
టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు
తిరుమల తిరుపతి దేవస్థానం గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు సంచలన ట్వీట్ చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు సంచలన ట్వీట్ చేశారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీద ఆయన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఈవో మీద కంప్లెయింట్ ఇచ్చారు. ఈ ట్వీట్లో జగన్ తో పాటు బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామిని కూడా జోడించారు. చంద్రబాబునాయుడు హయాంలో 20 మందికి పైగా అర్చకులను రాజ్యాంగవిరుద్ధంగా రిటైర్ చేయించారని ఆరోపించారు. వారిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. జగన్ కూడా తమను మళ్లీ తీసుకుంటామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ, టీటీడీ ఈవో, ఏఈవో ఇంకా చంద్రబాబు నాయుడు ఆదేశాలు పాటిస్తూ కోర్టు తీర్పును, జగన్ ఆదేశాలను అమలు చేయడం లేదని ఫిర్యాదు చేశారు. అయినా ఇంకా తాము ఎదురు చూస్తుంటామన్నారు.
ఇటీవల రమణ దీక్షితులు చేసిన ట్వీట్ కూడా దుమారం రేపింది. బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి చేసిన ఓ ట్వీట్‌ను రీ ట్వీట్ చేసిన రమణ దీక్షితులు.. త్వరలో తిరుమల కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనం నుంచి విముక్తి పొందుతుందని ఆకాంక్షించారు. గతంలో టీడీపీ హయాంలో విమర్శలు చేసిన ఆయన ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం నుంచి కూడా టీటీడీ విముక్తి పొందాలని ఆకాంక్షించడం సంచలనంగా మారింది.
Published by:Ashok Kumar Bonepalli
First published:July 11, 2020, 15:52 IST