హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: దుర్గగుడిపై వెండి సింహాలు చోరీ చేసింది అతడేనా..? పోలీసుల విచారణలో సంచలన నిజాలు

Andhra Pradesh: దుర్గగుడిపై వెండి సింహాలు చోరీ చేసింది అతడేనా..? పోలీసుల విచారణలో సంచలన నిజాలు

విజయవాడ దుర్గగుడి

విజయవాడ దుర్గగుడి

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ (Kanakadurga temple) రథంపై వెండి సింహాల చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు.

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ రథంపై వెండి సింహాల చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ పాతనేరస్తుడు చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. గతేడాది సెప్టెంబర్ లో ఆలయంలోని వెండిరథంపై ఉన్న మూడు సింహాల ప్రతిమలు గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. అప్పట్లో ఈ వ్యవహారంపై తీవ్రదుమారం రేగింది. ఆలయ పాలకమండలి, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే చోరీ జరిగినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీనిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు మూడు ప్రత్యేక బృందాలతో విచారణ జరిపించారు. ఆలయంలో పనిచేసే సిబ్బందితో పాటు ఆయంలో పనిచేసే ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో విచారణ జరిపినా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు.

  ఇక ఆలయంలో సీసీ ఫుటేజ్ కూడా లేకపోవడంతో ఆలయంలో పనిచేసే సిబ్బందే ఇలా చేశారన్న ఆరోపణలు వినిపించాయి. దాదాపు నాలుగు నెలల పాటు విచారణ జరిపిన పోలీసులు కేసులో పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. ఐతే ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు ఓ దొంగతనం కేసులో బాలకృష్ణ అనే పాతనేరస్థుడ్ని అదుపులోకి తీసుకొని విచారించగా దుర్గగుడిలో సింహాల ప్రతిమలు తానే దొంగతనం చేసినట్లు అంగీకరించినట్లు సమాచారం. దీంతో పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు.., విజయవాడ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

  బాలకృష్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడ్ని విచారిస్తున్నారు. దొంగతనం ఎప్పుడు చేశాడు..? వెండి సింహాల ప్రతిమలను ఏం చేశాడనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ కేసు విచారణలో ప్రభుత్వంతో పాటు పోలీసులు కూడా తీవ్ర విమర్శలెదుర్కొన్నారు. తాజాగా దొంగ దొరకడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఓ దశలో ఆలయ సిబ్బందే సింహాలను కాజేశారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. కేసులో కీలక పురోగతి లభించడంతో సిబ్బంది కూడా హమ్మయ్య అనుకుంటున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Andhra pradesh news, AP Temple Vandalism, Theft, Vijayawada, Vijayawada Kanaka Durga

  ఉత్తమ కథలు