అసలే కరోనా కష్ట కాలం.. అందులోనూ లాక్డౌన్ సమయం.. అర్ధరాత్రి సమయంలో ప్రజలంతా మంచి నిద్రలో ఉన్నారు. విశాఖ నగరం ప్రశాంతంగా ఉంది. ఒక్కసారిగా ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి పెద్దమొత్తంలో ప్రమాదకర విష వాయువు లీక్ అయ్యింది. గాల్లోకి వ్యాపించి చుట్టుపక్కల ప్రజల్ని పట్టేసింది. వారికి శ్వాస ఇబ్బంది మొదలు, ఊపిరి సలపకుండా తయారైంది. అసలేం జరుగుతుందో తెలీకుండా అయిపోయింది. కళ్లు మండిపోతున్నాయి. కడుపులో నొప్పి, వాంతులు, తల తిప్పడం.. ఇలా పరిస్థితి మొత్తం ప్రాణాలను హరించుకుపోతున్నట్లు తయారైంది. ఇదీ విశాఖ ఎల్జీ పాలిమర్స్, ఆర్ఆర్ వెంకటాపురం పరిసరాల్లో గత అర్ధరాత్రి చోటుచేసుకున్న ప్రమాదకర ఘటన.
గ్యాస్ లీక్ కాగానే ప్రజల మానసిక పరిస్థితి ఆందోళనగా తయారైంది. చుట్టూ ఉన్న ఐదు గ్రామాల ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని భయంతో పరుగులు తీశారు. కొందరు రోడ్లపై పడిపోయారు. లేవలేని స్థితికి చేరుకున్నారు. తమకే తెలీకుండా ఏదో జరుగుతోంది.. అయినా అచేతన స్థితికి జారుకున్నారు. దాదాపు 3 కిలోమీటర్ల మేర వ్యాపించిన ఈ విషవాయువుతో.. కొందరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అధికారులకు సమాచారం అందడంతో.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని తీవ్ర అస్వస్థతకు గురైన వందల మందిని ఆస్పత్రులను తరలిస్తున్నారు.చుట్టూ ఉన్న 5 గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేసి, సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.