GT Hemanth Kumar, Tirupathi, News18
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ దొరకని అరుదైన ఎర్ర బంగారం.., ఎర్ర చందనం (రెడ్ శాండల్). చిత్తూరు, కడప జిల్లాలోనే గ్రేడ్-1 నాణ్యత గల ఎర్ర చందనం లభ్యమవుతుంది. విదేశాల్లో ఎర్ర చందనంకు ఉన్న డిమాండే వేరు. ఈ డిమాండ్ కు అనుగుణంగా పొరుగు రాష్ట్రమైన తమిళనాడు నుంచే కాకుండా.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోనూ కొందరు బడా స్మగ్లర్లు ఎర్రచందన్నాన్ని అటవీ ప్రాంతం నుంచి బోర్డర్ దాటించేస్తున్నారు. ఇదంతా క్లియర్ గా పుష్ప (Pushpa Movie) సినిమాలో చాలాచక్కగా చూపించాడు డైరెక్టర్ సుకుమార్. పోలీసుల కళ్లుగప్పి ఎర్రచందనాన్ని చెక్ పోస్టులు ఎలా దాటిస్తారో పుష్పలో ఉంటుంది. ఇప్పుడు రియల్ గానూ ఎర్రస్మగ్లర్లు పుష్పరాజ్ ను ఫాలో అయిపోతున్నారు. అలాంటి ఘటనే చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. సినిమాటిక్ వేలో ఎర్ర చందనం అక్రమ రవాణా చూస్తే ఔరా అనాల్సిందే...?
ఎర్ర చందనం స్మగ్లర్లకు పుష్ప సినిమా ఒక ఇన్ స్పిరేషన్ గా మారుతోంది. ఒక్కో సీన్లో ఒక్కోలా ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుంటుంది. అందులో ముఖ్యంగా పాలవ్యాన్ సీన్ హైలెట్. పైన పాలు.. కింద ఎర్రచందనం దుంగలను పెట్టి ఎంచక్కా ఊరుదాటిస్తుంటాడు పుష్పరాజ్. తాజాగా సేమ్ సీన్ రిపీట్ చేసి పోలీసులకు అడ్డంగా చిక్కారు స్మగ్లర్లు. ఓ యువకుడు చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మూలపల్లె అటవీ ప్రాంతం నుండి ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేసేందుకు సేమ్ టు సేమ్ పుష్పరాజ్ ని ఫాలో అయిపోయాడు.
తన వద్ద ఉన్న గూడ్స్ క్యారియర్ వ్యాన్ కు స్పెషల్ గా సెల్ఫ్ ఏర్పాటు చేసుకుని దుంగలు రవాణాకు సిద్ధపడ్డాడు. ఎవరికీ అనుమానం రాకుండా వాహనంలోని పైభాగంలో టమోటా ట్రేలను ఉంచాడు. దానికి క్రింద భాగంలో ఎర్రచందనం దుంగలు దాచి స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఐతే అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి సంచరిస్తున్నట్లు స్ధానికులు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అటవీ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల గ్రామాలను జల్లెడపట్టగా వేగంగా వెళ్తున్న మినీ ట్రక్ ను గుర్తించారు. ఐదు కిలోమీటర్ల పాటు ఆ వ్యాన్ ను ఛేజ్ చేశారు.
ఈ క్రమంలో వాహనం అదుపుతప్పి అడవిలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత ట్రక్ ను స్వాధీనం చేసుకొని తనిఖీ చేయగా.. పుష్పరాజ్ శిష్యుడు వెలుగులోకి వచ్చాడు.ట్రక్ పై భాగంలో టామాటాలు.. అడుగు భాగంలో ఎర్రచందనం దుంగలు దొరికాయి. వాహనంతో పాటు 14 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chittoor, Red sandal