తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. దేవస్థాన మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులకు పాలకమండలి తిరిగి అవకాశం కల్పించింది.గౌరవ ప్రధాన అర్చకుడిగా ఆయన నియామకానికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు శనివారం జరిగిన పాలక మండలి నిర్ణయాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
2019-20 వార్షిక బడ్జెట్ కింద రూ. 3243 కోట్లకు పాలకమండలి ఆమోదం తెలిపిందన్నారు. అలాగే ఘాట్ రోడ్డు మరమ్మత్తుల కోసం రూ.10కోట్లు, టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ మరమత్తుల కోసం 14.30 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. ఘాటు రోడ్డు భద్రతా ప్రమాణాల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్టు చెప్పారు. జమ్మూకాశ్మీర్, వారణాసిలోనూ టీటీడీ ఆలయాలు నిర్మిస్తామన్నారు. ముంబైలో కొత్త ఆలయ నిర్మాణంతో పాటు గుజరాత్లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఆమోదం తెలిపినట్టు చెప్పారు.
టీటీడీ సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసి.. డీఎస్పీ స్థాయి అధికారిని నియమిస్తామన్నారు. జనవరి 6,7 వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా రెండు రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరచి వీలైనంత మంది భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తిరుమల వరాహస్వామి ఆలయానికి రూ.14కోట్లు కేటాయించినట్టు చెప్పారు.ఇటీవల ఒక ప్రముఖ పత్రికలో ప్రచురించిన ఏసయ్య అనే కథనంతో టీటీడీ పరువు ప్రతిష్టలకు నష్టం కలిగించడంతో కోర్టులో దావా వేస్తున్నట్టు తెలిపారు.టీటీడీ ఉద్యోగాల నియామకానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.