ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో నదులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి నది (Godavari River) ఉగ్రరూపం దాల్చింది. జూలై నెలలో ఎన్నడూ లేనంతగా వరద నీరు పోటెత్తడంతో పరిసర గ్రామాలు నీటమునుగుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రపంచంలోనే అతిపెద్దదైన పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) రికార్డుస్తాయిలో వరదనీటిని విడుదలచేస్తోంది. ఈ స్పిల్ వే లోని అతిపెద్దవైన 48 హైడ్రాలిక్ గేట్లు తొలిసారిగా అతి తక్కువ సమయంలోనే పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చాయి. ఆకస్మాత్తుగా వచ్చిన వరదను నియంత్రించే విధంగా హైడ్రాలిక్ పద్ధతిలో ఏర్పాటు చేసిన గేట్లు విజయవంతంగా అన్నీ ఒకేసారి అతి తక్కువ సమయంలోనే 15 లక్షల క్యూసెక్కుల నీటిని స్పిల్ చానెల్ మీదుగా గోదావరిలోకి విడుదల చేశాయి.
నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ గేట్లు నిర్వహణలో బాలరిష్టాలు ఉంటాయి. పోలవరం ప్రాజెక్ట్ ఇంకా నిర్మాణంలో ఉంది. స్పిల్ వేలోని ప్రధానమైన పనులన్నీ పూర్తయ్యాయి. గేట్లను ప్రపంచంలోనే అతిపెద్ద స్థాయిలో అందులోనూ హైడ్రాలిక్ పద్ధతిలో పనిచేసే విధంగా అమర్చారు. మొత్తం 48 గేట్లన్ని ఏకకాలంలో ఎత్తడం ద్వారా వాటి పనితీరు సమర్థంగా ఉందని నిరూపించడంతో పాటు వరద నీటిని సులువుగా 6 కిలోమీటర్ల మేర అప్రోచ్ ఛానెల్, స్పిల్ వే, స్పిల్ ఛానెల్, పైలెట్ ఛానెల్ మీదుగా గోదావరిలోకి విడుదల చేయడంలో గేట్ల పాత్ర కీలకంగా మారింది.
100 ఏళ్ళలో గోదావరికి రికార్డు స్దాయి వరద
గతంలో ఎన్నడూ లేనివిధంగా సీజన్ మొదట్లోనే గోదావరి నదికి భారీఎత్తున వరదలు వస్తున్నాయి.ఇలా గోదారికి వరదలు రావడం 100ఏళ్ళ చరిత్రలో ఇదే మొదటి సారి అని అంటున్నారు ఇరిగేషన్ అధికారులు.ఐతే ఎగువ నుండి వచ్చే భారీ వరదలను తట్టుకోవడానికి పోలవరం ప్రాజెక్టును ముందస్తుగానే సిద్దంగా ఉంచారు.స్పిల్ వే నుండి వరద నీటిని దిగువకు విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేశారు.స్పిల్ వే లో గతేడాది వరదల సమయానికే 48గేట్లకు గానూ 42రేడియల్ గేట్లు అమర్చడంతో పాటు,వాటిని ఎత్తడానికి అవసరమైన 84హైడ్రాలిక్ సిలిండర్లనూ అమర్చారు. అదేవిధంగా 24పవర్ ప్యాక్ సెట్లను సైతం స్పిల్ వే పై అమర్చి గేట్లను ఆపరేట్ చేశారు.
రివర్ స్లూయిజ్ గేట్లు
పోలవరం ప్రాజెక్టులో రేడియల్ గేట్లతో పాటు డెడ్ స్టోరేజి లెవల్ లో రివర్ స్లూయిజ్ గేట్లు ఉంటాయి. మొత్తం 10 రివర్ స్లూయిజ్ గేట్లు, వాటికి ఒక్కో గేటుకు రెండు చొప్పున 20హైడ్రాలిక్ సిలిండర్లు, వాటిని ఆపరేట్ చేయడానికి 10 పవర్ ప్యాక్ సెట్లు ఉంటాయి. స్పిల్ వే దగ్గరకు వచ్చిన వరదను ముందుగా రివర్ స్లూయిజ్ గేట్ ద్వారానే విడుదల చేస్తారు.వీటిని గతేడాదే అమర్చి ముందుగా వచ్చిన వరదను ఈగేట్ల ద్వారానే విడుదల చేశారు.రిజర్వాయర్ లో డెడ్ స్టోరేజి ఉన్న సమయంలో గోదావరి డెల్టాకు త్రాగు,సాగునీరు అందించడానికి ఈగేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తారు.
