Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati
ఈ రోజుల్లో సంపాదన అంటే సాఫ్ట్ వేర్ ఉద్యోగమే. కానీ కొందరు రైతులు మాత్రం సరైన పద్ధతుల్లో పండించి సాఫ్ట్ వేర్ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఆదీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కరవు జిల్లాల్లో ఒకటిగా చెప్పుకునే ప్రకాశం జిల్లా (Prakasham District) లో. ప్రకాశం జిల్లా పేరు చెప్పగానే ఎవరికైనా కరవు గుర్తుకు వస్తుంది. జిల్లాలో 6 మండలాలు మినహా అన్ని మండలాల్లో నీటి కొరత ఉంది. ప్రకాశం జిల్లా రెయిన్ షాడో ఏరియాలో ఉండటంతో ఇక్కడ వర్షాలు కూడా తక్కువగానే పడుతూ ఉంటాయి. దీనికితోడు ప్రభుత్వాల నిర్లక్ష్యం తోడైంది. భారీ ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయకుండా ఏళ్ల తరబడి సాగదీస్తున్నారు. దీంతో ప్రకాశం జిల్లాలో సాగునీటికి రైతులు కటకటలాడుతున్నారు. అందుకే రైతులు తక్కువ నీటితో ఎక్కవ దిగుబడి ఆదాయం వచ్చే దానిమ్మ సాగును ఎంచుకున్నారు.
గతంలో అనంతపురం జిల్లా (Anantapuram District) లో ఈ పంట ఎక్కువగా సాగు చేసేవారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోనూ క్రమంగా విస్తరిస్తోంది. ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని చందలూరు, చలివేంద్ర, వెంకటాచలపల్లి గ్రామాల్లో దానిమ్మ సాగు ఎక్కువగా జరుగుతోంది. మండలం మొత్తం మీద 1200 ఎకరాల్లో దానిమ్మ సాగవుతోంది. చందలూరులో భగువా రకం సాగు చేస్తున్న రైతులు మంచి సైజుతోపాటు మంచి ధర పొందుతున్నారు. చందలూరుకు చెందిన కోటిరెడ్డి, సుబ్బారెడ్డిలాంటి కొందరు రైతులు 20 నుంచి 30 ఎకరాల్లో దానిమ్మ సాగు చేస్తూ లక్షలు ఆర్జిస్తున్నారు.
రెండేళ్లు కష్టపడితే రెండు దశాబ్దాల దిగుబడి
దానిమ్మ మొక్కలు నాటిన తరవాత 2 సంవత్సరాలు కష్టపడితే 20 సంవత్సరాల పాటు దిగుబడినిస్తున్నాయి. నాలుగైదు సంవత్సరాల వరకు ఎకరాకు 2 నుంచి 5 టన్నుల దిగుబడి వస్తుంది. ఆ తరవాత ఎకరాకు 6 నుంచి 8 టన్నుల దిగుబడినిస్తుంది. గతంలో టన్ను రూ.80 వేల ధర ఉండేది. కరోనా తరవాత ప్రజలు దానిమ్మ తినడానికి అలవాటు పడ్డారు. దీంతో బెంగళూరు నుంచి పొలాల వద్దకే వస్తున్న వ్యాపారులు టన్ను లక్షా 20 వేల నుంచి లక్షా 40 వేలకు కొనుగోలు చేస్తున్నారు. ఎకరాకు 6 నుంచి 8 టన్నుల దిగుబడి రావడంతో ఖర్చులు పోను రైతులు ఎకరాకు రూ.6 లక్షలు ఆర్జిస్తున్నారు.
సవాళ్లు కూడా ఉన్నాయి
దానిమ్మ సాగులో రైతులు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు. బోర్లు వేయడానికి, డ్రిప్ ఇరిగేషన్ కోసం లక్షలు ఖర్చు చేస్తున్నారు. కొన్ని రకాలు తెగుళ్లు తట్టుకోలేకపోతున్నాయి. సరైన మొక్కలు లభించకపోతే రైతులు తీవ్ర నష్టాలను కూడా చవిచూస్తున్నారు. కొత్తగా పంట వేసే వారు భగువా వెరైటీ నాటుకోవాలని ఉద్యానశాఖ అధికారులు సలహా ఇస్తున్నారు. దర్శి ప్రాంతం నుంచి క్రమంగా జిల్లా అంతటా దానిమ్మ సాగు విస్తరిస్తోందని అధికారులు తెలిపారు. ప్రభుత్వం నుంచి కూడా సహకారం తోడైతే జిల్లా రైతులకు ఈ పంట చాలా అనుకూలంగా ఉంటుందని రైతు సంఘాల నాయకులు భావిస్తున్నారు. 90 శాతం రాయితీపై డ్రిప్ సిస్టమ్ సరఫరా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculture, Andhra Pradesh, Prakasham dist