ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కిడ్నాప్ కు గురైన బాలిక కేసును పోలీసులు ఛేదించారు. కేవలం మూడు గంటల్లోనే పోలీసులు కిడ్నాపర్లను పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే రాజమండ్రిలోని ఇన్నీసుపేట దుర్గమ్మ గుడి వీధికి రాము చిన్న కుమార్తె చిన్నారి రోహిణి ఇంటి ఎదుట ఆడుకుంటోంది. అదే సమయంలో అక్కడికి బైక్ పై వచ్చిన ఓవ్యక్తి లేస్ ప్యాకెట్ కొనిస్తానంటూ బాలికను తీసుకెళ్లాడు. చిన్నారి కనిపించకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు చుట్టుకపక్కల ఇళ్లలో గాలించారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా గాలింపు చర్యలు ప్రారంభించారు. దీంతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన గాలింపు చర్యలు ప్రారంభించారు.
అసలు కథ ఇదీ..
కొన్ని రోజుల క్రితం ఇద్దరు మహిళలు పాపను పెంచుకుంటామని తమను అడిగిన విషయాన్ని చిన్నారి తండ్రి రాము పోలీసులకు తెలిపారు. దీంతో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దుర్గమ్మగుడి వీధి ప్రాంతంలో సీసీ ఫుటేజ్ లతో పాటు స్థానికంగా నివాసముండే సత్యనారాయణ అనే వ్యక్తి కనిపించకపోవడంతో అతన్ని కూడా గాలించారు. చివరకు పోలీసులు రోహిణి.. సత్యనారాయణే కిడ్నాప్ చేసినట్లు తేల్చారు. దేవరాపల్లి మండలం, తిరుగుడుమెట్ట వద్ద ఉన్నట్లు గుర్తించి వెంటనే అక్కడి చేరుకొని బాలికను రక్షించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన సీతారత్నం, జ్యోతి అనే మహిళలు చిన్నారిని పెంచుకుంటామని అడగడంతో సత్యనారాయణ బాలికను అపహరించినట్లు విచారణలో చెప్పాడు. దీంతో సదరు మహిళలను కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
కంప్లైంట్ చేసిన మూడు గంటల్లోనే చిన్నారిని రక్షించిన పోలీసులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇళ్లకు వచ్చి చెప్పే మాటలు నమ్మొద్దని పోలీసులు చెప్పారు. కొవిడ్ వ్యాక్సిన్లు, మాస్కులు, బ్యాంక్ రుణాలు, ప్రభుత్వ పథకాల పేరుతో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులను గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.