Pulichintala: కొట్టుకుపోయిన పులిచింతల గేటు దొరికింది.. అడుగంటిన జలాశయం.. రాజకీయ దుమారం

పులి చింతల ప్రాజెక్టు

Pulichintala Project: పులిచింతల గేటు కొట్టుకుపోవడంపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఘటన ఎలా జరిగిందన్న దానిపై నిపుణు కమిటీతో విచారించాలని ఆదేశించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

  • Share this:
    రెండు రోజుల క్రితం కొట్టుకుపోయిన పులిచింతల 16వ గేటు ఎట్టకేలకు దొరికింది. ప్రాజెక్టుకు అర కిలో మీటర్ దూరంలో గేటు లభ్యమయింది. గేటు కొట్టుకుపోయినప్పటి నుంచి జలాశయం నుంచి వరద నీరు వృథాగా పోతోంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా స్టాప్ లాక్ ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇంజినీరింగ్ నిపుణుల ఆధ్వర్యంలో 56 గంటలుగా అక్కడ పనులు జరుగుతున్నాయి. స్టాప్‌ లాక్‌లో భాగంగా మొత్తం 11 ఎలిమెంట్లను నిపుణులు అమర్చనున్నారు. నిన్నటి వరకు ఎగువన నాగార్జున సాగర్ నుంచి భారీగా వరద నీరు రావడంతో పనులకు ఇబ్బందులు కలిగాయి. ప్రస్తుతం 15వేల క్యూసెక్కుల వరద మాత్రమే వస్తుండడంతో స్టాప్ లాక్ పనులను వేగవంతం చేశారు అధికారులు.

    అడుగంటిన జలాశయం:
    16వ నెంబర్ గేటు కొట్టుకుపోవడంతో పులిచింతల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు దిగువకు తరలిపోతోంది. గేటు కొట్టుకుపోయి రంధ్రం ఏర్పడిన చోట ఒత్తిడి పడకుండా ఉండేందుకు మిగతా గేట్లను కూడా ఎత్తడంతో.. జలాశయంలోని నీరంతా దిగువకు వెళ్లిపోయింది. పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. జలాశయంలో నీటి మట్టం 53 మీటర్ల నుంచి 38 మీటర్లకు పడిపోయింది. అంటే ప్రాజెక్టు దాదాపుగా ఖాళీ అయింది. ఇక స్టాప్ లాక్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు పైనుంచి రాకపోకలను నిలిపివేశారు.

    పులిచింతల గేటు కొట్టుకుపోవడంపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఘటన ఎలా జరిగిందన్న దానిపై నిపుణు కమిటీతో విచారించాలని ఆదేశించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. 2003లో పులిచింతల ప్రాజెక్టు కాంట్రాక్టును టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు అప్పటి ప్రభుత్వం కట్టబెట్టింది. నాసిరకంగా నిర్మాణం చేపట్టారని 2015లోనే ఎస్‌డీఎస్ఐటీ తేల్చిచెప్పింది. ఐనా ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యంగా వ్యహరించడంపై దుమారం రేగుతోంది. టీడీపీ కాంట్రాక్టర్ల ధనదాహం వల్లే ప్రాజెక్టుకు ఈ పరిస్థితి వచ్చిందని వైసీపీ మండిపడుతోంది.

    మరోవైపు వైసీపీ నేతల విమర్శలపై టీడీపీ ఎదురు దాడి చేస్తోంది. వైఎస్‌ హయాంలో జరిగిన నాసిరకం పనుల కారణంగానే పులిచింతల గేటు కొట్టుకుపోయిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైఎస్ హయాంలోనే పులిచింతల ప్రాజెక్టు ప్రారంభమైందని.. తమ కల నెరవేరిందని వైసీపీ నేతలు గతంలో ప్రచారం చేసుకున్నారని ఆయన గుర్తు చేశారు. టీడీపీ శాసనసభ, మండలి పక్ష నేతలు, ఇతర ముఖ్యనేతలతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు.

    ఇవి కూడా చదవండి:

    Andhra Pradesh: బీజేపీపై ఏపీ మంత్రి సంచలన ఆరోపణలు.. అసలేం జరిగింది?

    AP Politics: రాహుల్ తో జగన్ జత కడతరా..? పీకే వ్యూహం అదేనా..? టార్గెట్ 2024
    Published by:Shiva Kumar Addula
    First published: