Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో కీలకఘట్టం.. ప్రపంచంలో ఇదే మొదటిసారి..

పోలవరం ప్రాజెక్టు(ఫైల్ ఫొటో)

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కీలకదశకు చేరుకుంది. ప్రాజెక్టు గేట్లు అమర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణతో పనులు ఊపందుకుంటున్నాయి. ఇరిగేషన్ శాఖ కూడా అనుకున్న సమయానికి ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. తాజాగా ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన పద్ధతిలో పోలవరం ప్రాజెక్టు గేట్లు బిగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ప్రాజెక్టుకు ఎంతో కీలకమైన 48గేట్ల ఏర్పాటు కోసం అవసరమైన ఇరుసుల ఏర్పాట్లకు మేఘా ఇంజనీరింగ్ కంపెనీ రెడీ అయింది. స్పిల్ వే పిల్లర్ల నిర్మాణం 55 మీటర్ల ఎత్తుకు చేరుకోవడంతో గేట్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచంలోనే పెద్దవైన ఆర్మ్ గడ్డర్లను పోలవరం ప్రాజెక్టు గేట్లకు ఉపయోగిస్తున్నారు.

  బాహుబలి గేట్లు..
  ఒక్కో గేటు బరువు 300 టన్నులు ఉంటుంది. మొత్తం గేట్లకు 18వేల టన్ను స్టీల్ ను వినియోగిస్తున్నారు. ప్రాజెక్టు గేట్లు పైకి ఎత్తడానికి, కిందకి దించడానికి, వరదనీటిని విడుదల చేయడానికి హైడ్రాలిక్ పద్ధతని వినియోగించబోతున్నారు. హైడ్రాలిక్ పద్ధతిలో గేట్ల ఏర్పాటు మన దేశంలో పోలవరం ప్రాజెక్టుతోనే ప్రారంభంకానుంది. గేట్ల ఏర్పాటుకు అవసరమైన 98 సిలిండర్లను జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఇరిగేషన్ శాఖ మరియు మేఘా ఇంజనీరింగ్ నిపుణులు ప్రాజెక్టు పనులను దగ్గరుండి పరిశీలిస్తున్నారు.

  ఇవీ విశేషాలు
  ఒక్కోగేటు 20.835మీటర్లు ఎత్తు,15.96 మీటర్లు వెడల్పు ఉంటుంది. ఒక్కో గేట్ కు 8 ఆర్మ్ గడ్డర్లు., 4 హారిజంటల్ గడ్డర్లు ఉంటాయి. గేటుకు కుడిపక్కన నాలుగు, ఎడమ పక్కన నాలుగు ఆర్మ్ గడ్డర్లు బిగిస్తారు. మొత్తం 12 గడ్డర్లు ఉంటాయి. ఇలా 48 గేట్లకు సంబంధించి 384 ఆర్మ్ గడ్డర్లు, 192 హారిజాంటల్ గడ్డర్లు ఉంటాయి. ఒక్కో ఆర్మ్ గడ్డర్ 16 మీటర్లు పొడవు ఉంటుంది. ఆర్మ్ గడ్డర్లు, హారిజంటల్ గడ్డర్లు అసెంబ్లింగ్ చేసిన తరువాత స్కిన్ ప్లేట్ అమర్చుతారు. ఈ ఆర్మ్ గడ్డర్లు సాయంతో గేట్లకు సంబందించిన స్కిన్ ప్లేట్ ను పైకి లేపుతారు. గేట్లను ఎంత ఎత్తుకు గేటును లేపాలనుకుంటే అంత ఎత్తులో లేపడానికి ఈ ఆర్మ్ గడ్డర్లు ఉపయోగపడతాయి. ట్రూనియన్ గడ్డర్లకు ప్రిస్ట్రెస్సింగ్ చేసి ఈ ఆర్మ్ గడ్డర్లు ఏర్పాటు చేస్తారు. ఇక ఒక్కో గేటుకు ఎనిమిది స్కిన్ ప్లేట్లు ఉంటాయి. వీటన్నింటినీ అసెంబుల్ చేస్తే గేటు తయారు అవుతుంది.

  టార్గెట్-2022
  ఇటీవల పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం వైఎస్ జగన్ పరిశీలించిన సమయంలో గేట్ల ఏర్పాటుకు సంబంధించిన వివరాలను అధికారులు వివరించారు. అలాగే 2022 ఖరీఫ్ నీరందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికే పనులు అన్నీ సక్రమంగా పూర్తి చేసి 2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అవుతుందని 2022 ఖరీఫ్ నాటికి నీళ్లందిస్తామని ప్రాజెక్ట్ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.
  Published by:Purna Chandra
  First published: