పిచ్చి సరదాలు ప్రాణాలు తీస్తాయని ...సోషల్ మీడియా(Social media)లో వెరైటీ పోస్ట్‌లు, ఫోటోలు షేర్ చేయాలనే మోజు మరణానికి దారి తీస్తుందని ఊహించలేకపోయాడు. పాము(Snake)లతో జాగ్రత్తగా ఉండాల్సింది పోయి ..దాంతో సెల్ఫీ(Selfie)దిగేందుకు ముచ్చటపడి నూరేళ్ల ప్రాణాన్ని పణంగా పెట్టి కన్నతల్లిదండ్రులకు దూరమయ్యాడు ఓ 22 ఏళ్ల యువకుడు. ప్రకాశం జిల్లా(Prakasam district)లో మంగళవారం (Tuesday)రాత్రి జరిగిన ఈసంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
శివుడిగా ఫోజివ్వాలని శవమయ్యాడు..
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం, బొద్దికూరపాడుకు చెందిన మణికంఠరెడ్డి అనే పాతికేళ్ల యువకుడు కందుకూరులోని ఆర్టీసీ డిపో సమీపంలో జ్యూస్ స్టాల్ నడుపుకుంటున్నాడు. మంగళవారం సాయంత్రం తన పక్కనే ఉన్న మరో షాపుకు పాములు ఆడించే వ్యక్తి రావడంతో అతని దగ్గరున్న పామును మెడలో వేసుకొని ఫోటో దిగాలని...దాంతో సెల్ఫీ దిగాలని ముచ్చటపడ్డాడు. అదే విషయాన్ని పాములు ఆడించే వ్యక్తి వెంకటస్వామికి చెప్పాడు. అతను కూడా సరే అనడంతో తాచు పామును మెడలో వేసుకున్నాడు. ఫోటోలు తీయని పక్క షాపులో పని చేస్తున్న కుర్రాడికి తన సెల్‌ఫోన్ ఇచ్చాడు. అంతా బాగానే ఉంది. పాము మెడలో ఉన్నంత సేపు ఏం కాలేదు. తీసి కింద వదిలిపెడుతుండగా మెడపై కాటు వేసింది.
ప్రాణం తీసిన సెల్ఫీ సరదా ..
పాము కాటు వేయడంతో స్థానికులు వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించాలని సూచించారు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు మణికంఠరెడ్డి. పాము కాటుతో చనిపోయిన విషయాన్ని డాక్టర్లు మృతుని తల్లిదండ్రులకు తెలియజేయడంతో షాక్ అయ్యారు. అయితే పాముతో సెల్ఫీలు దిగిన విషయం తెలిస్తే తల్లిదండ్రులు తిడతారని కందుకూరు ఆసుపత్రిలోనే తన సెల్‌ఫోన్‌లో ఉన్న పాము సెల్ఫీ ఫోటోలు డిలీట్ చేసినట్లుగా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
పాతికేళ్లకే నూరేళ్లు నిండాయి..
పాతికేళ్ల కొడుకు సరదాకు పోయి ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటన తల్లిదండ్రులతో పాటు స్థానికుల్ని తీవ్రంగా కలచి వేసింది. ఐదేళ్ల క్రితమే మణికంఠరెడ్డి సోదరుడు ఇంద్రారెడ్డి కిడ్నీ సంబంధిత సమస్యతో చనిపోయాడని బంధువులు తెలిపారు. చేతికి అందొచ్చిన ఇద్దరు కొడుకులు దూరమైన దంపతుల్ని చూసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మణికంఠరెడ్డి ఫిర్యాదుతో పాములు ఆడించే వ్యక్తి వెంకటస్వామిపై పోలీసులు జంతు హింస చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.