పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) భీమవరం (Bheemavaram) లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు (Alluri Seetharama Raju) విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఆవిష్కరించారు. అల్లూరి 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన.. తెలుగులో ప్రసంగించి అందర్నీ ఆకట్టుకున్నారు. తెలుగువీరలేవరా.. దీక్ష బూని సాగరా..! అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టిన మోదీ.. స్వాతంత్ర్య ఉద్యమంలో యావత్ భారతావనికే స్ఫూర్తిగా నిలిచిన మన నాయకుడు అల్లూరి సీతారామ రాజు పుట్టిన నేల మీద మనమందరం కలుసుకోవడం మన అదృష్టమంటూ తెలుగులో మాట్లాడారు. అల్లూరి జీవితం భారతీయులందరికీ స్ఫూర్తినిచ్చిందన్నారు. స్వాతంత్ర్యం కోసం అల్లూరి చేసిన పోరాటం చాలా గొప్పదని.. భవిష్యత్ తరాలకు ఆయన స్ఫూర్తిగాధ తెలియాల్సిన అవసరముందన్నారు.
అజాదీగా అమృత్ మహోత్సవంలో భాగంగా అల్లూరి పుట్టిపెరిగిన ప్రాంతంతో పాటు ఆయన పోరాటం సాగించిన ప్రాంతాల్లో స్మారక నిర్మాణాలను అభివృద్ధి చేస్తున్నట్లు మోదీ వివరించారు. 24 ఏళ్ల వయసులోనే పోరాటాన్ని ప్రారంభించిన అల్లూరి కేవలం మూడేళ్ల తర్వాత అంటే 27 ఏళ్లకే ప్రాణాలు అర్పించారన్నారు. అల్లూరితో పాటు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారందరూ మనకి స్ఫూర్తి అని మోదీ అన్నారు.
ఆంధ్ర రాష్ట్రంలో ఎందరో దేశభక్తులకు జన్మనిచ్చిందని... జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య, కన్నెగంటి హనుమంతరావు, కందుకూరి విరేశలింగం, పొట్టి శ్రీరాములు వంటి మహనీయులకు జన్మనిచ్చిన గట్ట ఆంధ్రా అన్నారు. అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని మనం ఖచ్చితంగా స్మరించుకోవాలన్నారు మోదీ.
ఇది చదవండి: ఇటు బీజేపీ.. అటు టీడీపీ.. మధ్యలో పవన్..! పొలిటికల్ గేమ్ లో గెలుపెవరది..?
అల్లూరి జిల్లా లంబసింగిలో అల్లూరి సీతారామరాజు గుర్తుగా మ్యూజియం నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడున్న అటవీ సంపద అంతా గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం ఇప్పటికే 90 రకాల అటవీ ఉత్పత్తులకు కనీస గిట్టుబాటు ధరలు ఖరారు చేశామని మోదీ తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా 3వేల వనధన్ యోజన కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఏపీలోని విశాఖలో ట్రైబల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ను స్థాపించినట్లు చెప్పారు. ఆదివాసీ యువతను అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. అందుకోసం గిరిజన జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టామన్నారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నామని మోదీ తెలిపారు.
బ్రిటీష్ వారిపై పోరాడే క్రమంలో అల్లూరి సీతారామరాజు చూపించిన తెగువ 130 కోట్ల మంది భారతీయులందరికీ స్ఫూర్తి అని.. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై అల్లూరి మాదిరిగానే పోరాడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అల్లూరి స్ఫూర్తితో ముందుకెళ్తే.. మనల్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Narendra modi