PRESENT KARNATAKA CM YEDIYURAPPA WILL BE NEXT ANDHRA PRADESH GOVERNOR NGS
AP Governor: ఏపీ గవర్నర్ గా యడ్యూరప్ప.. బీజేపీ సీనియర్ నేత ఏమన్నారంటే..?
ఏపీ గవర్నర్ గా యడ్యురప్ప
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా యడ్యూరప్పను నియమిస్తున్నారా..? త్వరలోనే ఆయన గవర్నర్ బాధ్యతలు చేపడతారా.. ప్రస్తుతం ఈ వార్త ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.. సీఎం గా ఉన్న ఆయన గవర్నర్ గా ఎందుకొస్తారు.? ఈ ప్రచారంలో వాస్తవమెంత..?
ఏపీ రాజకీయాలపై కేంద్రం ఫోకస్ చేసింది. చాలా కాలంగా ఏపీలో బలపడాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటి వరకు క్షేత్ర స్థాయిలో ఆ ఫలితాలు కనిపించడం లేదు. టీడీపీ కీలక నేతలను బీజేపీలోకి చేర్చుకుంది. కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవాలి అనుకుంది. హిందూ దేవాలయాలపై దాడులకు వ్యతిరేకంగా ఉద్యమమే చేపట్టింది. అక్కడితోనే ఆగలేదు ప్రజల్లో ఆకర్షణ ఉన్న నేత అంటూ పవన్ ను అక్కున చేర్చుకుంది. బీజేపీ -జనసేన దోస్తీ కట్టాయి. ఇలా ఒకటేంటి బీజేపీ చేయని ప్రయత్నం లేదు.. కానీ ఫలితం మాత్రం మారడం లేదు. అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం ముందు బీజేపీ నిలబడలేకపోతోందని స్థానిక ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నిక రుజువు చేశాయి. అయినా బీజేపీ పట్టు విడడం లేదు ఏపీపై తమ ముద్ర ఉండాలని భావిస్తోంది. దీంతో మరో వ్యూహం సిద్ధం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. సీనియర్ బీజేపీ నేత, ప్రస్తుతం కర్నాటక సీఎం యడ్యూరప్పను ఏపీ గవర్నర్ గా నియమిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది..
ప్రస్తుత రాష్ట్ర గవర్నర్ హరిచందన్ బిశ్వభూషన్ పదవీ కాలం జూలై 23 తో ముగుస్తోంది. ఆయనపై పెద్దగా రిమార్క్స్ ఏమీ లేవు. అయితే ఆయన్ను మారుస్తారు అంటూ చర్చ మొదలైంది. సాధారణంగా గవర్నర్ మార్పు అన్న అంశం పెద్ద చర్చనీయాంశం కాదు. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో గవర్నర్ మార్పు పెద్ద సంచలనమవుతోంది. కమలదళం ఏపీలో బలమైన పార్టీగా ఎదగాలి అనుకుంటున్న క్రమంలో ఈసారి నామ్ కే వాస్తే గవర్నర్ ను పెట్టకూడదని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు ప్రచారం ఊపందుకుంది.
ఏపీ బీజేపీ నేతల్లో మాత్రం ఇదే విషయంపై చర్చ జరుగుతోంది. వీలైతే సరైన గవర్నరును దించి జగన్ జైలుకు పంపేందుకు ఢిల్లీ వేదికగా ప్లాన్ రచిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు అన్ని రకాలుగా సూటయ్యే వ్యక్తిని గవర్నర్ గా రంగంలోకి దింపాలని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్టు సోషల్ మీడియాలో లీకులు ఇస్తున్నారు. కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ను ఏపీ గవర్నరుగా నియమిస్తున్నట్టు ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. సీఎంగా ఉన్న ఆయన గవర్నర్ గా ఎందుకు వస్తారు అని చాలామంది డౌట్ పడుతున్నారు.
ప్రస్తుతం కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప పై అసమ్మతి సెగలు తీవ్రమైన నేపథ్యంలో.. ఆయనను తొలిగించి.. మరో వ్యక్తిని సీఎం చేస్తారనే ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప బలమైన నేపథ్యం నుంచి వచ్చిన నాయకుడు కావడంతో ఆయన మర్యాద ఏ మాత్రం తగ్గకుండా ఏ పదవి ఇద్దాం అని ఆలోచించినపుడు.. ఏపీకి గవర్నర్ గా పంపిస్తే పార్టీకి కూడా మేలు జరుగుతుందని హైకమాండ్ నిర్ణయానికి వచ్చిందని ప్రచారం జరుగుతోంది. యడ్యూరప్ప గవర్నర్ గా వస్తే వైసీపీకి కూడా మంచే జరుగుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎందుకంటే జగన్ సన్నిహితుడు, పార్టనర్ అని రాజకీయ వర్గాల్లో చెప్పే వ్యక్తి అయిన గాలి జనార్దన్ రెడ్డికి యడ్యూరప్పకు మంచి సంబంధాలు ఉన్నాయి. అంటే జగన్ తో సయోధ్య ఉంటుందని వారు భావిస్తున్నారు. అయితే ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే...
ఈ వార్తలపై కర్నాటక బీజేపీ సీనియర్ నేతతో న్యూస్ 18 టీం మాట్లాడి వివరణ తీసుకుంది. ఏపీ గవర్నర్ గా యుడ్యూరప్ప రావడం అసాధ్యమన్నారు. ఆయన ఇప్పట్లో సీఎం పీఠం నుంచి దిగరని స్పష్టం చేశారు. అయితే త్వరలో జరిగే కేంద్ర కేబినెట్ విస్తరణలో.. యడ్యూరప్ప తనయుడికి కేంద్ర మంత్రి పదవి ఇస్తే మాత్రం.. ఆయన సీఎం పదవి నుంచి దిగే అవకాశం ఉంది. అలా సీఎం పదవి నుంచి తప్పుకున్నా ఆయన మరెలాంటి పదవులు చేపట్టడానికి సిద్ధంగా లేరంటున్నారు. వయసు రీత్య సమస్యలతో పాటు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఆయన కేవలం విరామానికే పరిమితం అవుతారని వివరణ ఇచ్చారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.