ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల క్రితం సంచలనం సృష్టించిన తుని రైలు దగ్ధం కేసు మరోసారి తెరపైకి వచ్చింది. కాపు ద్యమం సందర్భంగా రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ను దగ్ధం చేసిన కేసులో నిందితులకు రైల్వే కోర్టు సమ్లు జారీ చేసింది. కాపు ఉద్యమం సందర్భంగా ఛలో తునిలో తూర్పు గోదావరి జిల్లా తుని వద్ద జరిగిన రైలు దహనం ఘటనలో రైల్వే పోలీసులు అప్పట్లోనే కేసు నమోదు చేశారు. కేసులో నిందితులుగా పేర్కొన్నవారందరికీ శుక్రవారం సమన్లు జారీ అయ్యాయి. వీరిలో కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పేరు కూడా ఉంది. వీరంతా మార్చి 3న రైల్వే కోర్టులో జరిగే విచారణకు హాజరుకావాల్సిందిగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
2016 జనవరి 31న కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో భాగంగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తునిలో భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తుని సభకు తరలివచ్చిన ఆందోళనకారులు రత్నాచల్ ఎక్స్ ప్రెన్ ను దగ్ధం చేశారు. దీంతో సభకు పిలుపునిచ్చిన ముద్రగడ పద్మనాభంతో పాటు 41మందిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై రైల్వే చట్టంలోని 146, 147, 153, 174 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితుల్లో ప్రధానంగా ముద్రగడ పద్మనాభం, సాయిన సుధకర్ నాయుడు ఉన్నారు.
ఐదేళ్ల తర్వాత తుని ఘటనలో సమన్లు రావడం చర్చనీయాంశమైంది. తుని ఘటనకు సంబంధించి రాష్ట్ర పోలీసులు నమోదు చేసిన కేసులను గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసింది. కానీ రైల్వే శాఖ మంత్రి ఆ కేసులపై విచారణ సాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే సమన్లు జారీ అయ్యాయి. ఐతే సమన్లపై ముద్రగడ పద్మనాభం గానీ, కాపు ఉద్యమనేతలు గానీ స్పందించలేదు. ముద్రగడ విచారణకు హాజరవుతారా.. లేక న్యాయవాదిని పంపిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
2014 ఎన్నికల మేనిఫెస్టోలో అప్పటి టీడీపీ ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించడంతో ఆ హామీని నెరవేర్చాలని ముద్రగడ పద్మనాభం ఉద్యమానికి పిలుపునిచ్చారు. హామీ ఇచ్చి రెండేళ్లైనా రిజర్వేషన్లు ఇవ్వకపోవడంతో 2016 జనవరి 31న ఛలో తుని బహిరంగ సభకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో అల్లర్లు చెలరేగాయి. అదే సమయంలో తునికి సమీపంలో వచ్చిన రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ను ఆందోళనకారులు దగ్ధం చేశారు. ఆ తర్వాత కాపు రిజర్వేషన్ల కోసం వివిధ రూపాల్లో ముద్రగడ నిరసనలు తెలిపారు. దీంతో అప్పట్లో ముద్రగడతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం.. రిజర్వేషన్ సాధ్యం కాదని వైసీపీ ప్రభుత్వం స్పష్టం చేయడోం కాపు రిజర్వేషన్ ఉద్యమం ఒకింత చల్లబడింది. ఆ తర్వాత సోషల్ మీడియా ట్రోలింగ్, అసత్య ప్రచారాలకు మనస్తాపం చెందిన ముద్రగడ పద్మనాభం.. ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఐతే ఇటీవల రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ముద్రగడతో భేటీకావడం చర్చనీయాంశమైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: East Godavari Dist, Kapu Reservation, Mudragada Padmanabham, Railways, TDP