Shaik Salam, News18, Ongole
శ్రీ సీతారాముల కళ్యాణము (Sitharama Kalyanam) చూతము రారండి...గరుత్మంతుడి ప్రదక్షిణల సాక్షిగా అంటూ ఇక్కడ భక్తులు భక్తి తన్మయత్వంతో గీతాలు ఆలపిస్తారు. ఈ గీతాలాపన వెనుక చరిత్ర ఎంతో ప్రాశస్త్యం చెందింది. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ప్రకాశం జిల్లా (Prakasham District) లోని నాగులుప్పలపాడు మండలం చదలవాడలో వెలసిన శ్రీరఘునాయక స్వామి ఆలయం చరిత్ర తెలుసుకోవాల్సిందే. చదలవాడ ఊరి పేరు ఎలా వచ్చిందంటే... శ్రీరాముడు అపహరించబడిన సీతాదేవిని వెదుకుటకై చదలవాడ కు వచ్చి వానర సైన్యాన్ని పిలిపించారట. ఇక్కడ నుండి వానర సైన్యాన్ని 4విభాగాలుగా విభజించి, 4 దిక్కులకు సీతాదేవి ని వెతికేందుకు పంపించారని చరిత్ర. అప్పుడు ఈ గ్రామానికి చతుర్వాటి అనే పేరు రాగా, కాలక్రమేణా చదలవాడ గా పేరుగాంచిందని స్థల పురాణం చెబుతోంది.
అగస్త్య మహర్షి ప్రతిష్టించిన ఆలయం ఇదే..! 1450 ఏళ్ల క్రితం అగస్త్య మహర్షి చదలవాడకు వచ్చిన క్రమంలో చదలవాడ శ్రీ రఘునాయక స్వామి ఆలయాన్ని ప్రతిష్టించారని చరిత్ర. అలాగే ఆలయ విమాన గోపుర కలశం క్రీస్తు శకం 461 సంవత్సరంలో ప్రతిష్ట జరిగినట్లుగా ఇక్కడి కలశంపై లిఖించబడి నేటికీ ఉంది. అలాగే ఇక్కడ కవిత్రయంలోని ఎర్రా ప్రగడ మహాకవి ఈ అలయంలోనే కూర్చొని మహాభారతాన్ని తెలుగులోకి అనువదించినట్లు అనవాళ్లన్నాయి.
సాధారణంగా దేశ వ్యాప్తంగా శ్రీ రఘునాయక స్వామి తూర్పుకు అభిముఖంగా దర్శనమిస్తారు. కానీ ఇక్కడ దేశంలో ఎక్కడా లేని విధంగా స్వామివారు దక్షిణ వైపులో భక్తులకు దర్శనమిస్తారు. అంతేగాక ఈ ఆలయంలో స్వామి వారికి కుడి వైపున సీతాదేవి, ఎడమ వైపున లక్ష్మణుడు ఉంటారు. ఇక్కడ స్వామి వారి కళ్యాణం శ్రీరామ నవమి తర్వాతే చదలవాడ లో శ్రీ రఘునాయక స్వామి కళ్యాణం శ్రీరామ నవమి తర్వాతే నిర్వహించడం ఆనవాయితీ. స్వామి వారి కళ్యాణాన్ని తిలకించేందుకు, జిల్లాల నుండే కాకుండా, దేశ విదేశాల నుండి వస్తారు. అశేషంగా హాజరైన భక్త జనసందోహం మధ్య స్వామి వారి కళ్యాణం వైభవంగా నిర్వహిస్తారు.
గరుత్మంతుడి ప్రదక్షిణ తర్వాతే తలంబ్రాలు..
చదలవాడ శ్రీ రఘునాయక స్వామి ఆలయానికి ఎన్నో, ఎన్నెన్నో చారిత్రక దృశ్యాలు నేటికి భక్తుల కనులకు కనువిందు చేస్తాయి. ప్రధానంగా ఇక్కడ శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించాలంటే గరుత్మంతుడి ప్రదక్షిణ జరగాల్సిందే. ఆ కళ్యాణం రోజు గరుత్మంతుడి రాక కై స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రసన్నుడైన గరుత్మంతుడు ఆలయ ప్రతిష్ట నుండి ఇప్పటి వరకు ప్రతి ఏడాది స్వామి వారి కళ్యాణం జరిపేందుకు వస్తారని భక్తుల విశ్వాసం. గరుత్మంతుడు ఆలయం, గాలి గోపురం 3 సార్లు ప్రదక్షిణ చేసే దృశ్యాలు ఇక్కడ చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు.
గరుత్మంతుడి ప్రదక్షిణ తర్వాతే స్వామి వారి కళ్యాణం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. అయితే గరుత్మంతుడి రాకను కెమెరాలలో బంధించేందుకు భక్తులు అత్యంత ఆసక్తి కనబరుస్తారు. కోరిన కోర్కెలు తీర్చే గరుడ ప్రసాదం భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం గా ఇక్కడి గరుడ ప్రసాదం ప్రఖ్యాతి. స్వామి వారి కళ్యాణం అనంతరం గరుడ ప్రసాదాన్ని భక్తులకు అందజేస్తారు. గరుడ ప్రసాదం స్వీకరిస్తే చాలు, ఏ కోరికైనా నెరవేరుతుందని ఇక్కడి భక్తుల విశ్వాసం.
అందుకే కళ్యాణం రోజు భక్తుల రాకతో ఆలయం కిటకిటలాడుతుంది. ఈ ఏడాది మార్చి-31 నుండి ఏప్రియల్-22 వరకు స్వామి వారి కళ్యాణ మహోత్సవం నాగులుప్పలపాడు మండలం చదలవాడ లో వెలసిన చదలవాడ శ్రీ రఘునాయక స్వామి కళ్యాణ మహోత్సవంలు ఈ నెల 31 నుండి 22 ఏప్రియల్ వరకు నిర్వహించనున్నట్లు అర్చక స్వామి భాగవతుల అరుణాచార్యులు తెలిపారు. ప్రతి రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఏప్రియల్ 7న వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య స్వామి వారి కళ్యాణం నిర్వహిస్తామన్నారు. కళ్యాణ మహోత్సవాలకు హాజరయ్యే భక్తుల సౌకర్యార్థం అన్న ప్రసాద సౌకర్యం ఉందన్నారు. మరి ఇంతటి ఘన చరిత్ర కలిగి, గరుత్మంతుడి ప్రదక్షిణ ల సాక్షిగా జరుగుతున్న శ్రీ సీతారాముల కళ్యాణం చూసేందుకు భక్తాదులారా రండి ... స్వామి వారి కళ్యాణం చూసి తరించండి!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Prakasham dist, Sri Rama Navami 2023