కొన్నిసార్లు సొంత కుటుంబ సభ్యులను గుర్తుపట్టడానికి కూడా పొరబడతాం. అలాంటి సందర్భాల్లోనే కొన్ని విచిత్రాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా మరణాల విషయంలో అప్పుడప్పుడూ ఊహించని పరిణాలు ఎదురవుతుంటాయి. ప్రమాదల్లో మరణించిన వారిని తమ వారుగానే భావించి అంత్యక్రియలు జరిపించి కర్మకాండలు కూడా పూర్తి చేస్తుంటారు కుటుంబ సభ్యులు. తీరా అంతా అయ్యాక వాళ్లు సాఫీగా తిరుగొస్తుంటారు. అలాంటి సీన్ చూసిన ప్రతి ఒక్కరికీ ఫ్యూజులు ఎగిరిపోతుంటాయి. వచ్చింది మనిషా దెయ్యమా అని పరుగులుపెట్టేవారు కూడా ఉన్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రకాశం జిల్లా (Prakasham District) లో ఇలాంటి ఘటనే జరిగింది. అంత్యక్రియలు జరిగిన 41 రోజుల తర్వాత వ్యక్తి తిరిగిరావడంతో ఆ కుటుంబానికి నవ్వాలో ఏడవాలో అర్ధంకాలేదు.
వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి చెందిన సయ్యద్ మియా అనే వ్యక్తి గతంలో ఆర్మీలో పనిచేసేవాడు. మద్యానికి బానిసవడంతో సొంతూరికి వచ్చేశాడు. ఆ తర్వాత లారీ క్లీనర్ గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య రహమత్ బి, ఒక కుమార్తె ఉన్నారు. తరచూ తాగొచ్చి భార్యతో గొడవ పడుతుండటంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. సయ్యద్ మియా ఎప్పుడు పనికి వెళ్లినా రెండు మూడు నెలల తర్వాత ఇంటికొస్తుండేవాడు.
ఇదిలా ఉంటే 40 రోజుల క్రితం మార్కాపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. ఐతే సయ్యద్ మియాకు ఆ మృతదేహానికి దగ్గరి పోలికలుండటంతో అతడే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని భావించిన కుటుంబ సభ్యులు.. మృతదేహానికి వారి సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేశారు.
ఇది చదవండి: పెళ్లి పేరుతో మోసం.. న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిలింగ్.. ఎన్నారై చీటర్ అరెస్ట్..
ఐతే 40 రోజుల తర్వాత కర్మకాండలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో ఇంటికి ఓ మనిషి రావడంతో అందరి ఫ్యూజులు ఎగిరిపోయాయి. చనిపోయాడనుకున్న సయ్యద్ మియా తిరిగి ఇంటికి వచ్చేశాడు. అంత్యక్రియలు చేసిన 40 రోజుల తర్వాత ఎలా తిరిగొచ్చాడని ఆరా తీయగా.. అసలు చనిపోయింది సయ్యద్ మియా కాదు. అతడికి దగ్గర పోలికలున్న మరో వ్యక్తి. లారీపై డ్యూటీకి వెళ్లిన సయ్యద్ మియా ఊళ్లో పీర్ల చావిడి వేడుకలకు ఇంటికొచ్చినట్లు చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి.
గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. తమవారనుకొని అంత్యక్రియలు చేయడం తీరా కొన్నిరోజుల తర్వాత వాళ్లు తిరిగిరావడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనలు మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉండటంతోనే చోటు చేసుకుంటున్నాయి. ముండ్లపాడు ఘటన కూడా అలాంటిదే. మొత్తానికి చనిపోయినవాడు తిరిగొచ్చాడని సయ్యద్ మియా కుటుంబం పండగ చేసుకుంటోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Prakasham dist