Shaik Salam, News18, Ongole
వారి కులాలు వేరు.., మతాలు వేరు. అయినా ప్రేమ వారిద్దరిని ఒకటి చేసింది. ఆ ప్రేమే మానవత్వంగా పరిమళించి, నేడు అన్నార్తులకు వారే అమ్మానాన్నలు అయ్యారు. వారే ప్రకాశం జిల్లా (Prakasham District) ఒంగోలు (Ongole) లోని బొమ్మరిల్లు నిర్వాహకులు ఖాసీం, రాజ్యలక్ష్మి దంపతులు. ఒంగోలుకు చెందిన ఖాసీం, రాజ్యలక్ష్మిలు 1980లో స్థానిక శర్మ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సమయంలో వారి మనసులు ఒక్కటయ్యాయి. అయితే కులాలు వేరైనా, మనసులు కలిసిన వీరు 1984లో వివాహం జరుపుకొని ఒక్కటయ్యారు. అప్పుడే వీరు పట్టు పరిశ్రమ శాఖలో ఉద్యోగాన్ని సాధించారు.
23ఏళ్లుగా సేవ
ఈ దంపతులు పట్టు పరిశ్రమ శాఖలో ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న సమయంలోనే రోడ్ల వెంట దిక్కుతోచని స్థితిలో ఉన్న అనాధలను చూసి చలించిపోయారు. 2000 సంవత్సరంలో అన్నార్తులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో బొమ్మరిల్లును ఏర్పాటు చేశారు. ఈ బొమ్మరిల్లులో తల్లి తండ్రి కోల్పోయిన చిన్నారులను, తల్లిదండ్రులు వదిలివేసిన చిన్నారుల సంరక్షణను వారు ప్రారంభించారు. ఇలా అమ్మానాన్న లేని చిన్నారులకు వారే అమ్మానాన్నలై పాలన పోషణ సాగిస్తున్నారు.
పదవీ విరమణ అనంతరం విస్తృతంగా సేవా కార్యక్రమాలు
ఖాసీం, రాజ్యలక్ష్మి లు పదవీ విరమణ అనంతరం మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిశ్చయించుకున్నారు. తమకు అందే పింఛన్ నగదు, అప్పుడప్పుడు దాతలు అందించే సహకారంతో బొమ్మరిల్లుతోపాటు హరివిల్లు, జాబిల్లి, పొదరిల్లు వంటి కేంద్రాలను సైతం ఏర్పాటు చేసి, దిక్కు తోచని స్థితిలో ఉన్న వృద్ధులకు ఆశ్రయమిస్తూ ఉన్నారు.
బొమ్మరిల్లులో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు
బొమ్మరిల్లులో సుమారు 100 మంది చిన్నారులు ఉండగా, వీరిలో 30 మంది విద్యార్థులు ఉన్నత విద్యను సైతం ప్రస్తుతం అభ్యసిస్తున్నారు. అలాగే బొమ్మరిల్లులో ఉండే చిన్నారులు ఇటీవల జాతీయస్థాయిలో జరిగిన క్యారమ్స్ పోటీలలో విజేతలుగా నిలిచి పతకాలను సైతం సాధించారు. ఇలా వీరి ఆశ్రయం పొందుతున్న చిన్నారుల ఆలనా, పాలనా వీరే నిత్యం పర్యవేక్షిస్తుండడం విశేషం.
ప్రముఖుల ప్రశంసలు..!
మానవత్వంతో అన్నార్తులకు అండగా నిలుస్తున్న ఖాసీం, రాజ్యలక్ష్మి దంపతులకు జాతీయస్థాయిలో పలు సేవ అవార్డులు దక్కాయి. అంతేకాక పలువురు ప్రముఖులు సైతం నిత్యం బొమ్మరిల్లును సందర్శిస్తూ తమకు చేతనైన సహాయం చేయడం అభినందించదగ్గ విషయమని ఈ దంపతులు తెలిపారు. ఎందరో పుట్టినరోజులు, వివాహ దినోత్సవాలు జరుపుకునే సమయంలో తమ బొమ్మరిల్లును సందర్శించి బొమ్మరిల్లులోని చిన్నారులకు కానుకలు, ఆహారాన్ని అందిస్తూ తమ వంతు చేయూత అందిస్తున్నారని వీరు తెలిపారు. ఇలా వీరి ప్రేమలో పరిమళించిన మానవత్వం ఎందరో అన్నార్తులకు అండగా నిలుస్తుండగా, ఆదర్శ దంపతులుగా వీరు పేరుగాంచారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Ongole, Prakasham dist