జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్నారు. గుడివాడ సమీపంలోని డోకిపర్రి గ్రామంలో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పవన్ కల్యాణ్ తో పాటు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామంలో మేఘా ఇంజనీరింగ్ సంస్థ అధినేత కృష్ణారెడ్డి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి గుడివాడ మీదుగా డోకిపర్రు చేరుకున్న పవన్ కల్యాణ్ కు ఆలయ అర్చుకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో కలిగదిరిగిన పవన్ కల్యాణ్.. అనంతరం వెంకన్నకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా ఆయన అభిమానులు భారీగా తరలివచ్చారు. ఎయిర్ పోర్ట్ నుంచి డోకిపర్రు వరకు ఆయనతో కలిసి ర్యాలీగా వెళ్లారు. ఆలయంలో పూజల అనంతరం పవన్ కల్యాణ్ విజయవాడ వెళ్లినట్లు జనసేన వర్గాలు తెలిపాయి.
ఇటీవల కృష్ణాజిల్లాలో పర్యటించిన పవన్ కల్యాణ్ నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించారు. రైతులకు ఎకరాకు రూ.35వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవాలంటూ ఒకరోజు దీక్ష చేపట్టారు. అనంతరం ఉదయ్ పూర్ ప్యాలెస్ వేదికగా జరిగిన తన అన్న నాగబాబు కుమార్తె నిహారిక వివాహానికి హాజరయ్యారు. అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్న అనంతరం పవన్ కృష్ణాజిల్లాకు విచ్చేశారు.
Published by:Purna Chandra
First published:December 12, 2020, 15:25 IST