‘కోడ్ ఉంది.. కుదరదు’.. ఏపీ అంతటా ఇదే మాట

ఆంధ్రప్రదేశ్ మ్యాప్

రాష్ట్రంలో సమస్యలను గాలికొదిలి సీఎస్ ఢిల్లీ పర్యటనలు చేయడమేంటన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

 • Share this:
  ఏపీలో సార్వత్రిక ఎన్నికలు తొలిదశలోనే ముగిసిపోవడం, పోలింగ్‌కు, ఫలితాలకు మధ్య ఆరువారాల సమయం ఉండటం ఇప్పుడు సాధారణ జనానికి చుక్కలు చూపిస్తోంది. అసలే ఎప్పుడు వంక దొరుకుతుందా అని ఎదురుచూసే ప్రభుత్యోద్యోగులంతా ఇప్పుడు ఎన్నికల కోడ్ ను సాకుగా చూపుతూ అత్యవసర పనుల కోసం వచ్చే జనాన్ని సైతం వెనక్కి పంపుతున్నారు. దీంతో ఎన్నికలు ఎందుకొచ్చాయిరా దేవుడా అంటూ జనం తలలు పట్టుకుంటున్నారు. మండు వేసవిలో తాగునీటి కనెక్షన్లు కావాలన్నా, బోరు వేయించుకోవాలన్నా, ఆఖరుకు నీటి ట్యాంకర్ కావాలన్నా అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. కీలకమైన రిజిస్ట్రేషన్లు, ధృవపత్రాలు, అనుమతుల జారీ విషయం సరేసరి. అసలే రాష్ట్రంలో పాలన ఎవరు చేయాలో తేల్చుకోలేక సీఎం, సీఎస్ మధ్య రోజుకో వివాదం చెలరేగుతుంటే, ఎన్నికల కోడ్ పేరుతో అధికారులు తమ విధుల నిర్వహణలో అలసత్వం చూపుతున్నారు. నిత్యం ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ పనుల కోసం వచ్చే జనాన్ని కోడ్ ఉన్నందున జూన్ లో రావాలని చెప్పి వెనక్కి పంపుతున్నారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం సైతం సక్రమంగా నిర్వహించలేని పరిస్ధితి పలు ప్రభుత్వ కార్యాలయాల్లో నెలకొంది.

  తాగునీటి కనెక్షన్ కోసం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నాం. ఎన్నికలకు ముందు కార్పొరేషన్ కు వెళితే ఎన్నికలు అన్నారు, ఇప్పుడు కోడ్ అమల్లో ఉందంటున్నారు. జూన్ లో రావాలని చెబుతున్నారు. వేసవిలో కుళాయిల్లో నీరు రాక, మున్సిపాలిటీ వాళ్లు కనెక్షన్లూ ఇవ్వక మేం తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అధికారులు మే నెల రాక ముందే తగు చర్యలు తీసుకోవాలి.
  విజయవాడ భవానీపురంలో ఓ మహిళ


  ఎన్నికల కోడ్ పేరుతో రాష్ట్రంలో వివిధ శాఖల్లో అనుమతుల జారీని సైతం వాయిదా వేస్తున్నారు. చాలా చోట్ల అధికారులు ఎన్నికల విధుల పేరుతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండటం లేదు. దీంతో ప్రజలు యాతన పడుతున్నారు. తాగునీటి సరఫరాపై మంత్రి లోకేష్ రివ్యూ మీద అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆయన కూడా సమీక్షలకు దూరంగా ఉంటున్నారు. అలాగని అధికారులు పరిస్ధితిని చక్కదిద్దుతున్నారా అంటే అదీ లేదు. రాష్ట్రవ్యాప్తంగా వేసవి సందర్భంగా తలెత్తే పలు సమస్యలపై ఉన్నత స్ధాయిలో సమీక్షలు నిర్వహించి తగు ఆదేశాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కోడ్ అమల్లో ఉందన్న కారణంతో సీఎం రివ్యూలు నిర్వహించలేకపోయినా, ఆయన స్ధానంలో సీఎస్, ఇతర అధికారులు చురుగ్గా స్పందించాల్సి ఉంది. కానీ ఆ పరిస్ధితి కనిపించడం లేదు.

  సీఎంతో నెలకొన్న విభేదాలపై కేంద్ర పెద్దలకు నివేదించడానికి సీఎస్ ఢిల్లీ వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది. పైకి జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మీటింగ్ కు హాజరయ్యేందుకు వెళ్తున్నట్లు సీఎస్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. అయితే రాష్ట్రంలో సమస్యలను గాలికొదిలి సీఎస్ ఢిల్లీ పర్యటనలు చేయడమేంటన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ప్రజారోగ్యం, తాగునీటి సరఫరా, వేసవిలో వ్యవసాయ రంగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు ఎప్పటికప్పుడు స్పందించాల్సి ఉంటుంది. దీంతో పాటు మరెన్నో అంశాల్లో ప్రభుత్వం తరఫున ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అంతా ఎవరికి వారే అన్నట్లుగా ఉండిపోవడం, అడిగితే కోడ్ పేరుతో తప్పించుకోవడం జనంలో ఆగ్రహం నింపుతోంది.

  ప్రభుత్వ కార్యాలయాల్లో నిత్యావసర అంశాలపై అధికారులు స్పందించకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రాలకు, రాజధానికి వచ్చే జనం ఇబ్బందులు పడుతున్నారు. సచివాలయంలో సైతం పనులు ముందుకు సాగకపోవడంతో కొంతకాలంగా జనం రావడమే మానేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడి, అది కుదురుకునే వరకూ ఇదే పరిస్ధితి కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

  (సయ్యద్ అహ్మద్,అమరావతి కరస్పాండెంట్,న్యూస్‌18)
  First published: