ఏపీలో రేషన్ సరుకులను డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించిన జగన్ ప్రభుత్వం.. రేపటి నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేయబోతోంది. ఈ క్రమంలో భాగంగా మునుపెన్నడూ లేని విధంగా మెరుగుపరిచిన నాణ్యమైన స్వర్ణ రకం బియ్యాన్ని కార్డుదారుని ఇంటి వద్దే మొబైల్ వాహనం ద్వారా పంపిణీ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం సంవత్సరానికి రూ. 830 కోట్లు అదనంగా వెచ్చించి ఈ పధకం రూపొందించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వేదికగా రేపు కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించిన 2,500 డోర్ డెలివరీ వాహనాలను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఇప్పటివరకూ ప్రజా పంపిణీ వ్యవస్ధలో కార్డుదారులకు పంపిణీ చేయబడుతున్న బియ్యంలో నూకల శాతం, రంగుమారిన శాతం అధికంగా ఉండడం వల్ల కార్డుదారులు తినని బియ్యం రకాలు ఉండడం వల్ల ఎక్కువశాతం మంది వినియోగించడం లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా కార్డుదారులు ఇష్టంగా తినగలిగే మెరుగపరిచిన నాణ్యమైన స్వర్ణ రకం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా నాణ్యతపై ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తిని తొలగించి ఎక్కువ శాతం ప్రజలు ఇష్టంగా తినే స్వర్ణ రకం బియ్యాన్ని పంపిణీ చేయుటకు పౌరసరఫరాల శాఖ మొట్టమొదటి సారిగా బియ్యం సేకరణ సమయంలోనే సమూలమైన మార్పులు చేసి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసే సమయంలోనే స్వర్ణ రకం బియ్యానికి ప్రాధాన్యత ఇచ్చి వాటిని మిల్లింగ్ సమయంలోనే నూకలు 15 శాతం, దెబ్బతిన్న బియ్యం 1.5 శాతంకు తగ్గించి మెరుగుపరిచిన స్వర్ణ మధ్యస్ధ రకం సార్టెక్స్ బియ్యాన్ని సేకరించి కార్డుదారులకు అందించనున్నారు.
ప్రస్తుత ప్రజా పంపిణీ వ్యవస్ధలో చౌకధరల దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేయడంలో కొంతమంది దుకాణదారులు సరైన సమయపాలన చేయకపోవడం, సరుకులను సక్రమంగా పంపిణీ చేయకపోవడం, సరుకులను నల్లబజారుకు తరలించడం వంటి వాటి వల్ల కార్డుదారులకు కలుగుతున్న ఇబ్బందుల దృష్ట్యా వారి సౌకర్యం కోసం ముఖ్యంగా వృద్దులు, రోగులు, వేతనాలు కోల్సోతున్న రోజువారీ కూలీల కోసం ప్రభుత్వం నిత్యావసర సరుకులను మొబైల్ వాహనం ద్వారా ఇంటివద్దకే అందించే విధానం ప్రవేశపెడుతున్నారు. వలంటీర్ వ్యవస్ధను ఉపయోగించి కార్డుదారుల ఇంటి వద్దనే ప్రజల సమక్షంలో కార్డుదారుల వేలిముద్రల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని, ఖశ్చితమైన తూకంతో తిరిగి ఉపయోగించగలిగే సంచుల ద్వారా పంపిణీ చేయనున్నారు. మొదటిసారి ఈ సంచులను ఉచితంగా ఇవ్వనున్నారు. కల్తీకి ఆస్కారం లేకుండా ప్రతీ బియ్యం బస్తాకూ సీల్ వేయబడి ఉంటుంది, ప్రతీ సంచికీ కూడా యూనిక్ కోడ్ ఉండడం వల్ల ఆన్‌లైన్ ట్రాకింగ్ చేయబడుతుంది. అన్ని మొబైల్ వాహనాలకూ జిపిఎస్ అమర్చడం వల్ల కార్డుదారులు మొబైల్‌యాప్ ద్వారా పంపిణీ వివరాలు రియల్‌టైంలో తెలుసుకోవచ్చు.
అంతేకాదు మొబైల్ వాహనం నెలకు సగటున 18 రోజుల పాటు కార్డుదారుల సౌకర్యార్ధం సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రతీ రోజూ సగటున 90 కార్డులకు తగ్గకుండా పంపిణీ చేయాల్సి ఉంటుంది. దీనిపై నిరంతరం సోషల్ ఆడిట్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ తూకం ద్వారా ఖశ్చితమైన తూకంతో సరుకుల పంపిణీ చేయనున్నారు. బియ్యం, నిత్యావసర సరుకులు కార్డుదారులకు ఇంటివద్దే అందించేందుకు 9,260 మొబైల్ వాహనాలను రూ. 539 కోట్లతో కొనుగోలు చేయడం జరిగింది. ఈ వాహనాలను నిరుద్యోగ యువకులకు ఉపాధిహమీ కింద వివిధ కార్పొరేషన్ల ద్వారా అర్హులైన లబ్దిదారులకు సంబంధిత సంస్ధల నుంచి 60 శాతం సబ్సిడీ ధరకు ప్రభుత్వం అందించింది. ఒక్కో వాహనం విలువ రూ. 5,81,000, ఇందులో 60 శాతం అనగా ప్రతీ వాహనం మీద రూ. 3,48, 600 సబ్సిడీగా వివిధ వెల్ఫేర్ కార్పొరేషన్ల నుంచి అందించడం జరిగింది. ఈ వాహనాలకు పౌరసరఫరాల సంస్ధ ప్రతీ నెలా అద్దె చెల్లిస్తూ ఆరు సంవత్సరాల పాటు వినియోగించుకోనున్నది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ration card