హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tiger Attack in AP: రక్తం మరిగిన పులి.. ఈసారి మనిషిపై దాడి.. హడలిపోతున్న జనం..

Tiger Attack in AP: రక్తం మరిగిన పులి.. ఈసారి మనిషిపై దాడి.. హడలిపోతున్న జనం..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

కాకినాడ (Kakinada), అనకాపల్లి జిల్లాల్లో ఇప్పటికే రాయల్ బెంగాల్ టైగర్ అలజడి సృష్టిస్తోంది. ఇప్పుడు ప్రకాశం జిల్లా (Prakasham District) లోనూ పులి దాడులు కొనసాగుతున్నాయి.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను పెద్దపులులు (Tigers) వణికిస్తున్నాయి. అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లోకి వస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కాకినాడ (Kakinada), అనకాపల్లి జిల్లాల్లో ఇప్పటికే రాయల్ బెంగాల్ టైగర్ అలజడి సృష్టిస్తోంది. ఇప్పుడు ప్రకాశం జిల్లా (Prakasham District) లోనూ పులి దాడులు కొనసాగుతున్నాయి. కొన్నిరోజులుగా పశువులపై దాడి చేస్తున్న పులి ఈసారి మనిషిపై ఎటాక్ చేసింది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని అటవీ ప్రాంతంలోని గంజివారిపల్లె పాలుట్ల గూడెంకు చెందిన దేశావత్ బాలునాయక్ అనే వ్యక్తి తన కుమారుడు శివకృష్ణతో కలిసి ఇస్రురాయిపుట్ట వద్ద ఎద్దులు మేపేందుకు వెళ్లాడు. సాయంత్రం ఎద్దులను తొలుకొని ఇంటికి వస్తుండగా పొదల్లో మాటువేసిన పులి బాలునాయక్ పై దాడి చేసింది. ఐతే అతడు తన చేతికర్రను ధైర్యంగా పులి నోటికి అడ్డుగా పెట్టడంతో తలపై పంజాతో కొట్టింది. దీంతో బాలునాయక్ తలకు గాయమైంది. తండ్రీకొడుకులిద్దరు కేకలు వేయడంతో పులి పారిపోయింది. గాయపడ్డ బాలునాయక్ ను స్థానికులు యర్రగొండపాలెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు బాధితుడి వైద్య ఖర్చులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

  ఇదిలా ఉంటే ప్రకాశం జిల్లాలోని నల్లమల అటవీప్రాంతంలో పెద్ద పులి ప్రజలను వణికిస్తోంది. దోర్నాల, యర్రగొండపాలెం అటవీ ప్రాంతాల్లో సంచరిస్తోంది. రెండు వారాల క్రితం ఇదే ప్రాంతంలో ఓ ఆవుపై దాడి చేసి చంపి తినేసింది. దీంతో జనం పొలాలకు వెళ్లాలంటేనే భయపడిపోవాల్సిన పరిస్థితి. గత ఏడాది కూడా పాలుట్ల గిరిజన గూడెంలోకి వచ్చిన పులి ఆవుపై దాడి చేసింది. ఇక్కడి గిరిజనులకు పెద్దపులి దాడులు అలవాటైపోయాయి.

  ఇది చదవండి: శ్రావణ భార్గవి పాటలో ఏముంది..? అన్నమయ్య వారసుల అభ్యంతరాలేంటి..?


  ఇటీవల పెద్దపులుల దాడులు అధికమవడంతో గిరిజనులు అడవి లోపలికి వెళ్లొద్దని సూచిస్తన్నారు. పులులు తాగునీటి కోసం గిరిజన గూడేల సమీపంగా వస్తున్నాయని.. అదే సమయంలో కనిపించిన పశువులపై దాడి చేస్తున్నట్లు తెలిపారు. నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ లో మొత్తం 62 పులులున్నాయని.. కర్నూలు పరిధిలోని ఆత్మకూరు, నంద్యాల, శ్రీశైలం, ప్రకాశం పరిధిలోని గిద్దలూరు, మార్కాపురం ప్రాంతాలు నాగార్జున సాగర్ పరిధిలో ఉన్నట్లు వెల్లడించారు.

  ఇదిలా ఉంటే అటు అనకాపల్లి జిల్లాలో పెద్దపులి హడలెత్తిస్తోంది. అటవీ ప్రాంతం నుంచి దాదాపు మైదాన ప్రాంతం వైపు వచ్చిన పులి రాత్రి సమయంలో పశువుల పాకల్లో ఆవులు, మేకలు, గెదేలను చంపితింటోంది. అటవీ శాఖ అధికారులు బోన్లు ఏర్పాటు చేసినా చిక్కకుండా ముప్పతిప్పలు పెడుతోంది. పులిని పట్టుకునేందుకు అధికారులు రాత్రింబవళ్లు ప్రయత్నిస్తున్నా ఫలించడం లేదు. మరోవైపు పులి అలజడితో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడిపోతున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Prakasham dist, Tiger Attack

  ఉత్తమ కథలు