లాక్‌డౌన్ సమయంలో మళయాళం (Malayalam) డబ్బింగ్ సినిమాలు మీలో చాలా మంది చూసే ఉంటారు. అందులో ఎక్కువగా సీరియల్ కిల్లింగ్స్ (Serial Killings).. మిడ్ నైట్ మర్డర్స్ (Midnight Murders) ఇలానే సాగుతుంటాయి. అక్కడ సైకో (Psycho) ఒకే రకంగా మర్డర్స్ చేస్తూ తన ఐడెంటిటీని తెలిసేలా పోలీసులకు సవాల్ విసురుతుంటాడు. దానికి ఆ సైకోని ఎవరో మోసం చేయడమో.. అవమానించడమో కారణం అయ్యుంటది. సరిగ్గా అలాంటి సీరియల్ కిల్లింగ్సే ఉత్తరాంధ్ర జిల్లాలను వణికిస్తున్నాయి. విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని గనిశెట్టిపాలెం గ్రామానికి చెందిన అప్పికొండ దేవుడు, భార్య లక్ష్మి, కుమారుడు సతీశ్‌తో కలిసి ఉపాధి కోసం విశాఖ జిల్లా పెందుర్తి వచ్చారు. సుజాతనగర్ నాగమల్లి లే అవుట్ సమీపంలో ఒక బిల్డింగ్‌కి ఈ కుటుంబం వాచ్‌మెన్‌గా చేరింది. అక్కడే పక్కన ఒక చిన్న రేకుల షెడ్డు వేసుకుని కుటుంబం అందులో ఉంటుంది. అయితే, ఆదివారం రోజు వాళ్లకి దగ్గర్లోని కొత్త బిల్డింగ్‌కి స్లాబ్ పని జరగడంతో అందులో పనిలోకి వెళ్లారు. అదే రోజు రాత్రి భోజనం చేశాక లక్ష్మీ స్లాబ్ పని చేసిన భవనం దగ్గర.. దేవుడు తాముండే బిల్డింగ్ దగ్గరే కాపలా కాస్తూ అక్కడే నిద్రపోయాడు.
అయితే, అర్ధరాత్రి సమయంలో భార్య లక్ష్మి వద్దకు దేవుడు వచ్చి నిద్రలేపాడు. ఎంతకీ పలకకపోవడంతో ఆమెపై ఉన్న దుప్పటిని తొలగించడంతో ముఖం, తలపై తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సరిగ్గా ఇలాంటి ఘటనలే జులై 9న, ఆగస్టు 7న జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. భవనాల వద్ద వాచ్‌మెన్‌లుగా ఉండే వాళ్లని టార్గెట్ చేసే హత్యలు జరుగుతున్నాయి. జులై 9న పెందుర్తి సమీపంలోని దొగ్గవానిపాలెంలో ఇదే తరహాలో బొబ్బిలిదరి ఎ.వెలగవలస గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై దాడి జరిగింది. ఈ ఘటనలో తల్లీకుమారులకు ముఖంపై తీవ్రగాయాలయ్యాయి. ఆగస్టు 7వ తేదీ అర్ధరాత్రి చినముషిడివాడ దరి సప్తగిరినగర్‌లో బిల్డింగ్ దగ్గర కాపలాగా ఉన్న దంపతులను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలన్నీ పెందుర్తి దగ్గర జరిగిన ఘటనతో పోలి ఉండటంతో ఇవన్నీ ఒకే వ్యక్తి చేసినవేనా అని తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు.
అయితే, ఈ వరుస ఘటనలతో అప్రమత్తమైన పోలీసులకు సోమవారం తెల్లవారుజామున దట్టమైన పొదల నుంచి వస్తున్న అనుమానాస్పద వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతని షర్ట్ లోపల గొడ్డలి లాంటి ఇనుపరాడ్డు ఉండటంతో స్టేషన్‌కి తీసుకెళ్లి విచారిస్తున్నారు. ఈ మూడు హత్యలు, మరో ఇద్దరిపై దాడి చేసింది ఇతనేనా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన వ్యక్తి కొన్నేళ్ల కింద భార్యతో విడిపోయి ఒంటరిగా ఉంటూ.. ఆడవాళ్లపై ద్వేషం పెంచుకుని సైకోలా ప్రవర్తిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని పెందుర్తి పోలీసులు చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Murders, Visakhapatnam, Vizianagaram