ప్రపంచంలోనే ఎక్కువ వరద విడుదల చేసే గేట్లు:
పోలవరం స్పిల్ వే లో అమర్చిన 48రేడియల్ గేట్ల ద్వారా 50లక్షల క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేసేలా డిజైన్ చేశారు. చైనాలోని త్రిగార్జెస్ డ్యాం 41లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేసేవిధంగా డిజైన్ చేస్తే పోలవరం ప్రాజెక్టు లో మాత్రం 50లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకుని విడుదల చేసేవిధంగా రూపొందించారు. అంతేకాకుండా 100ఏళ్ళ చరిత్రను ఆధారంగా చేసుకుని పోలవరం స్పిల్ వేను,గేట్లను డిజైన్ చేశారు నిపుణులు. వందేళ్ళలో గోదావరికి 36లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన చరిత్ర ఉందని అందుకే 50లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వేను,గేట్లను డిజైన్ చేశారని అన్నారు మేఘా ఇంజనీరింగ్ సంస్ద సిజిఎం ఎం.ముద్దుకృష్ణ. ఒక్కో రేడియల్ గేటు 16మీ వెడల్పు,20మీ పొడవు,300మెట్రిక్ టన్నుల బరువుతో రోజుకు 432 టిఎంసిలు వరద నీటిని దిగువకు విడుదల చేసే సామర్ద్యం తో పోలవరం ప్రాజెక్టు రేడియల్ గేట్లను డిజైన్ చేశారు.
సిద్దంగా ఉన్న స్టాఫ్ లాగ్ గేట్లు:
పోలవరం ప్రాజెక్టులో 48రేడియల్ గేట్లకు 96హైడ్రాలిక్ సిలిండర్లు ఉంటాయి.వాటిని ఆపరేట్ చేయడానికి 24పవర్ ప్యాక్ సెట్లు ఉంటాయి. ఒక్కో పవర్ ప్యాక్ సెట్ సాయంతో రెండు గేట్లను ఆపరేట్ చేయవచ్చు.అదేవిధంగా రేడియల్ గేట్లు ఆపరేట్ చేసే సమయంలో ఏదైనా సాంకేతిక సమస్య వచ్చినా లేదా గేట్లకు ఏవైనా అడ్డుపడినప్పుడు ముందుగా స్టాఫ్ లాగ్ గేట్లను దించి అడ్డంకులను,లేదా సాంకేతిక సమస్యలను పరిష్కరించి ఆతరువాత రేడియల్ గేట్లను ఆపరేట్ చేస్తారు.దీనికోసం పోలవరం ప్రాజెక్టులో 5సెట్ల స్టాఫ్ లాగ్ ఎలిమెంట్స్ ను సిద్దంగా ఉంచారు.17మీ వెడల్పు,21మీ ఎత్తుతో వీటిని డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈస్టాఫ్ లాగ్ గేట్లు కూడా పూర్తి స్దాయిలో అందుబాటులో ఉన్నాయి. ఏదేమైనా పోలవరం ప్రాజెక్టుకు వచ్చే భారీ వరదను తట్టుకుని దిగువకు విడుదల చేసేవిధంగా స్పిల్ వే రేడియల్ గేట్లను పూర్తిస్దాయిలో సిద్దంగా ఉంచడం జరిగింది. ప్రస్తుతం పోలవరం స్పిల్ వే గేట్లనుండి 15లక్షల క్యూసెక్కులకుపైగా వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Floods, Godavari river, Polavaram