నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఫోన్ టి ట్యాపింగ్ ఆరోపణలను ఆయన స్నేహితుడు రామశివారెడ్డి ఖండించారు. ఇది ట్యాపింగ్ కాదు. నా ఫోన్ కేంద్ర హోంశాఖకు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపడానికి సిద్దమే. అది ట్యాపింగ్ ఆడియో కాదు. వేరే కాంట్రాక్టర్ కు నా ఫోన్ నుంచి కాల్ రికార్డింగ్ షేర్ అయింది. నాది ఆండ్రాయిడ్ ఫోన్. మా ఇద్దరివి ఐఫోన్లు అని కోటంరెడ్డి తప్పుగా చెప్పారు. నా ఫోన్ లో ప్రతీ కాల్ రికార్డ్ అవుతుంది. నాపై ఎవరి ఒత్తిడి లేదు. నిజాలు చెప్పేందుకే మీడియా ముందుకు వచ్చానని రామశివారెడ్డి చెప్పుకొచ్చారు.
ఇక తాజాగా ఫోన్ ట్యాపింగ్ పై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. 'ఫోన్ ట్యాపింగ్ పై దర్యాప్తు చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాను. నా వ్యక్తిగత సేచ్ఛను హరించేలా ఫోన్ ట్యాప్ చేశారని, దీనిపై విచారణ జరపాలని లేఖలో పేర్కొన్నాను. నేరుగా ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసి లేఖ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. ట్యాపింగ్ జరుగుతుందని నేను ఆరోపిస్తే నాపై విమర్శలు చేస్తున్నారు. నేను ఆరోపణలు చేసినప్పుడు మీరు కూడా సరైన పద్దతిలో మాట్లాడాలి. నాపై శాపనార్ధాలు పెట్టడమే పనిగా పెట్టుకున్నారు. నేను కేసులకు భయపడను నాకు కేసులు కొత్త కాదు. సొంత పార్టీ వాళ్లే నా ఫోన్ ట్యాప్ చేసి అవమానించారు. నిజాలు బయటపెట్టిన నాపై మూకుమ్మడి దాడి చేస్తున్నారు. చంపేస్తామంటూ బెదిరింపులు కూడా చేస్తున్నారు. నన్ను అరెస్ట్ చేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పు. మీరు ఎన్ని కేసులు పెట్టినా..జైలుకు పంపినా నా గొంతు ప్రశ్నించడం ఆగదని' అన్నారు.
కాగా కోటంరెడ్డి తీరు మొదటి నుంచి వైసీపీకి తలనొప్పిగా మారింది. దీనితో ఆయన స్థానంలో ఆదాల ప్రభాకర్ రెడ్డికి నియోజకవర్గ బాధ్యతలను అప్పగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాడని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఇక ఇటీవల కోటంరెడ్డి భద్రతను సర్కార్ తగ్గించి షాకిచ్చింది. ఇప్పటి వరకు ఆయనకు 2 ప్లస్ 2 సెక్యురిటీ (Security)ఉండగా దాన్ని 1ప్లస్ 1కి తగ్గించింది. ఇందుకు ఆయన కూడా సమ్మతిస్తూ సంబంధిత పత్రాలపై సంతకం చేసినట్లుగా తెలుస్తోంది.
కాగా ఫోన్ ట్యాపింగ్ పై గతంలో కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలపై రామశివారెడ్డి క్లారిటీ ఇచ్చారు. మరి దీనిపై కోటంరెడ్డి ఎలా స్పందిస్త్తారో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap, AP News, Kotamreddy sridhar reddy, Ycp