDS మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమాఖ్య కృష్ణా జిల్లా అధ్యక్షులు వేణుగోపాల రావు, ప్రకాశం జిల్లా రైతు నాయకులు తిరుపతి రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

    రాయలసీమ నాలుగు జిల్లాలకు కీలకమైన సిద్దేశ్వరం అలుగు సాధన కోసం సీమ రైతాంగం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోరాటాన్ని ప్రభుత్వం గుర్తించి తక్షణమే సిద్దేశ్వర అలుగు నిర్మాణానికి పూనుకోవాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్‌ చేశారు.

    రోళ్ళు పగులకొట్టే రోహిణీ కార్తెలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతను లెక్కచేయకుండా రాయలసీమ రైతు బిడ్డలు ప్రజా పాదయాత్ర లో పాల్గొనడం గర్వంగా ఉంది. సిద్దేశ్వరం అలుగు నిర్మించి తెలంగాణలోని దక్షిణ ప్రాంతం, రాయలసీమలోని నాలుగు జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సాగునీరు, త్రాగునీటి కష్టాలు తీర్చాలి. రాయలసీమ ప్రాంతంలో ఒక తడికి నీరందక లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి సీమ రైతాంగం ఆత్మహత్యలు, వలసలకు గురవుతోంది.
    బొజ్జా దశరథరామిరెడ్డి


    రైతుల డిమాండ్‌లు:

    • దుమ్ముగూడెం- నాగార్జున సాగర్ టేల్ పాండ్ ప్రాజెక్టును చేపట్టి ఆ ప్రాజెక్టు ద్వారా నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీరందించి తద్వారా శ్రీశైలం జలాశయం నీటిని రాయలసీమకు మళ్ళించాలి.

    • శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధాని లేదా హైకోర్టును నిర్మించాలని కోరారు. అమరావతిని ఫ్రీజోన్ చేయాలి. విద్య,వైద్యం, పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు చేయాలి.

    • తుంగభద్ర వరద జలాలను వినియోగించుకునే సమాంతర కాలువ కోసం కర్నాటక ప్రభుత్వంతో చర్చలు జరుపాలి. రాయలసీమ ప్రాంతం జీవన హక్కుల సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని రైతులు కోరారు.


    రైతుల పాదయాత్రకు BJP, కాంగ్రెస్, CPM, CPI, PDSU,RSF, RUF‌తో పాటు పలు ప్రజాసంఘాలు, రైతు సంఘాలు మద్దతు తెలిపాయి. పాదయాత్ర సాగే మార్గంలోని ఆయా గ్రామాల రైతులు పెద్దఎత్తున తరలివచ్చి ఘనస్వాగతం పలికారు. పక్క గ్రామం వరకు పాదయాత్రలో పాల్గొని పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ఊరూరా రైతులు గ్రామాలలో మజ్జిగ, మంచినీరు, భోజన వసతులను కల్పించారు.
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Farmer, Farmers Protest, Rayalaseema

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు