అమరావతి ఇక భ్రమరావతేనా? రాజధానిపై ఏపీలో కలకలం

Andhra Pradesh : అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే వైసీపీ అధికారంలోకి వస్తే, రాజధాని అమరావతి నుంచీ తరలిపోతుందనే వాదన వినిపించింది. తాజాగా మంత్రి బొత్స వ్యాఖ్యలు ఆ వాదనను బలపరుస్తున్నాయా?

Krishna Kumar N | news18-telugu
Updated: August 21, 2019, 5:41 AM IST
అమరావతి ఇక భ్రమరావతేనా? రాజధానిపై ఏపీలో కలకలం
బొత్స సత్యనారాయణ, చంద్రబాబు
  • Share this:
2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోలవరం, అమరావతి నిర్మాణమే ప్రధాన అజెండాలుగా టీడీపీ... ప్రచార బరిలో దిగగా... వైసీపీ మాత్రం ఆ రెండు అంశాల కంటే... నవరత్నాల పథకాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి... ప్రచారం సాగించింది. ఇందుకు ప్రధాన కారణం... ఆ పార్టీ అధికారంలోకి వస్తే, పోలవరం పనులను నిలిపేస్తుందనీ, రాజధానిని అమరావతి నుంచీ మరో చోటికి తరలించేస్తుందనే వాదన అప్పట్లో వినిపించింది. దీనిపై టీడీపీ జోరుగా ప్రచారం చెయ్యడంతో... అప్పట్లో వైసీపీ నేతలు... ఆ వాదనను తప్పుపడుతూ కౌంటర్లు ఇచ్చారు. కానీ... ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చాక... పోలవరం నిర్మాణాల్ని నిలిపేస్తూ... రివర్స్ టెండరింగ్‌ నిర్ణయం తీసుకోవడం ఒక అంశమైతే... తాజాగా రాజధాని అమరావతి విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్లు కలకలం రేపుతున్నాయి.

అమరావతి ప్రాంతంలో నిర్మాణ వ్యయం సాధారణ ప్రాంతాల్లో నిర్మాణ వ్యయం కంటే డబుల్ అవుతోందని మంత్రి బొత్స అన్నారు. దాని వలన ప్రజాధనం దుర్వినియోగమవుతోందని అభిప్రాయపడ్డారు. కృష్ణానది వరదలతో అమరావతిలో మునిగిపోయే ప్రాంతాలు ఉన్నాయని తెలిసిందన్న ఆయన... వరదల నుంచి రక్షణ పొందేందుకు కాల్వలు, జలాశయాలు నిర్మించాల్సి ఉంటుందని చెప్పారు. దీనివల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని అన్నారు. ఈ క్రమంలో రాజధానిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందదని... త్వరలోనే ప్రకటన చేస్తామని తెలిపారు బొత్స.

బొత్స వ్యాఖ్యల సారాంశం... రాజధానిని తరలించడమే అంటోంది టీడీపీ. ఇప్పటికే అమరావతిలో నిర్మాణాలు ఆగిపోయి, రియల్ ఎస్టేట్ పడిపోయిందన్న చంద్రబాబు... బొత్స వ్యాఖ్యలతో పూర్తిగా చెడుతోందన్నారు.

ప్రస్తుతం మంత్రి బొత్స వాదనను బట్టీ చూస్తే... అమరావతి నిర్మాణం ప్రస్తుతానికి అటకెక్కినట్లే కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆల్రెడీ ఉమ్మడి రాజధానిగా మరో ఐదేళ్లు హైదరాబాద్ ఉంటుంది కాబట్టి... వైసీపీ ప్రభుత్వం... ఇప్పటికిప్పుడు రాజధానిని నిర్మించేందుకు సిద్ధంగా లేకపోయివుండొచ్చని అభిప్రాయపడుతున్నారు.



కమిటీ ఏం చెప్పింది? : రాజధానికి సంబంధించి శివరామకృష్ణన్ నిపుణుల కమిటీ... ఎక్కడ రాజధానిని నిర్మించాలో చెప్పలేదు. కానీ.... విజయవాడ-గుంటూరు పరిసరాల్లో రాజధాని ఉండాలని 53 శాతం మంది కోరుకుంటున్నారని మాత్రం చెప్పింది. అందువల్ల అప్పటి టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంచుకుంది. రాజధానిలో భవనాలు, ఇతరత్రా నిర్మాణాల కోసం రూ.27097 కోట్లు, ఏపీ అభివృద్ధికి రూ.4,49,505 కోట్లు అవసరమని అంచనా వేసింది. రైతులు 34010 ఎకరాల్ని ప్రభుత్వానికి ఇచ్చారు. వాటిలోంచీ రాజధాని ప్రాంతంగా 8603 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఎంపిక చేసింది. దానికి అమరావతి అని పేరు పెట్టింది. ఆ వెంటనే అక్కడి భూముల రేట్లు అమాంతం పెరిగాయి. రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా ఊపందుకుంది.

ప్రస్తుతం రాజధానిలో నిర్మాణాలు ఆగిపోయాయి. రోడ్ల పనులు కూడా సాగట్లేదు. రియల్ ఎస్టేట్ పడిపోయింది. కేంద్రం కూడా పెద్దగా సహకరించట్లేదు. జస్ట్ రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వం రాజధానిపై గట్టిగా అడగకపోవడాన్నీ అనుకూలంగా తీసుకుంటున్న కేంద్రం... ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదంటున్నారు విశ్లేషకులు. వైసీపీ ప్రభుత్వం కూడా అమరావతి నిర్మాణానికి బడ్జెట్‌లో రూ.500 కోట్లు మాత్రమే కేటాయించింది.

రాజధాని తరలిపోతుందా ? : ఇప్పుడు ఇదే ప్రశ్న ఏపీ ప్రజల్లో తలెత్తుతోంది. ప్రభుత్వ ఆలోచన ఏంటన్నది స్పష్టం కావాల్సి ఉంది. రాజధానిగా అమరావతే ఉంటుందని స్వయంగా సీఎం వైఎస్ జగన్ ఓ ప్రకటన చేస్తే తప్ప... అమరావతి భయాలు తొలగే అవకాశాలు లేవు. టీడీపీ ప్రభుత్వ డిజైన్లను తప్పించేందుకే మంత్రి బొత్స ఇలాంటి వ్యాఖ్యలు చేశారా లేక... నిజంగానే రాజధానిని మరో చోటికి తరలించే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందా అన్నది త్వరలో స్పష్టమయ్యే అవకాశాలున్నాయి.
First published: August 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...