Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati
నాటి రోజుల్లో ఎక్కడ చూసినా బావులే. వాటికి గిలకలు అమర్చి , ప్రజలు నీటిని తెచ్చుకొనేవారు. అటువంటి ఓ బావి నాడు స్వాతంత్ర్య సమరంలో ఎందరో మహనీయుల దప్పిక తీర్చింది. కానీ నేటికీ మరుగున పడకుండా, ప్రజల దాహార్తి తీరుస్తూ తనకంటూ ప్రత్యేకతను సంతరించుకుంది ఈ గిలకల బావి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ బావి ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు లో ఉంది. సంతనూతలపాడు లోని శ్రీ గంగా పార్వతి సమేత త్రిపురాంతక స్వామి ఆలయం సమీపంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నేటికీ ఈ గిలకల బావి ఉంది. 1942 లో ఈ గిలకల బావి ని నాటి పూర్వీకులు త్రవ్వారు. అయితే అప్పటి కాలంలో ప్రజల దాహార్తి తీర్చడంలో ఈ బావే కీలకమని నేటికీ స్థానిక ప్రజలు చెబుతారు. నాడు మోటార్లు లేవు, కేవలం గిలకల బావిలో బకెట్ల ద్వారా నీటిని తోడుకోవడమే. అంతటి చరిత్ర కలిగిన ఎన్నో గిలకల బావులు ప్రస్తుతం కనుమరుగైన పరిస్థితి మనం కళ్లారా చూస్తుంటాం. కానీ ఈ గిలకల బావి సుమారు 82 సంవత్సరాలుగా ప్రజల దాహార్తిని తీరుస్తోంది. ఏ కాలమైనా బావిలో నీరు ఇంకిపోకపోవడం ఇక్కడ ప్రత్యేకత సంతరించుకుంది.
ఊరి దప్పిక తీరుస్తున్నది ఈ బావే
సంతనూతలపాడుకు చెందిన ప్రజానీకం త్రాగునీటి కై తప్పనిసరిగా ఈ బావి వద్దకు రావాల్సిందే. నేటి తరానికి చెందిన యువకులు సైతం గిలకల బావి వద్దకు వచ్చి, తాడు సహాయంతో నీటిని పైకి తీసి, బబుల్ ల ద్వారా బైక్ లపై గృహాలకు నీటిని ఈ బావి నుండే తీసుకెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తారు.
మినరల్ నీటి కంటే ఈ బావి నీరే మిన్న
ఈ బావి నీరు తియ్యగా, సర్వరోగ నివారిణి జలాలను తలపిస్తాయని స్థానిక ప్రజలు తెలుపుతారు. మినరల్ నీటి కంటే బావి నీరు ఎంతో శ్రేష్టంగా ఉంటాయని, ఈ బావి తమ దాహార్తిని ఇప్పటికీ తీర్చడం విశేషమంటారు ఇక్కడి ప్రజలు. ఉదయం , సాయంత్రం బావి నీటి కోసం క్యూ లైన్ సైతం ఉంటున్న పరిస్థితి, ఇక్కడ ప్రతి రోజు కనిపిస్తుంది. అటువంటి చరిత్ర కలిగిన బావి, నాటి నుండి నేటికీ ప్రజల దాహార్తి తీర్చడం ఆశ్చర్యమే కదా !
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Prakasham dist