PIL FILED IN HIGH COURT FOR SEEKING CBI ENQUIRY ON YS VIVEKANANDA REDDY MURDER CASE NK
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐ దర్యాప్తు చెయ్యాల్సిందే... హైకోర్టులో పిల్ దాఖలు
వైఎస్ వివేకానంద రెడ్డి (File)
YS Vivekananda Reddy Murder Case : ఓవైపు సిట్ దర్యాప్తు చేస్తుండగా... దర్యాప్తు దాదాపు కొలిక్కి వస్తున్న టైంలో హైకోర్టు ఏం చెబుతుందన్నది ఆసక్తి రేపుతోంది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దాదాపు కొలిక్కి వస్తున్న సమయమిది. నాల్రోజులుగా సిట్ అధికారులు, పులివెందుల పోలీసులూ... ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 20 మందికి నిందితులను ప్రశ్నించి, కీలక ఆధారాలు సేకరించారు. ఒకట్రెండు రోజుల్లో దర్యాప్తు పూర్తయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలో... ఈ కేసును సీబీఐతోనే దర్యాప్తు జరిపించాలంటూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్రగడ్డ అనీల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)పై తమకు నమ్మకం లేదన్నారు ఆయన. ఈ కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించి, అసలు దోషులకు శిక్ష పడేలా చెయ్యాలని హైకోర్టులో కోరారు. ఈ పిటిషన్పై హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది.
వైసీపీ అధినేత జగన్ సహా చాలా మంది వైసీపీ నేతలు ఈ కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలని హత్య జరిగిన రోజు నుంచే కోరుతున్నారు. ఏపీ ప్రభుత్వం మాత్రం సిట్ దర్యాప్తు సరిపోతుందని తేల్చింది. మరి హైకోర్టు ఏమంటుందన్నది ఆసక్తి రేపుతుంది.
ఒకవేళ పిటిషనర్ అభిప్రాయంతో ఏకీభవిస్తే, సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఆదేశించే అవకాశాలున్నాయి. అదే జరిగితే, వైసీపీ అది తమ నైతిక విజయంగా చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ సిట్ దర్యాప్తు సరిపోతుందని హైకోర్టు అంటే, అది టీడీపీ ప్రభుత్వానికి మేలు చేసే నిర్ణయం అవుతుంది. ఐతే హైకోర్టు వెంటనే నిర్ణయం చెప్పకుండా... రాష్ట్ర ప్రభుత్వాన్ని కౌంటర్ అఫిడవిట్ దాఖలు చెయ్యమని కోరే అవకాశాలున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.