• Home
  • »
  • News
  • »
  • andhra-pradesh
  • »
  • PROVIDE AID TO ANDHRA PRADESH IMMEDIATELY CM YS JAGAN MOHAN REDDY LETTER TO UNION HOME MINISTER AMIT SHAH AK

Andhra Pradesh: పరిస్థితి దారుణం.. ఆదుకోండి.. కేంద్రానికి సీఎం జగన్ లేఖ

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ (ఫైల్ ఫోటో)

CM YS Jagan Mohan Reddy: వివిధ శాఖల ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు రూ.4450 కోట్ల మేర నష్టం జరిగిందని.. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం అండగా నిలవాల్సి ఉందని అమిత్ షాకు రాసిన లేఖలో సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.

  • Share this:
    ఇప్పటికే కోవిడ్‌–19తో ఆర్థికంగా నష్టపోయి ఉన్న రాష్ట్రంలో, ఇప్పుడు వర్షాలు, వరదలు పరిస్థితిని మరింత దారుణంగా మార్చాయని ఏపీ సీఎం జగన్ కేంద్రానికి వివరించారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయామని లేఖలో పేర్కొన్నారు. అందువల్ల ఆదుకునేందుకు వెంటనే రూ.2250 కోట్ల ఆర్థిక సహాయం చేయడంతో పాటు, జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా రాష్ట్రంలో ఈనెల 9 నుంచి 13వ తేదీ వరకు భారీ వర్షాలు కురిశాయని.. ఎగువన తెలంగాణ, మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురవడంతో కృష్ణా నదికి వరద పొటెత్తిందని లేఖలో ప్రస్తావించారు.

    భారీ వర్షాలు, వరదలతో జన జీవితం అస్తవ్యస్తమైందని సీఎం జగన్ అన్నారు. గత ఆగస్టు, సెప్టెంబరులోనూ భారీ వర్షాలు కురవడం, ఇప్పుడు సంభవించిన వరదలతో నష్టం మరింత పెరిగిందని సీఎం జగన్ అమిత్ షాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. వరుసగా కురిసిన వర్షాలు రాష్ట్రంలో రహదారులను తీవ్రంగా దెబ్బతీశాయని అన్నారు. ఎక్కడికక్కడ వాగులు ఉప్పొంగడంతో రవాణా వ్యవస్థ కూడా నిల్చిపోయిందని వివరించారు. వరద సహాయ కార్యక్రమాల్లో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది నిర్విరామంగా పని చేసినప్పటికీ, 14 మంది చనిపోయారని లేఖలో తెలిపారు. ఈ వర్షాల వల్ల రైతులు కూడా చాలా నష్టపోయారని అన్నారు.

    ముఖ్యంగా చేతికొచ్చే దశలో ఉన్న వరి, పత్తి, మొక్కజొన్న, చెరకు పంటలు తీవ్రంగా దెబ్బ తిన్నాయని అన్నారు. వివిధ శాఖల ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు రూ.4450 కోట్ల మేర నష్టం జరిగిందని.. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం అండగా నిలవాల్సి ఉందని లేఖలో సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టి, తిరిగి సాధారణ పరిస్థితికి తీసుకు రావడం కోసం తక్షణమే ముందస్తుగా కనీసం రూ.1000 కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు.
    Published by:Kishore Akkaladevi
    First published: