Anna Raghu, News18, Amaravati
క్రికెట్ (Cricket) అంటే ఇండియాలో ఓ పిచ్చి. ముఖ్యంగా యువకుల్లో అయితే క్రికెట్ ఉన్న క్రేజే వేరు. క్రికెట్ మ్యాచ్ లు స్టార్ట్ అయ్యాయంటే యువకులంతా మ్యాచ్ మాయలోనే ఉంటారు. కొంతమంది తమ అభిమాన ఆటగాడు రాణించాలని పూజలు చేస్తుంటారు. ఐతే కొందరు క్రికెట్ పై ఉన్న ఇష్టాన్ని బెట్టింగ్స్ (Cricket Betting) వైపు మళ్లిస్తుంటారు. కాయ్ రాజా కాయ్ అంటూ అందులో డబ్బులు పోస్తుంటారు. నిముషాల్లో లక్షాధికారులవ్వాలని.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలని కలలుగంటారు. అనుకున్నట్లు నిముషాల్లో లక్షలు చేతులు మారుతున్నాయి. గంటల్లో జీవితాలు తలకిందులవుతున్నాయి. పల్లె, పట్టణం అన్న తేడాలేదు. యువకులను ఆకర్షిస్తూ ఆశపెట్టిస్తూ. చివరకు నట్టేట ముంచేస్తోంది. అది వన్డే అయినా, టెస్ట్ అయినా టీ-20 అయినా లక్షలు కుమ్మరిస్తున్నారు. క్రికెట్ సీజన్ అయిపోయేసరికి అప్పుల పాలవుతున్నారు. ఆ అప్పులు తీర్చటానికి ఆస్తులమ్మిన సరిపోకపోవటంతో దొంగతనాల బాట పడుతున్నారు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రకాశం జిల్లా(Prakasham) పామూరు మండలం పుట్టనాయుడు పల్లి గ్రామానికి చెందిన రాయవరపు శ్రీనివాస్ ఇంటర్ వరకు చదివాడు తల్లితండ్రులు బ్రతుకుదెరువుకు పూణే వెళ్లడంతో శ్రీవివాస్ కూడా వారితోపాటు వెళ్లాడు. తల్లిదండ్రులు పనికి వెళ్తుంటే అతడు మాత్రం ఖాళీగా ఉండ తిని కూర్చునేవాడు. ఇంట్లో ఉంటూ క్రికెట్ మ్యాచ్ లు చూస్తుండేవాడు. ఈక్రమంలో క్రికెట్ బెట్టింగులకు అలవాటుపడ్డాడు. ఐతే బెట్టింగ్ లో పడి ఉన్నదంతా ఊడ్చేశాడు. పైగా భారీగా అప్పులు తీర్చడంతో తల్లిదండ్రులు సొంత ఇంటిని, సోదరి లారీలను అమ్మి దాదాపు రూ.40 లక్షలు ఇచ్చారు. అయినా మనోడిలో మార్పురాలేదుకదా.. వ్యసనం మరింత పెరిగిపోయింది.
పూణే నుంచి స్వగ్రామానికి వచ్చేసి ఇక్కడ కూడా బెట్టింగులు వేయడం మొదలుపెట్టాడు. అప్పులు పెరిగిపోవడంతో దొంగతనాల బాటపట్టాడు. అర్ధరాత్రి షాపుల తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేయడం.. ఆ డబ్బును డిపాజిట్ మెషీన్ల ద్వారా తన ఎకౌంట్లో వేసుకొని ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ అయిన 1Xbet, betway, wolf777, 22bet, IPL winలో పందేలు కాసేవాడు. డబ్బు పోయిన తరువాత మల్లి దొంగతనాలకు పాల్పడేవాడు. ఇలా దొంగతనాలకు పాల్పడుతున్న నేపథ్యంలో పోలీస్ విచారణలో శ్రీనివాస్ ను గుర్తించి అదుపులోకి తీసుకోవటంతో శ్రీనివాస్ వ్యవహారం బయటపడింది.
తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎల్ జరిగిన సమయంలో క్రికెట్ బెట్టింగ్ మరింత విజృంభిస్తోంది. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఎవరైనా ఎవరితోనైనా బెట్టింగ్ వేయొచ్చు. ఈ క్రమంలో చాలా మంది ఉన్న డబ్బును పొగొట్టుకోవడంతో పాటు అప్పులపాలవుతున్నారు. కొందరు అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.