కడప జిల్లాలో వరుసగా చోటుచేసుకుంటున్న హత్యలపై ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (పీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు భయాందోళనలతో బతుకుతున్నారని.. ఎప్పుడెవరి ప్రాణాలు పోతాయో తెలియని దుస్థితి నెలకొందని సంచలన ఆరోపణలు చేశారు. నిన్న కడప జిల్లాలోని ప్రొద్దుటూరు లో హత్యకు గురైన నందం సుబ్బయ్య మృతదేహానికి పూలమాల వేసి నివాళిలర్పించిన తులసిరెడ్డి.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై విరుచుకుపడ్డారు. తులసిరెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో, ప్రత్యేకించి కడప జిల్లాలో సీయం జగన్మోహన్ రెడ్డి పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా గాడి తప్పాయని అన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేని దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎప్పుడు ఎవరికి నూకలు చెల్లుతాయో అర్థంకాని పరిస్థితి నెలకొన్నదని ఆయన అన్నారు.
రాష్ట్రంలో రాక్షస రాజ్యం, రౌడీ రాజ్యం రాజ్యమేలుతున్నదని.. రాష్ట్రాన్ని రావణ కాష్టంలా తయారుచేశారని తులసిరెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో నాలుగు, ఐదు నెలలో అనేక మంది హత్యలకు గురయ్యారని తులసి రెడ్డి ఆరోపించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందని.. వాటిని కాపాడలేక పోతే వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన అన్నారు.
సీఎంగా కొనసాగలంటే నిందితులను, నకిలీ హంతకులను కాకుండా అసలైన హంతకులను తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సీఎం ప్రోద్బలంతోనే తాడిపత్రి లో ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి.. స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రౌడీయిజం చేస్తే వైస్సార్సీపీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని ఆయన ప్రశ్నించారు.
కడప జిల్లా జిల్లా ప్రొద్దుటూరులో నిన్న (డిసెంబర్ 29)న టీడీపీ నేత నందం సుబ్బయ్యను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. పేదలకు ఇళ్ల స్థలాల కింద ఎంపిక చేసిన ప్లాట్లలోనే సుబ్బయ్యను కత్తులతో నరికి చంపారు. ప్రస్తుతం నందం సుబ్బయ్య టీడీపీ జిల్లా అధికార ప్రతినిథిగా ఉన్నారు. రాజకీయ కక్షలతోనే ప్రత్యర్థులు సుబ్బయ్యను హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హంతకులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సుబ్బయ్య హత్య నేపథ్యంలో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు మీద వరుసగా రెండు రోజులు తీవ్ర ఆరోపణలు చేసిన తర్వాత సుబ్బయ్యకు గురి కావడంతో అధికార పార్టీ నేతలే ఈ హత్య చేయించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhrapradesh, Ap cm ys jagan mohan reddy, AP Congress, Kadapa