ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో వేసవి కరెంట్ కోతలు (Summer Power Cuts) తప్పేలా లేవు. విద్యుత్ ఉత్పత్తికంటే డిమాండ్ పెరిగే అవకాశముండటంతో ప్రస్తుతమున్న బొగ్గు నిల్వలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత ఏడాది అక్టోబర్ నెలలో కారణంగా రాష్ట్రంలో కరెంట్ కోతలు విధించిన సంగతి తెలిసిందే. ఎన్టీపీసీకి బకాయిలు చెల్లించకపోవడంతో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడ్డాయి. ఆ ప్రభావం ఏపీలోని కొన్ని జిల్లాలపై బాగానే పడింది. ఐతే వేసవి కాలం మొదలైనందున మరోసారి విద్యుత్ ఉత్పత్తి అంశం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో బొగ్గు కొనుగోళ్లు, విద్యుత్ అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలు ఆటకంగా మారాయి. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో నాలుగు రోజులకు సరిపడా మాత్రమే బొగ్గు నిల్వలు ఉండటం, బొగ్గు కొనుగోళ్లపై కేంద్రం నియంత్రణ విధించడం ఆందోళన కలిగిస్తున్నాయి.
వేసవి కోసం బొగ్గు నిల్వ ఉంచుకునేందుకు ప్రతి ఏడాది అక్టోబర్ నుంచి జనవరి వరకు బొగ్గు నిల్వలు పెంచుతాయి. సమ్మర్ సీజన్ లో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 225 మిలియన్ యూనిట్లకు పెరిగే ఛాన్స్ ఉంది. వేసవిలో కనీసం 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉంచితేనే డిమాండ్ కు తగ్గట్లు విద్యుత్ సరఫరా చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మన రాష్ట్రానికి రోజువారీ అవసరాలక మాత్రమే కోల్ ఇండియా నుంచి బొగ్గు సరఫరా అవుతోంది. సింగరేణి, మహానది కోల్ ఫీల్డ్ నుంచి రావాల్సినంత బొగ్గు రావడం లేదు. వేసవి సన్నద్ధతలో భాగంగా రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు 20 ర్యాక్ ల బొగ్గును కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కానీ కేంద్రం మాత్రం ఆ మేరకు కూడా ఇవ్వకుండా కేవలం 10-12 ర్యాక్ లు మాత్రమే పంపిస్తోంది.
ప్రస్తుతం ఏపీలో రోజుకు 200 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. రాష్ట్రంలో 5,010 మెగావాట్ల విద్యుత్ సామర్ధ్యంతో థర్మల్ విద్యుత్ కేంద్రాలున్నాయి. వీటి నుంచి 85 మిలియన్ యూనిట్లు, జలవిద్యుత్ కేంద్రాల నుంచి 8.5 మిలియన్ యూనిట్లు, సోలార్ పవర్ ప్లాంట్ల నుంచి 2.4 మిలియన్ యూనిట్లు ఇలా మొత్తం 97 మిలియన్ యూనిట్ల మేర ఉత్పత్తి అవుతోంది. ఇందులో 92 మిలియన్ యూనిట్లు మాత్రమే గ్రిడ్ కు వెళ్తోంది. అంటే రోజువారీ డిమాండ్ లో 45 శాతం ఏపీ జెన్ కో ద్వారానే ఉత్పత్తి అవుతోంది. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రోజుకు 60వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం అవుతోంది. ఎన్టీపీసీ, కృష్ణపట్నం, ఆర్టీపీపీలో కేవలం నాలుగు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే అందుబాటులో ఉంది.
ఐతే బొగ్గు కొరతను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ జెన్ కో ప్రయత్నాలు సాగిస్తున్నా.. కేంద్రం నుంచి సరైన స్పందన రావడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. వేసవిలో నిరాటంకంగా విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుకు వెనుకాడటం లేదు. ఐతే కొరత రాకుండా బొగ్గు నిల్వ చేసుకోవాలంటూ సలహా ఇస్తున్న కేంద్రం.. బొగ్గు కేటాయింపులు మాత్రం పెంచడం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Power cuts