హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Temple Destructions: ఆలయాలపై దాడుల వెనుక రాజకీయ నేతలు.. వెల్లడించిన ఏపీ డీజీపీ

AP Temple Destructions: ఆలయాలపై దాడుల వెనుక రాజకీయ నేతలు.. వెల్లడించిన ఏపీ డీజీపీ

ఏపీ డీజీపీ సవాంగ్ (ఫైల్ ఫోటో)

ఏపీ డీజీపీ సవాంగ్ (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్‌లో పలు ఆలయాలపై దాడుల వెనుక రాజకీయ నేతల ప్రమేయం ఉందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. అందులో టీడీపీ, బీజేపీ నేతల హస్తం ఉందని వెల్లడించారు. 17 మంది టీడీపీ నేతలు, నలుగురు బీజేపీ నేతల హస్తం ఉందని డీజీపీ సవాంగ్ స్పష్టం చేశారు.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్‌లో పలు ఆలయాలపై దాడుల వెనుక రాజకీయ నేతల ప్రమేయం ఉందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. అందులో టీడీపీ, బీజేపీ నేతల హస్తం ఉందని వెల్లడించారు. 17 మంది టీడీపీ నేతలు, నలుగురు బీజేపీ నేతల హస్తం ఉందని డీజీపీ సవాంగ్ స్పష్టం చేశారు. ఇప్పటికే 13 మంది టీడీపీ నేతలు, ఇద్దరు బీజేపీ నేతలను అరెస్ట్‌ చేసినట్లు డీజీపీ సవాంగ్‌ పేర్కొన్నారు. ఏపీలో మతవిద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అదే సమయంలో ఆలయాలపై దాడుల్ని రాజకీయం చేయొద్దని ఆయన రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. మతాల మధ్య వైషమ్యాలు సృష్టించేవారిపై కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్చలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరుగకుండా ఆలయాల వద్ద సీసీ కెమెరాలతో భద్రత పెంచుతున్నామని తెలిపారు.

  రాష్ట్రంలో ఆలయాలపై దాడుల కేసుల్లో 335 మందిని అరెస్ట్ చేశామని రెండు రోజుల క్రితం డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఇందులో 175 కేసులను చేధించామని చెప్పారు. 2020-21లో ఆలయాలపై దాడులకు సంబంధించి 44 పెద్ద ఘటనలు జరిగాయన్నారు. వీటిల్లో 29 కేసులను చేధించామని... 85 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. ఆలయాల భద్రత కోసం 23,256 గ్రామాల్లో 15,394 గ్రామ రక్షక దళాలను ఏర్పాటు చేశామని డీజీపీ తెలిపారు. ఇప్పటివరకు 58,871 ఆలయాలకు జియో ట్యాగింగ్‌తో అనుసంధానం చేశామని వివరించారు. 43,824 సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు నిరంతర నిఘా ఉంచామన్నారు.

  మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రార్థనా మందిరాల పై జరుగుతున్న దాడులకు సంబంధించిన సమాచారం తెలియ జేయడానికి హెల్ప్ లైన్ నెంబర్ 9392903400 ను కేటాయించారు. కాబట్టి ప్రజలందరూ దీనిని సామాజిక బాధ్యతగా స్వీకరించి, సమాచారం తెలిస్తే వెంటనే ఈ నెంబర్కు సమాచారం అందజేయాలని పోలీసులు కోరుతున్నారు. రాష్ట్రంలో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే వారి సమాచారం అందజేసి శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని , సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని ఎస్పీ తెలిపారు.

  వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాస్టర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

  తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన ప్రవీణ్ చక్రవర్తి అనే పాస్టర్ ను సీఐడీ రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకుంది. గుంటూరుకు చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఫిర్యాదుతో ప్రవీణ్ ను అరెస్ట్ చేశారు. ఇతర మతాలను కించపరిచేలా యూట్యూబ్ లో వీడియోలు పోస్ట్ చేయడమే కాకుండా., తానే విగ్రహాలను ధ్వంసం చేశానని, కొన్నిచోట్ల విగ్రహాలను కాలితో తన్నానంటూ వీడియోలో పేర్కొన్నాడు. ఏడాది క్రితం పోస్టైన వీడియో వైరల్ గా మారడంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ఇతర మతాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వంటి అభియోగాలతో ప్రవీణ్ చక్రవర్తిని అరెస్ట్ చేసినట్లు సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ తెలిపారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Andhra Pradesh, AP DGP, AP Temple Vandalism

  ఉత్తమ కథలు